తాజాగా కార్తీ నటించిన ‘చిన్నబాబు’ సినిమా జూలై 13 న రిలీజ్ అవనుంది. విడుదల తేదీ దగ్గరపడటంతో ఈ సినిమా బృందం ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా హీరో కార్తీ మీడియాతో మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన పలు విషయాలను తెలియజేసారు. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఐదుగురు అక్కల తర్వాత పుట్టిన బాబు ‘చినబాబు’. దర్శకుడు ఈ లైన్ చెప్పగానే నాలో తెలియని అనుభూతి కలిగింది. ఇంట్లో ఒక అక్కతోనే వేగడం కష్టం అలాంటిది ఐదుగురు అక్కలను ఎలా హ్యాండిల్ చేయగలడు అనేది స్టోరీలో చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇందులో ఒక్కొక్క అక్క పాత్ర, ఒక్కొక్క బావ పాత్ర దర్శకుడు మలిచిన విధానం చాలా బావుంది అని చెప్పారు.
ఈ సినిమాలో ఒక్కో పాత్ర ఒక్కో హీరోలా ఉంటుంది. సినిమా చూశాక ప్రేక్షకులకు ప్రతి క్యారెక్టర్ పేర్లతో సహా గుర్తు ఉండిపోతుంది అన్నారు. కుటుంబంతో కలిసి పెళ్ళికి వెళ్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ వస్తుంది సినిమా చూశాక. జులైలో వస్తున్న సంక్రాంతి సినిమా ‘చినబాబు’. నేను ఎప్పటినుండో రైతుగా నటించాలి అనుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా ఆ కోరిక తీరింది. ఈ క్రెడిట్ దర్శకుడు పాండిరాజ్కే దక్కుతుంది. ఆయన కూడా ఒక రైతే అని గుర్తు చేశారు. ఒక రైతుగా ఎలా ఉండాలి, ఎలా వ్యవసాయం చేయాలి అని దర్శకుడు చేసి చూపించారు అని తెలిపారు.
ఈ సినిమా తర్వాత నాకు వ్యవసాయం చేయాలని కోరిక పుట్టింది అన్నారు. రైతుల సమస్యలు ఇందులో ప్రస్తావించామన్నారు. అయితే ఇది కేవలం రైతులకు సంబంధించింది కాదని అందరూ చూడదగ్గ సినిమా అని వెల్లడించారు.ఇది తమిళ సినిమా ‘కడియకుట్టి సింగం’ మూవీకి అనువాదం. తమిళంలో పాండిరాజ్ దర్శకత్వం వహించగా హీరో సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ‘చినబాబు’ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.