కోరి వివాదాల్లో ఇరుక్కోవడం.. తనకు తోచింది మాట్లాడటం హీరో విశ్వక్‌సేన్‌కి అలవాటుగా మారింది. `ఫలక్‌నుమాదాస్` సమయంలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టి మరీ వారితో సోషల్ మీడియా వేదికగా రచ్చ చేసి వార్తల్లో నిలిచాడు విశ్వక్‌సేన్.
ఆ తరువాత `ఫలక్‌నుమాదాస్` సినిమాకు రేటింగ్ ఇచ్చిన మీడియాని టార్గెట్ చేస్తూ బుక్ లైవ్‌లో బూతులు తిట్టి అడ్డంగా బుక్కయ్యాడు. ఆ తరువాత తను ఆ ఉద్దేశంతో అనలేదని, అందుకు తాను చింతిస్తున్నానని తనపై వివాదం పెరగకుండా మీడియాని దువ్వే ప్రయత్నం చేశాడు.
తాజాగా మరోసారి నోరు జారి ఏకంగా హిట్ చిత్రాల దర్శకుడినే అవమానించడం ఆసక్తికరంగా మారింది. విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ చిత్రం `ఎఫ్2`. ఫ్యామిలీ ఎంటర్‌టైర్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. దాదాపు వంద కోట్లు వసూలు చేసింది.
ఈ సినిమా విశ్వక్‌సేన్‌కి నచ్చలేదట. 15 నిమిషాలు చూసేపరికి బుర్రహీటెక్కిపోయిందట. ఇది ఎలా ఆడిందో తనకు అర్థం కాలేదని, వసూళ్లని ఎలా రాబట్టిందో తెలియదని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిని అవమానించినట్టే అంటున్నారు. కోట్లు వసూలు చేసిన సినిమా విశ్వక్‌సేన్ దృష్టిలో విలువ ఇంతేనా? అని అంతా వాపోతున్నారు. ఈ వ్యాఖ్యలపై అనిల్ రావిపూడి ఎలా స్పందిస్తాడా అని ఎదురుచూస్తున్నారు.