గత రెండేళ్లుగా ఇదుగో పులి అదుగో తోక అన్న చందంగా రజనీ రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. వ్యవస్థలో మార్పు కోసం ప్రజలు తనని రాజకీయాల్లోకి రమ్మంటున్నారని, సామాజిక న్యాయంతోనే రాజకీయ ప్రక్షాళన సాధ్యమవుతుందని పీఆర్పీ పార్టీ ఆవిర్భావ సభలో మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. సరిగ్గా అదే తరహాలో కాకపోతే కొంచెం కొత్తగా రజనీ గురువారం చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
వ్యవస్థలో మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, ప్రజలు మార్పుని కోరుకుంటున్నారని, పదవుల కోసం తాను ఎప్పుడూ ఆశపడలేదని రజనీ ఈ సందర్భంగా వెల్లడించారు. తను మాత్రం పార్టీకి అధ్యక్షుడిగా మాత్రమే ఉంటానని, ముఖ్యమంత్రి పదవిని మాత్రం ఆశించనని కుండబద్ధలు కొట్టేశారు. మంచి వాళ్లు, మేధావులు రాజకీయాల్లోకి రావడం లేదని, యువతకు అధిక ప్రాధాన్యత నిస్తానని చెప్పుకొచ్చారు. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు ప్రాధాన్యత కల్పిస్తానని స్పష్టం చేసిన రజనీ జయలలిత, కరుణానిధి మరణించడంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడిందని, అందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
అంతా బాగానే వుంది. మరి పార్టీ పేరేంటి? . ఏ రోజు నుంచి క్రియాశీలంగా వ్యవహరించబోతోంది? వంటి విషయాల్ని మాత్రం మళ్లీ సస్పెన్స్‌లోనే పెట్టారు. ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపించేలా గత రెండేళ్లుగా రాజకీయ అరంగేట్రంపై సస్పెన్స్‌ని మెయింటైన్ చేస్తూ వస్తున్న తలైవా మళ్లీ గురువారం కూడా అదే ట్విస్ట్ నివ్వడంతో చాలా మంది రజనీ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా రజనీ పార్టీ పేరుని, తన రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ఎలా మొదలు కాబోతోందో వెల్లడిస్తే బాగుంటుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.