నటుడవుతున్న డ్రాకులా!!
రామ్ గోపాల్ వర్మ తన కెరీర్ లో చేయని ప్రయోగం లేదు. దర్శకుడిగా.. సంగీత దర్శకుడిగా.. నిర్మాతగా.. గాయకుడిగా ఆయనలోని రకరకాల కోణాల్ని అభిమానులు చూశారు. కొన్నిటిని ఎంజాయ్ చేశారు. మరికొన్నిటిని భరించారు. ఇకపై ఆర్జీవీని వేరొక కోణంలోనూ భరించాల్సి ఉంటుందనే పిడుగులాంటి వార్తా తాజాగా తెలిసింది.
ఇప్పుడు ఆయనలో మరో కోణం బయటికొస్తోందట. అదే నటన. ఆయన పెద్దతెరపై నటుడిగా ఆరంగేట్రం చేస్తున్నారు. అది కూడా ఓ నటుడిని ఇమ్మిటేట్ చేస్తూ అతడిపైనే పంచ్ వేసే క్యారెక్టర్ అని తెలిసింది. ఇంతకీ ఎవరా నటుడు? అంటే.. బండ్ల గణేష్ అని తెలిసింది. బండ్ల గబ్బర్ సింగ్ నిర్మాతగా పవన్ కల్యాణ్ కి అత్యంత సన్నిహితుడిగా ప్రపంచానికి సుపరిచితం.
ఇప్పుడా పాత్రను `పవర్ స్టార్` సినిమాలోకి డ్రాగ్ చేసిన ఆర్జీవీ.. ఫుల్ గా సెటైర్లు వేయనున్నాడట. పవర్ స్టార్ చిత్రంలో చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్, త్రివిక్రమ్ పాత్రలు ఉన్నాయి. పవన్ – త్రివిక్రమ్, పవన్ – చిరంజీవి కాంబినేషన్ పోస్టర్లు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. త్వరలో పవన్ – బండ్ల గణేష్ పోస్టర్లు బయటపడనున్నాయట.
అన్నట్టు ఆర్జీవీకి బండ్లకు ఏమిటి పోలిక? అంటే అలాంటిదేమీ లేదు. జస్ట్ బండ్ల పాత్రలో ఆర్జీవీ నటిస్తాడు అంతే. ఆ పాత్ర నిడివి ఒక నిమిషం పాటు ఉంటుందట. ప్రస్తుతం ఆర్‌జివి బాండ్ల గణేష్ పాత్రలో ఎలా నటించాలి? అన్నది కసరత్తు చేస్తున్నాడట. “అబ్బాబ్బా … అన్నా … నువ్వూ దేవుడివి అన్నా … వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే అన్నా. నీకు తిరుగే లేదన్నా“ అంటూ బండ్ల ఎన్నికల వేళ చేసిన సందడి తెలిసిందే. ఆ తరహా డైలాగులతో వర్మ రచ్చ చేస్తాడట. కేవలం నిమిషం పాటు కనిపించే అతిధి పాత్ర కాబట్టి భరించేయవచ్చు. ఒకవేళ భవిష్యత్ లో ఆర్జీవీ కానీ ఫుల్ లెంగ్త్ హీరోగా తెరపై కనిపిస్తే ఇంకేమైనా ఉందా? ఆయనలోని గాయకుడిని భరిస్తున్న జనం మరో సాహసం చేయాల్సి ఉంటుందేమో!