టీజర్ చూసారా..అదిరింది
గత కొద్ది రోజులుగా పోస్టర్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న చిత్రం ‘పలాస 1978’. రఘు కుంచె సంగీతం అందిస్తూ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి…. కరుణ కుమార్ దర్శకుడు. ధ్యాన్ అట్లూరి నిర్మాత. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ శుక్రవారం విడుదల చేశారు. చిత్రం టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. శ్రీకాకుళంలోని పలాస చుట్టూ సాగే క్రైం డ్రామా ఇది. నిజ జీవిత పాత్రల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారని చెప్తున్నారు.
ప్రేమించిన అమ్మాయి కోసం హీరో ఎదుర్కొనే కష్టాలు, ఈ నేపథ్యంలో చేసే హత్య చుట్టూ ఈ సినిమా సాగనున్నట్లు టీజర్‌ను బట్టి అర్దమవుతోంది. ‘మేమిటి కత్తిపట్టుకొనా పుట్నాం.. కాలుకు గజ్జె కట్టుకుని దేవుడి ముందు ఆడే జాతిలో పుట్నాం…’ అని రక్షిత్ చివర్లో శ్రీకాకుళం యాసలో చెప్పే డైలాగ్ ఇంట్రస్టింగ్ గా ఉంది.
కరుణ కుమార్ మాట్లాడుతూ– ‘‘చాలా చిత్రాలకు రచన, దర్శకత్వ విభాగంలో పని చేసిన నేను ‘పలాస 1978’ సినిమాతో దర్శకుడవుతున్నా. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నాం’’ అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్ నిర్మింస్తున్నారు. నక్షత్ర, విజయ్ రామరాజు, లక్ష్మణ్ మీసాల, తిరు, ప్రవీణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, కెమెరా: విన్సెంట్ అరుల్.