”మాటలతో కాకుండా సైగల ద్వారా మన భావాల్ని ఎదుటివారికి వ్యక్తం పరచడం అంత ఈజీ కాదు. చాలెంజింగ్‌గా భావించి సైన్ లాంగ్వేజ్‌లో తగిన శిక్షణ తీసుకొని ఈ పాత్రలో నటించాను. హావభావాల విషయంలో తప్పులు దొర్లకుండా ప్రత్యేకంగా ట్యూటర్‌ని పెట్టి నా పాత్రకు సంబంధించిన సన్నివేశాల్ని తెరకెక్కించారు దర్శకుడు. నా పాత్రకు బాగా ఆదరణ లభిస్తోందని” పాయల్‌రాజ్‌పుత్ తెలియజేస్తున్నారు.
‘ఆర్.ఎక్స్ 100’ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకుంది పంజాబీ భామ ‘పాయల్ రాజపుత్’. ఇటీవల విడుదలైన ‘వెంకీ మామ’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంది. లేటెస్ట్‌గా రవితేజతో ‘డిస్కో రాజా’లో నటించింది. రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రం విడుదలయ్యాక మంచి స్పందన వస్తోందని ఆమె చెబుతోంది.
– ఈ సినిమాలో నేను మొదటి సారిగా హెలెన్ అనే మూగ, చెవిటి అమ్మాయి క్యారెక్టర్ చేశాను. మూవీలో నా పాత్ర నిడివి కాస్త తక్కువే.. అయినప్పటికీ ఒక ముఖ్యమైన పాత్ర కావడంతో ఒప్పుకున్నాను. ఆ పాత్ర చేస్తున్నప్పుడు ఛాలెంజింగ్‌గా ఫీలై చేశాను. కథాబలమున్న మంచి సినిమాతో కొత్త ఏడాది ఆరంభమవ్వడం ఆనందంగా ఉంది. సినిమాలో నా పాత్ర నిడివి తక్కువైనా వైవిధ్యమైన నటనను కనబరిచానని అందరూ ప్రశంసిస్తున్నారు.
– సినిమా చిత్రీకరణలో ఉండగా దర్శకుడు వి.ఐ. ఆనంద్ నన్ను కలిసి ఈ కథ వినిపించారు. కథ చెప్తున్నప్పుడే తర్వాత ఏం జరుగబోతుందోనని ప్రతిక్షణం ఎగ్జైటింగ్‌గా ఫీలయ్యాను. అలాగే నా కెరీర్ లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌అవుతుందనే నమ్మకంతో నిడివి గురించి ఆలోచించకుండా అంగీకరించాను.
– ఈ సినిమాతో రవితేజగారు నాకు టీచర్‌గా మారిపోయారు. ఓకే గైడ్‌గా, స్నేహితుడిగా నా కెరీర్‌కి సంబంధించిన ఎన్నో విలువైన సూచనలిచ్చారు. కథ పరంగా ఈ సినిమాలో రెట్రో లుక్‌లో కనిపించాల్సి ఉంటుంది. దాని కోసం మా అమ్మగారి సలహాలు తీసుకున్నాను. 1980 కాలంనాటి హెయిర్ స్టయిల్, వస్త్రధారణ, భావవ్యక్తీకరణ ఎలా ఉంటుందో అమ్మ ద్వారా తెలుసుకొని నటించాను. ఆ లుక్‌లో నన్ను చూసి మా అమ్మ చాలా అందంగా కనిపిస్తున్నావు అలాగే చక్కగా నటించావు అని మెచ్చుకుంది.
– ప్రస్తుతం పరదీప్ దర్శకత్వంలో ఒక విమెన్ సెంట్రిక్ ఫిలిం చేస్తున్నాను. ఆ సినిమాలో నేను ఐపిఎస్. ఆఫీసర్‌గా కనిపించబోతున్నాను. చిత్రీకరణ పూర్తయింది. అలాగే ఉదయనిధి స్టాలిన్ సినిమాతో ఈ ఏడాది తమిళంలో అరంగేట్రం చేయబోతున్నాను. అలాగే ఒక కన్నడ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. తెలుగులో కొన్ని స్క్రిప్ట్స్ విన్నాను ఇంకా ఫైనల్ కాలేదు ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు.