ర‌జ‌నీ ట్వీట్‌లో ఏముంది.. ఎందుకు డెలిట్ చేశారు?

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా అడ్డుక‌ట్ట వేయాలంటే సామాజిక దూరం పాటించాల‌ని, ఇందు కోసం ప్ర‌ధాని జ‌న‌తా క‌ర్ఫ్యూని ఆదివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు పాటించాల‌ని సూచించారు. దీనిపై ప‌లువురు సినీ స్టార్స్ మ‌ద్దుతా నిలిచి సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్‌లు, వీడియోల‌ని షేర్ చేసిన విష‌యం తెలిసిందే. త‌మిళ‌ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ దీనిపై స్పందించారు. దేశంలో క‌రోనా వైర‌స్ మూడ‌వ ద‌శ‌కు వ్యాప్తి చెంద‌కుండా ఈ క‌ర్ఫ్యూ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.

దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ర‌జ‌నీ పోస్ట్ చేసిన వీడియోలో త‌ప్పుడు స‌మాచారం వుంద‌ని దీని వ‌ల్ల ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు అధికం అవుతాయ‌ని నెటిజ‌న్స్ స్పందించారు. ర‌జ‌నీ చేసిన వ్యాఖ్య‌లు దేశంలో క‌రోనా వైర‌స్ మూడ‌వ ద‌శ‌కు చేరుకుంటోంద‌నే అర్థాన్నిస్తున్నాయిని నెటిజ‌న్స్ ర‌జ‌నీ వ్యాఖ్య‌ల్ని త‌ప్పుప‌డుతున్న‌రు. దీంతో ట్విట్ట‌ర్ యాజ‌మాన్యం ర‌జ‌నీ పోస్ట్ చేసిన వీడియోని డెలిట్ చేయ‌డం ప్రాధాన్య‌తను సంత‌రించుకుంది.

అయితే ర‌జ‌నీ ఫ్యాన్స్ మాత్రం నెటిజ‌న్స్‌పై మండిప‌డుతున్నారు. స‌దుద్దేశంతో ర‌జ‌నీ పెట్టిన వీడియోని తొల‌గించ‌డం అన్యాయం అని, ర‌జ‌నీ చేసిన వ్యాఖ్య‌ల్ని వ‌క్ర బుద్దితో చూస్తున్న కొంద‌రు ఆయ‌న‌పై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నంలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.