కరోనా వైరస్ ప్రపంచాన్నిరెండున్నర నెలల పాటు లాక్ డౌన్ కె పరిమితం చేసేసింది . ఇలాంటి విపత్తు మానవుడికి వస్తుందని ఎవరూ ఊహించలేదు . క్షణం తీరికలేకుండా వుండే ప్రజలు బతుకు భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు . అన్ని రంగాలు స్తంభించిపోయాయి . అందరూ కరోనా భయంతో … క్షణం ఒక యుగంలా .. గడిపేస్తున్నారు . సినిమా రంగం అంటేనే గ్లామర్ . నటీనటులు , దర్శకులు , సాంకేతిక నిపుణులు , నిర్మాతలు అందరూ .. లాక్ డౌన్ సమయంలో గడపదాటి బయటికి రావడం లేదు . కరోనా ఎటునుంచి వస్తుందో తెలియక ఇంట్లో కూడా మాస్క్ లతో తిరుగు తున్నారు . లేదా ఒకరికొకరు ఛాలెంజ్ అంటూ వంటపని ఇంటి చెయ్యడం ఆ ఫోటోలను మీడియాకు ఇవ్వడం .. అది కాస్తా ఎక్కువై .. జనం నవ్వుకొని పరిస్థితి వచ్చింది . ఇక ఇంట్లో వుంటే బోర్ కొట్టసాగింది . ఇలా మేకప్ లేకుండా .. ” స్టార్ట్ సౌండ్ … కెమెరా. … యాక్షన్ ” అనే మాటలు వినకుండా నాలుగు గోడల మధ్య గడపడం ఎంత నరకమో ఇప్పుడు సినిమా నటీనటులకు ,సాంకేతిక నిపుణులకు .. ముఖ్యంగా గంటల లెక్కన కాలాన్ని డబ్బుకు అమ్ముకొనే కేరక్టర్ ఆర్టిస్టులకు , హాస్య నటీనటులకు మరీ దుర్భరమై పోయింది . మళ్ళీ ఎప్పుడెప్పుడు మేకప్ వేసి ఫ్లోర్ లైట్ల మధ్యలో నిలబడదామా అన్న కోరిక అందరినీ చుట్టేసి ఊపిరి తిప్పుకోనివ్వలేదు . చిన్న నటుల నుంచి పెద్ద హీరోల వరకు .. షూటింగ్ చేసేద్దాం .. అనే నిశ్చయానికి వచ్చారు .
కాకపోతే … ” ఈ షూటింగ్ లు మాకోసం కాదు .. 14 వేల సినిమా కార్మికుల కోసం .. వారంతా దిన కూలీలు .. ” అందుకే సినిమా షూటింగ్ లు మళ్ళీ ప్రారంభం కావాలి .. అనే స్లోగన్ మొదలు పెట్టారు . మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆహ్వానించి మీటింగ్ పెట్టారు . ఈ సమావేశానికి చిరంజీవికి కావలసిన అందరినీ ఆహ్వానించారు . రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి . తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెడతానని వారికి హామీ ఇచ్చాడు .
ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు కు తలసాని ఏమి చెప్పాడో తెలియదు రెండవ రోజునే హైద్రాబాద్లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో కేసీఆర్ తెలుగు సినిమా ప్రముఖులతో సమావేశమయ్యారు . ఈ సమావేశం కూడా ఆహ్లాద వాతావరణంలో మూడు గంటలపాటు సాగింది . మే 31 దాకా దేశమంతా లాక్ డౌన్ వుంది కాబట్టి జూన్ నుంచి షూటింగ్ లు చేసుకోవచ్చు అని .. కొన్ని సూచనలు,సలహాలు చెప్పారు . అందరూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పి హ్యాపీ గా వచ్చేశారు .
అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కె . చంద్రశేఖర రావుతో సమావేశం జరగడానికి ముందే ఆంధ్ర ప్రదేశ్ లోని వై .ఎస్ .జగన్ మోహన్ రెడ్డిప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా షూటింగ్ లకు అనుమతి ఇస్తున్నామని , సింగల్ విండో ద్వారా అనుమతులు కూడా వెంటనే ఇవ్వడం జరుగుతుందని ప్రకటించింది . ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ విజయ చందర్ ఈ ప్రక్కన చేశారు .
అంతేకాదు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన భవనాలు , ఉద్యాన వనాలు , సరస్సులు ఎక్కడ షూటింగ్ చేసుకున్నా ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదని కూడా ప్రకటించారు . ఈ ప్రకటన పై తెలుగు సినిమా రంగ ప్రముఖులు ఎవరూ స్పందించలేదు . కారణమా వీరెవరికీ ఆంధ్ర ప్రదేశ్ లో షూటింగ్ చేసే ఉద్దేశ్యం లేదు . సినిమా రంగం అంతా హైద్రాబాద్లోని వుంది . కాబట్టి వీరెవరికీ ప్రస్తుతం హైదరాబాద్ వదిలిపెట్టి బయట షూటింగ్ చేసే ఉద్దేశ్యం లేదు .
అయితే ఆదివారం రోజు చిరంజీవి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఫోన్ చేసి “సినిమా పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాలతో పాటు సింగల్ విండో అనుమతుల ఉత్తర్వు విడుదల చేసినందుకు పరిశ్రమ తరుపున కృతజ్ఞతలు తెలిపాను ” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు .ఏమైనా సినిమావారి దృష్టి అంతా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మీదే వుంది .
అయితే జూన్ మాసం నుంచి తెలుగు సినిమా షూటింగ్ లు అన్నీ మొదలయ్యే అవకాశం ఉందా ? లాక్ డౌన్ ఎత్తివేసి షూటింగ్ లకు అనుమతి ఇచ్చినా సోషల్ డిస్టిన్స్ ( భౌతిక దూరం) పాటిస్తూ సినిమా షూటింగ్ లు జరుగుతాయా ? సినిమా షూటింగ్ అంటేనే ఎక్కువ జనంతో కూడుకున్న వ్యవహారం . చిన్న సినిమా అయితే 100 నుంచి 125 మంది, అదే పెద్ద సినిమా అయితే 200 నుంచి 260 మందిపనిచేస్తారు.
భౌతిక దూరం పాటిస్తూ షూటింగ్ ఎలా చేస్తారు . ఇక నటీనటులు దగ్గరగా మెలిగే సన్నివేశాలు , శృంగార సన్నివేశాలు ఎలా షూట్ చేస్తారు ? షూటింగ్ కు వచ్చిన వారందరినీ థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చెయ్యాలి . నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా భౌతిక దూరం పాటించాలంటే .. ఆచరణలో షూటింగ్ చెయ్యడం అసాధ్యం . మరి జూన్ నుంచి హీరోలంతా ఎలా షూటింగ్ చేస్తారో .. చూడాల్సిందే !
– భగీరథ