కరోనా దెబ్బకి ప్రపంచ దేశాల సంగతి పక్కనబెడితే!భారత్ పరిస్థితి తలుచుకుంటే! ఊపిరాగినంత పనౌవుతుంది. రోజు రోజు కి కరోనా కేసుల సంఖ్య అమాంతం ఊహించని విధంగా పెరిగిపోతుంది. ఇక తెలుగు రాష్ర్టాల్లో అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ ఒక్క రోజే ఏపీలో 40కి పైగా కేసులు నిర్ధారణ కావడంతో తెలుగు ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వామ్మో కరోనా కాటేస్తుందా? అన్న భయం గుప్పిట్లో బ్రతికే సన్నివేశానికి చాలా దగ్గరగానే ఉన్నామని టెన్షన్ పడుతున్నారు. సామాన్యుల పరిస్థితి ఆగమ్యగోచరంలోకి వెళ్లిపోయింది. ఇప్పటికే వలస కూలీలు లాక్ డౌన్ తో నానా అవస్థలు పడుతున్నారు. తినడానికి తిండి లేక…ప్రభుత్వం కొన్ని ఏరియాల్లో భోజనం ఏర్పాటు చేసినప్పటికీ సరఫరా సరిపోవడం లేదు.
ఇక విరాళాలు రాష్ర్ట వ్యాప్తంగా చూసుకుంటే తక్కువగానే వచ్చాయి. పారిశ్రామిక వేత్తలు..సెలబ్రిటీలు కొందరు విరాళిచ్చినా పెరుగుతోన్న కేసుల నేపథ్యంలో అవెక్కడా సరిపోని సన్నివేశమైతే ఉంది. ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలంతా స్పందించాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తం అవుతోంది. టాలీవుడ్ ని అడ్డు పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదిస్తోన్న హీరోయిన్లంతా స్పందించాలని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. అయినా ఇప్పటివరకూ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే సెలబ్రిటీలు మాత్రం పెద్ద ఎత్తున సందేశాలు ఇవ్వడం…జాగ్రత్తలు చెప్పడంలో మాత్రం తగ్గలేదు. ఈ పని రూపాయి ఖర్చు లేనిది కాబట్టి ఎవరికి తోచిన సలహాలు వాళ్లు ఇచ్చేస్తున్నారు.
రూపాయి వదిలే హీరోయిన్లు గానీ…టెక్నీషియన్లు గానీ లేరంటూ అక్షింతలు వేయించుకున్నారు. ఇంకొంత మంది సెలబ్రిటీలు పాటలు పాడుతూ ఇదే మా విరాళం అంటూ చెప్పుకోవడం పరిశ్రమలో చర్చకు దారి తీస్తోంది. రూపాయి ఇవ్వకుండా ఇలా ఎన్ని చేస్తే ఏం లాభం? కనీసం మాస్క్ లు కూడా కొనివ్వలేరా? అంటూ కొందరు నెటి జనులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఏపీ-తెలంగాణల్లో కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఇప్పటికైనా కళ్లు తెరవాల్సిన వాళ్లంతా తెరిస్తే బాగుంటుందని… లేదంటే? టాలీవుడ్ ఉసురు తగుల్తుందని శాపనార్ధాలు సైతం పడుతున్నాయి. మరి వీటి నుంచి బయటపడే ప్రయత్నాలేవైనా చేస్తారేమో చూడాలి.