ఏపీ రాజ‌ధాని పై చిరు స్పంద‌న‌

తెలుగు రాష్ట్రాలు విడిపోయిన‌ప్ప‌టి నుంచి రాజ‌ధాని పై జ‌రుగుతున్న ర‌భ‌స మ‌నంద‌రికీ తెలిసిందే. చంద్ర‌బాబు ఐదేళ్ళ పాల‌న‌లో కాస్త కూడా రాజ‌ధాని ప‌నులు ముందుకు వెళ్ళ‌క‌పోగా ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్లు ఉంది. ఇటీవ‌లె ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దీనిపై ఓ కీల‌క నిర్ణ‌యానికి వ‌చ్చారు. అమరావతిని శాసన నిర్వాహక, విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక, కర్నూల్‌ను న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచన‌లో ఆయ‌న అడుగులు వేస్తున్నారు. ఈ దిశ‌గా ఆయ‌న‌కు మద్దతు పలుకుతూ మెగాస్టార్ చిరంజీవి శనివారం ఒక ప్రకటనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమేనని చిరంజీవి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఈ మేరకు తన పేరిట ఉన్న లెటర్ హెడ్‌‌తో ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు.

ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటును సమర్థిస్తూ గానీ, వ్యతిరేకిస్తూ గానీ తాను ఏ విధమైన ప్రకటన చెయ్యలేదంటూ చిరంజీవి పేర్కొన్నట్టు ఆదివారం మరో లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది కూడా చిరంజీవి పేరిట ఉన్న లెటర్ హెడ్‌తోనే విడుదలైంది. అయితే, ఈ లేఖ ఫేక్ అని చిరంజీవి స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియాకు ఒక వాయిస్ మెసేజ్‌ను కూడా ఆయ‌న‌ పంపారు. శనివారం తాను లెటర్ హెడ్ మీద ఇచ్చిన ప్రకటన వాస్తవమని.. ఆదివారం తన పేరిట సర్క్యులేషన్‌లోకి వచ్చిన ప్రకటన అవాస్తవమని స్పష్టం చేశారు.

ఆయ‌న మెసేజ్‌లో చెప్పింది…ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటుని సమర్థిస్తూ గానీ, వ్యతిరేకిస్తూ గానీ నేను ఏ విధమైన ప్రకటన చెయ్యలేదు. తెలుగు ప్రజలకు చేరువచేసి, నన్నింతవాణ్ణి చేసిన సినిమా రంగం మీదే నా దృష్టి ఉంది. దయచేసి అందరూ గమనించగలరు’ అని చిరంజీవి పేరిట, ఆయన సంతకంతో సహా ఒక లేఖ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఇది ఫేక్. ద‌య‌చేసి అంద‌రూ గ‌మ‌నించ‌గ‌ల‌రు.