1984వ సంవత్సరం . అప్పుడు అక్కినేని నాగేశ్వర రావు హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉండేవారు . ఒక రోజు మధ్యాన్నం నాగేశ్వర రావు గారు నాకు ఫోన్ చేశారు . నేను పనిచేసే ఆంధ్ర జ్యోతి కార్యాలయం సచివాలయం ఎదురుగా మేడ మీద ఉండేది . ఆయన చాలా అవసరం ఉంటే తప్ప ఫోన్ చేయరు .
“సాయంత్రం ఖాళీగా ఉంటే ఓసారి ఇంటికి వస్తారా ?” అన్నారు .
నిజానికి ఆరోజు నాకు ఎదో ప్రెస్ మీట్ వుంది . అయినా “వస్తా సార్ ” అని చెప్పాను .
బంజారాహిల్స్ కు వెళ్ళేటప్పటికి రాత్రి 7. 30 అయ్యింది . అక్కినేని నా కోసం అన్నట్టు ఆఫీసులో కూర్చున్నాడు .
నన్ను చూడగానే నవ్వుతూ ఆహ్వానించారు .
“హాల్లో కూర్చుందాం రండి ” అన్నాడు ఆయన లేస్తూ .
నేను ఆయన్ని అనుసరించాను . అదే మొదటిసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్లడం .
ఎల్ ఆకారంలో వుంది సోఫా, ఇద్దరం కూర్చున్నాము .
“నేను సినిమా రంగంలో ప్రవేశించి ఇప్పటికి 40 సంవత్సరాలు . నిజానికి 1941లో ధర్మ పత్ని సినిమాలో నటించినా 1944లో సీతారామ జననం నుంచి నా కెరీర్ మొదలైనట్టు . ఆ రకంగా చూసుకుంటే ఇప్పటికి 40 సంవత్సరాలు . ఆకాశవాణి వారు ఈ 40 ఏళ్ల నట ప్రస్థానం గురించి మాట్లాడమన్నారు . నేను ఎదో సభల్లో మాట్లాడగలను కానీ మీ జర్నలిస్టుల్లా రాయలేను . అందుకే నేను నా మనసులో మాటలు చెబుతాను , మీరు ప్రసంగంలా వ్రాయాలి ” అన్నారు .
“నేనా … మీ 40 ఏళ్ల సినిమా జీవితం గురించా ?” అన్నాను .
“మీరు రాయగలరు . మద్రాసులో వున్నప్పుడు ముళ్ళపూడి వెంకట రమణ గారు నా ఆలోచనలకు దగ్గరగా వ్రాసేవాడు . హైదరాబాద్ వచ్చాక మీరు మళ్ళీ నా ఆలోచనలకు అనుగుణ్యంగా వ్రాస్తున్నారు “
నేను ఆశ్చర్యపోయాను . నా మీదఆయనకు అంత నమ్మకం ఉన్నందుకు .
” ప్రయత్నం చేస్తా సార్ ” అన్నా .
“థాంక్ యు , మీరు డ్రింక్ తీసుకుంటారా ?”
“లేదు సార్ “
“అలవాటులేదా లేక నా ముందు తీసుకోవడం ఇష్టం లేకనా ?”
“నిజంగానే అలవాటు లేదు సార్ ” అని చెప్పాను .
అక్కినేని లోపాలు వెళ్లి ఓ ట్రేలో రెండు పెగ్గులు , ఒక సోడా , ఒక కూల్ డ్రిక్ గ్లాస్ తో వచ్చారు .
1964లో ఆపరేషన్ జరిగిన తరువాత డాక్టర్ లే ఆయన్ని రెండు పెగ్గులు మందు తాగమని చెప్పారట . అప్పటి నుంచి ప్రతిరోజూ రెండు పెగ్గులు మందులా తీసుకుంటారు .
ఆయన తన సినిమా జీవితంలోని ముఖ్య ఘట్టాలను చెబుతున్నారు .
నేను పాయింట్లు రాసుకుంటున్నా .
“ఒక పల్లెటూరి నుంచి వచ్చిన వాడిని , పట్టణ నాగరికత ఏమాత్రం తెలియని వాడిని . సినిమా మాయ ప్రపంచంలో ఎన్నో అవస్థలు పడ్డాను , అనేక నీలాపనిందలు ఎదుర్కొన్నాను
ఎలాగైనా జీవితంలో పైకి రావాలి , నటుడుగా మంచి పేరు తెచ్చుకోవాలి
సినిమాల్లో రచయితలు రాసే మాటలు భాషపై అవగాహన, పట్టును నేర్పాయి
ఇక ఐదవ తరగతి వరకు మాత్రమే చదివిన నాకు ఇంగ్లీష్ అస్సలు రాదు , అందుకే నెమ్మదిగా ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకుంటూ , హిందూ దిన పత్రిక తెప్పించుకొని చదవడం మొదలు పెట్టాను . పట్టుదల తో ఏదైనా చేసేవాడిని . మొదట్లో చాలా అవస్థలు పడ్డాను . అందరు చక్కగా మాట్లాడుతో ఉంటే వారి వైపు మెచ్చుకోలుగా చూసే వాడిని . అలా నేను కూడా మాట్లాడగలనా ” అనుకునేవాడిని . ప్రయత్నం చేస్తుండేవాడిని .
గొంతు పీల తనం పోవడానికి నీళ్ళల్లో ఉండి ప్రాక్టీస్ చేసేవాడిని .
1949లో లైలా మజ్ను అనే సినిమాలో మజ్ను పాత్రకు ఎంపికైనప్పుడు ఎంత సంతోషించానో , తీరా సెట్స్ మీదకు వెళ్ళినప్పుడు భయం వేసింది .
లైలా మజ్ను సినిమా భానుమతిగారి స్వంత సినిమా . ఆమె భర్త రామ కృష్ణ దర్శకుడు . అప్పటికే భానుమతి గారికి మంచి పేరుంది .
నటి, గాయకురాలు, నిర్మాత . అందుకే ఆమె భుజం మీదా చేయి వెయ్యడానికి భయ పడ్డాను .
నా భయం చూసి ఆమె చొరవ తీసుకుంది “
చెప్పుకుంటూ పోతున్నారు అక్కినేని …!
– భగీరథ