వెండితెరపై బ్రహ్మానందం కనిపిస్తే చాలు నవ్వులు ఆపుకోలేరు ప్రేక్షకులు. ఇక ఆయన పంచ్ లేస్తే పొట్ట చెక్కలే. కామెడీ చేశారా విరగబడి నవ్వకుండా వుండలేరు. తనదైన హాస్యంతో తెలుగు సినిమా హాస్యానికి సరికొత్త సొబగులద్దారాయన. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిన తెలుగు సినిమాల్లో హాస్యానికి కేరాఫ్ అడ్రస్ అయ్యారు. అయితే గత కొంత కాలంగా ఆయన సినిమాలు తగ్గించుకుంటూ వస్తున్నారు. కొంత మంది దర్శకుల చిత్రాల్లో తప్ప బ్రహ్మానందం మిగతా దర్శకులు చిత్రాల్లో కనిపించడం లేదు.
ఇటీవల హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు బ్రహ్మానందం. ఆ సమయంలో ఇండస్ట్రీలో వున్న వాళ్లతో పాటు ఆయనని అభిమానించేవారు కూడా కంగారు పడ్డారు. బ్రహ్మానందంకు ఏం జరిగిందని భయాందొళనకు గురయ్యారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయి ఇంటికి వచ్చిన బ్రహానందాన్ని అల్లు అర్జున్, ఆ తరువాత త్రివిక్రమ్ కలిశారు. త్రివిక్రమ్ రెండున్నర వేలు పోసి బొకేను కొన్నారట. దాన్ని బ్రహ్మానందంకిచ్చి కుశలప్రశ్నలు వేయాలనుకున్నారట.
బొకే పట్టుకుని ఇంటికి వెళ్లేసరికి ఆయన ఛెంగు ఛెంగు మంటూ గెంతుతూ కనిపించారని, అది చూసిన వెంటనే బొకేను డస్ట్ బిన్‌లో పడేశానని, ఆ బొకే డబ్బులు తనకు బ్రహ్మానందం బాకీపడ్డారని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. అంటే త్రివిక్రమ్‌కు బ్రహ్మానందం రెండున్నరవేలు బాకీపడ్డారన్నమాట.