బ‌న్నీకి `బాహుబ‌లి 2` రిలీజ్ డేట్ కావాల‌ట‌!

అల్లు అర్జున్

అల్లు అర్జున్ `ఈ సంక్రాంతికి `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. దీంతో సంక్రాంతిని సెంటిమెంట్‌గా భావించిన బ‌న్నీ ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో చేస్తున్న‌ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మార్చిలో ప్రారంభించి వ‌చ్చే సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేసుకున్నాడ‌ట‌. అయితే బ‌న్నీ ప్లాన్‌ని రాజ‌మౌళి అప్‌సెట్ చేశాడు. సంక్రాంతికి వారం ముందే అంటే జ‌న‌వ‌రి 8న `ఆర్ఆర్ఆర్‌`ని రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. దీంతో బ‌న్నీ అనుకున్న ప్లాన్ అప్‌సెట్ అయింది.

అయితే తాజాగా ప్లాన్ మార్చుకున్న బ‌న్నీ స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని ఫిక్స‌య్యాడ‌ట‌. ఇదే స‌మ్మ‌ర్‌లో మ‌హేష్ – ప‌ర‌శురామ్‌, ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్‌ల చిత్రాలు కూడా పోటీప‌డ‌బోతున్నాయి. క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్ నూర్తిగా త‌గ్గిపోయాక సుకుమార్‌తో చేస్తున్న సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ప్రారంభించాల‌ని, అదే రోజు రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేయాల‌ని ప‌క్కాగా ప్లాన్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలిసింది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 28 లేదా 29న రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌.

ఈ రెండు డేట్‌ల‌లో `బాహుబ‌లి 2` విడుద‌లైన ఏప్రిల్ 28పైనే బ‌న్నీ క‌న్నేశాడ‌ని తెలిసింది. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్నిసుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో లారీ డ్రైవ‌ర్‌గా బ‌న్నీ క‌నిపించ‌బోతున్న విష‌యం విదిత‌మే. ఇందు కోసం ఇప్ప‌టికే చిత్తూరు భాష‌పై ప‌ట్టు సాధించిన స్టైలిష్ స్టార్ ర‌ఫ్ క్యారెక్ట‌ర్ అయిన లారీ డ్రైవ‌ర్ పాత్ర కోసం స‌రికొత్త మేకోవ‌ర్ లో క‌నిపించ‌బోతున్నాడు. ర‌ష్మ‌క మంద‌న్న ప‌ల్లెటూరి అమ్మాయిగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. అన్న‌ట్టు బ‌న్నీ పుట్టిన రోజు ఈ నెల 8న రాబోతోంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్ లోగోని చిత్ర మేక‌ర్స్ రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.