భానుప్రియ ని అరెస్ట్ చేస్తారా?

తిరగతోడిన కేసు, భాను ప్రియను చుట్టుకోనుందా?

కొన్ని వివాదాలు ముగిసిపోయాయనుకున్నా టైమ్ తీసుకుని మళ్లీ ముందుకు వచ్చి ఇరకాటంలో పడేస్తూంటాయి. అందుకు సెలబ్రెటీలు కూడా అతీతులు కాదు. ఇప్పుడు భానుప్రియ అలాంటి సిట్యువేషన్ లోనే ఇరుక్కుంది . నిబంధనలకు విరుద్దంగా మైనర్‌ బాలికను పనిలో నియమించుకున్న నటి భానుప్రియపై ఇప్పుడు చెన్నై పోలీసులు తగిన చర్యలు తీసుకోవటానికి సిద్దపడుతున్నారని తెలుస్తోంది.

ఆ మధ్యన ఓ మైనర్ బాలికను ఇంట్లో పెట్టుకుని , ఆమె చేత పనులు చేయించుకుందని భానుప్రియపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ పిల్ల తమ ఇంట్లో నగలు పట్టుకుపోయిందంటూ భానుప్రియ, ఆమె సోదరుడు పోలీస్ లకు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో ఆ నగల మాట దేవుడెరగు..ముందు తాము ఆ పిల్లను పనిలో పెట్టుకున్నారనే విషయం ధృవీకరించినట్లైంది. దాంతో ఇప్పుడా కేసు ఆమెను చుట్టముట్టబోతోంది.

ఈ క్రైమ్ జరిగింది చెన్నైలో కాబట్టి నటి భానుప్రియపై బాల కార్మికుల చట్టం కింద వారు నమోదు చేసిన కేసును చెన్నై పోలీసులకు ఇటీవల తరలించారు. దీంతో చెన్నై, పాండిబజార్‌ పోలీసులు ఆ కేసుకు సంబంధించి నటి భానుప్రియ,ఆమె సోదరుడు గోపాలకృష్ణన్‌పై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు ఏ క్షణమైనా భానుప్రియను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది.

కేసు వివరాల్లోకి వెళితే..

సామర్లకోట మండలం పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే నిరుపేద మహిళ, ఆర్ధిక పరిస్థితులు బాగోలేని కారణంగా తాను ఇళ్లలో పనిచేసుకుని బతుకుతోంది. అదే క్రమంలో తెలిసున్న వారి ద్వారా ఏడాది క్రితం తన కూతురు సంధ్యను కూడ భానుప్రియ వద్ద పనికి పెట్టింది. మొదట్లో తన కుమార్తెని తరచుగా ఇంటికి పంపుతూ, ఫోన్ లో మాట్లాడిస్తూ బాగానే ఉండేవారు. కానీ ఇప్పుడు తన కుమార్తెని వేధిస్తున్నారు అంటూ ప్రభావతి వాపోయింది.

భానుప్రియ సోదరుడు తన కుమర్తె పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నాడని సంచలన విషయాన్ని బయట పెట్టింది. అతడు తరచుగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని అన్నారామె. తన కుమార్తెని ఇంటికి పంపండి అని ప్రాధేయపడినా అంగీకరించడం లేదు. పైగా దొంగతనం కేసులు పెడతాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని భాదితురాలి తల్లి పేర్కొంది. దాంతో ప్రభావతి ఛైల్డ్‌లైన్‌ 1098 సహాయం కోరింది. దీంతో.. ఛైల్డ్‌లైన్‌ ప్రతినిధులు భానుప్రియపై పోలీసులకు ఫిర్యాదు ఛేశారు.

ఆర్థిక పరిస్థితి బాగాలేక, చుట్టుపక్కల వాళ్ళ సలహాతోనే ఈ పని చేశానని ప్రభావతి తెలిపింది. తన కుమార్తెకు ప్రస్తుతం 14ఏళ్ల వయసు అని ఆమె వివరించింది.