ప్చ్ పాయల్!?

ఆర్‌ఎక్స్ 100తో సరికొత్త సెన్సేషన్ గా పరిచయమైంది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. బోల్డ్ అప్పియరెన్స్, క్యారెక్టరైజేషన్‌తో ఓ ఊపు ఊపేసిన పాయల్‌కు వరుస సినిమాలు పడటం ఖాయమనుకున్నారు. ఒక్క సినిమాతో బోల్డ్ ఇమేజ్ వచ్చేయటంతో, ఆ ఫేమ్‌ను హ్యాండిల్ చేయటంలో పాయల్ పూర్తిగా విఫలమైంది. ‘సీత’ చిత్రంలో హాట్ ఐటెం చేయడం, తరువాత ‘ఆర్డీఎక్స్ లవ్’లో శృతిమించిన బోల్డ్ క్యారెక్టర్‌లో కనిపించటంతో.. పాయల్‌ను అదోటైప్ హీరోయిన్‌గానే చూడ్డం మొదలెట్టారు. పాయల్ వొంపు సొంపులను ఇష్టపడే వాళ్లు సైతం భయపడేంత భయానకంగా ఆర్డీఎక్స్ లవ్‌లో కనిపించటంతో.. స్టార్ హీరోలే కాదు కుర్ర హీరోల పక్కనా చాన్స్‌లు లేకుండా పోయాయి. అదృష్టం బావుండి ‘వెంకీమామ’లాంటి ఫ్యామిలీ మూవీలో వెంకీ సరసన పాయల్‌కు అవకాశమొచ్చినా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. ఆ నెగిటివిటీకి భయపడిన చిత్రబృందం వెంకీమామ ప్రమోషన్స్‌లో ఆమెను అండర్ ప్లే చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జరగాల్సిన డామేజ్ జరిగిపోయిన తరువాత -పొరబాటును సరిదిద్దుకునే స్టేట్‌మెంట్లకు సిద్ధమవుతోంది పాయల్. బోల్డ్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటపడే పాత్రల్నే ఎంచుకోవాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం రవితేజ డిస్కోరాజాతో పాయల్ మరోసారి స్క్రీన్‌పైకి వస్తుంది. అయితే, ఆ ప్రాజెక్టులో లేటెస్ట్ సెన్సేషన్ నభా నటేష్ ఉండటం వల్ల పాయల్‌కు ఎలివేషన్ వచ్చే అవకాశం లేదన్న అంచనాలున్నాయి. సో, చేతులారా చాన్స్‌లు కాల్చుకున్న పాయల్.. ఇప్పుడు పాత్రల్ని పట్టుకున్నా ప్రయోజనం ఉంటుందా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్చ్ పాయల్!?