గత రెండేళ్ల నుంచి ఇదిగో వస్తా.. అదిగో వస్తా అంటూ ఎప్పటికప్పుడు తన రాజకీయ అరంగేట్రాన్ని వాయిదా వేస్తూ వస్తున్న తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ గురువారం తన రాజకీయ ఎంట్రీపై స్పష్టతనివ్వబోతున్నారు. పార్టీ పేరుని `మక్కల్ మండ్రమ్` అని పార్టీ గుర్తుగా `బాబా` చిత్రంలోని సింబల్‌ని నిర్ణయించి ఇప్పటికే ప్రకటించిన రజనీ తన పార్టీ క్రియాశీలంగా ఎప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశిస్తుంది?. ఎప్పుడు పోటీకి దిగుతుంది? అన్న విషయాల్ని మాత్రం ఇప్పటి వరకు చెప్పకుండా సస్పెన్స్‌ని మెయింటైన్ చేస్తూ వచ్చిన తలైవా ఈ గురువారం వాటన్నింటికీ క్లారిటీ ఇవ్వబోతున్నారట.
తన రాజకీయ అరంగేట్రంపై చెన్నైలో గురువారం ప్రత్యేకంగా మీడియాతో సమావేశం కానున్నారని, తన రాజకీయ ప్రణాళికని వివరంగా వివరించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ రజనీతో కలిసి వెళ్లేది ఎవరు? ఆయనని విభేదించేది ఎవరన్నది రజనీ ప్రెస్ మీట్ తరువాత వచ్చే విమర్శలతో స్పష్టం కానుందని ఇప్పటికే తమిళనాట ప్రచారం జోరందుకుంది. జాతీయ ఛానల్స్‌తో పాటు కీలక మీడియా వర్గాలు కూడా రజనీ రాజకీయ అరంగేట్రంపై వరుస కథనాల్ని ప్రచురిస్తున్నాయి. మరికొన్ని గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెరపడబోతోంది.