ఆపన్న హస్తం అందించడంలో బన్నీ తర్వాతనే. ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే వెంటనే స్పందించి లక్షల్లో డొనేషన్లు ఇవ్వడం తనకే చెల్లింది. అయితే అతడు కేవలం తెలుగు రాష్ట్రాల వరకే తన సాయాన్ని పరిమితం చేయరు. తన ఫ్యాన్ బేస్ అధికంగా ఉన్న కేరళకు అంతే ఇదిగా ఆర్థిక విరాళాల్ని అందిస్తుంటారు. గతంలో కేరళ వరదల్లో చిక్కుకున్నప్పుడు సుమారు 25 లక్షలు సాయం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సేమ్ టు సేమ్ ఈసారి కూడా భారీగా విరాళాన్ని ప్రకటించి కరోనా సమయంలో ఆదుకున్న దేవుడయ్యాడు.
అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా.. బన్నీ చేస్తున్న ఈ సాయం అక్కడ హీరోల్లో అసూయకు కారణమవుతోందని తెలుస్తోంది. బన్ని సాయం చేస్తున్న ప్రతిసారీ అక్కడ ప్రభుత్వాలు.. మంత్రులు స్థానిక స్టార్లను సిగ్గు తెచ్చుకోవాల్సిందిగా చెబుతున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి ఒక హీరో సాయం అందిస్తుంటే వినోదం చూస్తూ కూచుంటారా? అని తిట్టేస్తున్నారు. కరోనా కల్లోలం తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో టూమచ్ గా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ స్టార్లు మోహన్ లాల్.. మమ్ముట్టి .. మంజు వారియర్ లాంటి వాళ్లు వీడియోలతో జనాల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు కానీ బన్నీలాగా మరీ విరివిగా విరాళాలకు ముందుకు రాలేదన్న విమర్శలు వినిపించాయి. ఏదైతేనేం.. బన్నీ వల్ల అక్కడ స్టార్లు కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు. సేమ్ టైమ్ పొరుగు స్టార్ అయిన బన్నీపై లోలోన ఉడికిపోతున్నారట.
ఇదిలా ఉంటే.. కరోనా కల్లోలం వేళ బన్నీ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కించనున్న ఐకన్ పోస్టర్ రిలీజవ్వడం తెలుగు రాష్ట్రాల్లో వాడి వేడిగా చర్చకొచ్చింది. దిల్ రాజు కావాలనే ఈ పని చేశారా? అంతా మర్చిపోయినా ఇప్పుడు బర్త్ డే విషెస్ పేరుతో ఈ పోస్టర్ దేనికి? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బన్ని త్రివిక్రమ్ తో అల వైకుంఠపురములో చిత్రం తర్వాత సుకుమార్ తో పుష్ప చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక ఐకన్ ఉంటుందా? అన్న చర్చా తిరిగి మొదలైంది. అయితే అసలు ఇలా పోస్టర్ తో షాకిస్తారని బన్నీకి కూడా తెలియనే తెలీదన్న సంగతి హాట్ టాపిక్ గా మారింది.