టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య మళ్లీ తాత పాత్రలో చేయకున్నా.. తాత పేరుతో సినిమా చేయబోతున్నాడట. ‘మనం’ చిత్రంలో చైతూ -నాగ్ పాత్రను పోషించాడు. ‘మహానటి’ చిత్రంతో తాత నాగేశ్వరరావుగా అతిథి పాత్రలో కనిపించాడు. త్వరలో తాత పేరే టైటిల్‌గా ప్రాజెక్టు చేయనున్నాడన్న కథనాలు ఇండస్ట్రీలో ఆసక్తి రేకెత్తిస్తోంది. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా చైతూ మీడియం రేంజ్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. గత ఏడాది ‘మజిలీ’తో మంచి విజయాన్ని సాధించిన చైతూ ప్రస్తుతం శేఖర్ కమ్ముల ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. ‘లవ్‌స్టోరీ’ టైటిల్‌తో రానున్న ఈ చిత్రంతో చైతూతో సాయిపల్లవి జోడీకట్టింది.
ఈ ప్రాజెక్టు కోసం చైతూ తెలంగాణ యాసను పలికించనున్నాడు. వేసవి వినోదంగా ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశముంది. అయితే, ఈ ప్రాజెక్టు పట్టాలపై ఉండగానే తరువాతి ప్రాజెక్టును చైతూ సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్కినేని కాంపౌండ్‌లో సినిమా చేయడానికి ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ కొంతకాలంగా ఎదురు చూస్తోన్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టు ఇప్పుడు చైతూతో సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. చైతూ -పరశురామ్ కాంబోగా ఈ ప్రాజెక్టును 14 రీల్స్ సంస్థ నిర్మించనున్నట్టు సమాచారం. స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసిన దర్శకుడు ఈ ప్రాజెక్టుకు ‘నాగేశ్వరరావు’ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
లెజెండరీ నటుడు నాగేశ్వరావు టైటిల్‌ను కన్ఫర్మ్ చేసుకుంటే ఇన్‌స్టంట్‌గా ఆడియన్స్ అట్రాక్షన్ దొరుకుతుందన్న ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్‌పైవున్న ‘లవ్‌స్టోరీ’ని పూర్తి చేసిన వెంటనే చైతూ కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అదీ సంగతీ!?