నేను.. నా నాగార్జున అంటున్న మహేష్
కమిడియన్స్ హీరోలు అవటం ఈ మధ్య ఆనవాయితీగా మారింది. మరీ ముఖ్యంగా జబర్దస్త్ తో పాపులారిటీ తెచ్చుకున్న కమిడియన్స్ తెరపై పెద్దగా రాణించకపోయినా, హీరోలు అవుతున్నారు. ఇప్పటికే చమ్మక్ చంద్ర, ధనరాజు,వేణు వంటి చాలా మంది హీరోలు అవ్వగా ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ‘రంగస్థలం మహేష్ కూడా చేరారు. ‘రంగస్థలం, మహానటి, గుణ 369’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహేశ్ ఆచంట హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘నేను నా నాగార్జున’.
మహేష్ ఆచంట మాట్లాడుతూ– ‘‘జబర్దస్త్’ ప్రోగ్రామ్ ఆపేసి చిన్న చిన్న పాత్రలు చేస్తున్న నేను ఏ అవకాశం వస్తే ఆ సినిమా చేశాను. ‘రంగస్థలం’కి ముందే ఈ చిత్రం చేశాను. ఒక సైకిల్ షాప్ కుర్రాడి కథ ‘నేను నా నాగార్జున’. కథ విన్నప్పుడు మా ఊరిలో రాంబాబు అనే సైకిల్ షాప్ కుర్రాణ్ణి స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమా చేశా. చాలా వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు.
‘‘అష్టకష్టాలు పడి ఈ సినిమా పూర్తి చేశాం. ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు నాకు సాయం చేశారు. వారందరికీ థ్యాంక్స్. మంచి తేదీ చూసుకొని త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత గుండపు నాగేశ్వర రావు. ఆర్.బి. గోపాల్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ జియన్‌ఆర్ క్రియేషన్స్ పతాకంపై గుండపు నాగేశ్వరరావు నిర్మించారు.