విష్లేషణ :’సాహో’ ప్రభాస్ కి ప్లస్సా…మైనసా?!

‘సాహో’ ప్రభాస్ కు కలిసొచ్చిందా

ప్రభాస్ ప్రతిష్టాత్మక చిత్రం’సాహో’ విడుదలై ఇప్పటికి దాదాపు మూడు వారాలు అవుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ లోనూ సాహో బిజినెస్ దాదాపు ముగిసినట్లే లెక్క. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ..సాహో చాలా చోట్ల భారీ నష్టాలను మిగల్చగా కొన్ని ఏరియాలలో పెట్టిన డబ్బు వచ్చి బయటపడ్డారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా … సాహో నార్త్ ఇండియా లో దుమ్మురేపింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ కు కలిసివచ్చినట్లా లేక మైనస్ అయ్యిందా అనేది చర్చనీయాంశంగా మారింది.

సాహో హిందీ వెర్షన్ కలెక్షన్స్ చూస్తే మంచి హిట్ . వాస్తవానికి ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా మలచటంలో ప్రభాస్ ఆశించింది అదే. హిందీ మార్కెట్. అంటే ఈ లెక్క ప్రకారం ప్రభాస్ కు ఏమికావాలో అదే సాహో ద్వారా అందింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే… తెలుగులో సాహో ఫ్లాఫ్ అవటం వలన ప్రభాస్ ఇమేజ్ కి వచ్చిన ష్టం ఏమీ లేదు. అలాగే ఆయన క్రేజ్ ఏమీ తగ్గిపోలేదు. అదే హిందీలో కనుక సాహో ఫెయిల్ ఉంటే బాహుబలి వచ్చిన క్రేజ్ మొత్తం పోయేది. అది ప్రభాస్ కు భారీ నష్టమే. కాబట్టి సాహో విషయంలో ప్రభాస్ నష్టపోయింది తక్కువ. లాభ పడిందే ఎక్కువ.

ఇక ‘సాహో’ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి, టాప్-5 అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచినా, ఓవర్సీస్ లో మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలనే మిగల్చనుందని అంచనా. వాస్తవానికి ఈ సినిమాకు కాస్తంత నెగటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. మరో పెద్ద హీరో సినిమా లేకపోవడం, ‘సాహో’కు ప్లస్ పాయింట్ అయింది. దీంతో కలెక్షన్లు భారీగానే వచ్చాయి.

మరో ప్రక్క ఓవర్ సీస్ లో మూడు మిలియన్ డాలర్ల మార్క్ ను అధిగమించిన తెలుగు సినిమాలు కేవలం ఐదు. వాటిల్లో మూడు ప్రభాస్ వే, బాహుబలి రెండు భాగాలతో పాటు, రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు 3 మిలియన్ డాలర్ల మార్క్ ను క్రాస్ చేయగా, ఇప్పుడు సాహో ఆ ఫీట్ ను అందుకుంది.