లాక్ డౌన్ తో జనజీవనం స్థంబించిపోయింది. ఎక్కడి వాళ్లు అక్కడే గప్ చుప్. డాక్టర్లు..ఆరోగ్య శాఖ సూచనలు పాటిస్తూ అంతా ఇళ్లకే పరిమితయ్యారు. దాదాపు సెలబ్రిటీలంతా అవేర్ నెస్ తీసుకొచ్చే ప్రయత్నంచేస్తున్నారు. సినీ కార్మికులను ఆదుకుంటున్నారు. అయితే అప్పుడప్పుడు లాక్ డౌన్ ఉల్లంఘనలు బయటపడుతున్నాయి. మొన్న ఒక హీరోయిన్ లాక్ డౌన్ నియమం ఉల్లంఘించి రోడ్ పై పిల్లర్ ని గుద్ది గాయాల పాలైంది. ఇలాంటి చెదురుముదురు ఘటనలు ఇప్పటికే బయటపడ్డాయి. తాజాగా ప్రభాస్ 20 (జాన్) టీమ్.. యూవీ క్రియేషన్స్ లాక్ డౌన్ నియమం ఉల్లంఘించడం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. నిబంధనల్ని గాలికొదిలేసి తమ సినిమాలకు సంబంధించిన పనులను ప్రారంభించడం చర్చనీయాంశమైంది. పదుల సంఖ్యలో ఉద్యోగుల్ని పనిలోకి దించేయడం అంతటా చర్చకు దారి తీసింది. దీంతో హీరో ప్రభాస్ వాళ్లందరిపైనా సీరియస్ అయ్యారని సమాచారం. రోజు కూలీలు పనుల్లేక పస్తులంటే మీరంతా నాకు తెలియకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటారా? అంటూ సీరియస్ అయ్యారట.
గతంలో తాను చేసిన తప్పును మరోసారి యూనిట్ కి గుర్తు చేసారు. అసలు వివరాల్లోకి వెళితే.. జాను షూటింగ్ ఇప్పటికే కొద్ది భాగం పూర్తయిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన పొస్ట్ ప్రొడక్షన్ పనులు యూవీ నిర్మాతలు ఆదేశించడంతో ఇటీవలే మొదలు పెట్టారుట. ఇది ల్యాబ్ లో జరిగే వర్క్..మన వాళ్లెవరికి జలుబు..దగ్గు..జ్వరం లాంటివి లేవు కాబట్టి పనిచేసుకున్నా ఏమీ కాదని ప్రభాస్ కి తెలియకుండా స్టార్ట్ చేసేసారుట. దీంతో ఈ విషయం ప్రభాస్ కి తెలియడంతో వెంటనే తన స్నేహితులైన వంశీ..ప్రమోద్ లను మందలించాడుట. అటుపై పనిచేస్తోన్న వారిని హెచ్చరించాడుట. ఏసీ ల్యాబ్ ల్లో పనులు చేయొద్దని..ఒకే చోట అంతా గుమిగూడవద్దని తరుచూ హెచ్చరిస్తుంటే అర్ధం కాలేదా? అంటూ సీరియస్ అయ్యాడుట.
దీనికి అసలు కారకులు నిర్మాతలు కాబట్టి వాళ్లపైనే బాగా సీరియస్ అయినట్లు సమాచారం. పనిచేస్తోన్న వాళ్ల ఆరోగ్యం మీకు పట్టదా? అంటూ సదరు నిర్మాతలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడుట. చైనాలో కరోనా వ్యాప్తి చెందుతోన్న సమయంలో ప్రభాస్ ముక్కుకి మాస్క్ కట్టుకుని జార్జియా ప్లైట్ ఎక్కి ఎంత రిస్క్ తీసుకున్నాడో? తెలిసిందే. అప్పటికి ఇండియాలో కేసులు లేకపోవడంతో దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. తర్వాత పరిస్థితిని తెలుసుకుని జాన్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ ప్రభాస్ వెనక్కి వచ్చిన సంగతి తెలిసిందే.