‘యన్.టి.ఆర్’ ప్లాఫ్ కు కారణం తేల్చి చెప్పిన నిర్మాత
ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘యన్.టి.ఆర్’.ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించన ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజైంది. అయితే రెండు భాగాలు డిజాస్టర్ అయ్యాయి. సినిమాపై రకరకాల విమర్శలు వచ్చాయి. అయితే ఆ స్దాయిలో డిజాస్టర్ అవటానికి రకరకాల కారణాలు మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రం ప్లాఫ్ అవటానికి కారణం చిత్ర నిర్మాత విష్ణు ఇందూరి చెప్పారు.
తాజాగా మీడియా సమావేశంలో విష్ణు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ బయోపిక్, జయలలిత, కపిల్ దేవ్ బయోపిక్ చిత్రాలు నిర్మించాలనే ఆలోచన తనదే అని విష్ణు అన్నారు. ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మించినందుకు గర్వంగా ఉంది. కానీ ఎన్టీఆర్ బయోపిక్ అంచనాలు అందుకోలేదు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని రెండు భాగాల్లో తీయడం తప్పు అని నా ఫీలింగ్.
ప్రేక్షకులు కోరుకున్న ఏదో అంశాన్ని ఈ చిత్రంలో చూపించలేకపోయాం అని విష్ణు అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం నాకొక ఖరీదైన గుణపాఠం అని విష్ణు అభివర్ణించారు. గాంధీ జీవిత చరిత్ర, మహాభారతం లాంటి పెద్ద కథలని కూడా ఒకే ఒకే చిత్రంలో చూపించగలిగారు. ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఒక సినిమాగానే తెరకెక్కించి ఉంటే బావుండేది అని విష్ణు అభిప్రాయ పడ్డారు.
ఎన్టీఆర్ బయోపిక్ 60 శాతం చిత్రీకరణ పూర్తయిన తర్వాత రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించి తప్పు చేశామని ఓ ఇంటర్వ్యూలో విష్ణు ఇందూరి వ్యాఖ్యానించారు. అలా కాకుండా ఒకే పార్టుగా చెబితే ఫలితం మరోలా ఉండేదని అన్నారు. అయితే ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టడం లేదని వివరించారు.
ఇది తామంతా కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయమని అన్నారు. తన కెరీర్‌లో నేర్చుకున్న అత్యంత విలువైన పాఠం ఇదే అని తెలిపారు. దీనికి తోడు సినిమా విడుదల సమయంలో టీడీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా ఎన్టీఆర్ బయోపిక్ పరాజయానికి మరో కారణమని విష్ణు ఇందూరి అభిప్రాయపడ్డారు.
ఎన్‌బీకే ఫిల్మ్స్ పతాకంపై నందమూరి బాలకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. వారాహి చలన చిత్రం, విబ్రి మీడియాలు సమర్పించాయి. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు.