ఈసారైనా ఫ్యాన్స్ కి ట్రీట్ ఉంటుందా జ‌క్క‌న్నా?

మెగా-నంద‌మూరి అభిమానులు ఆర్ ఆర్ఆర్ అప్ డేట్స్ కోసం ఎంత క్యూరియ‌స్ గా ఎదురుచూస్తున్నారో? చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టివ‌ర‌కూ రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ పాత్ర‌ల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేయ‌లేదు. కేవ‌లం వాళ్లిద్ద‌రి కళ్ల‌లో రౌద్రాన్ని ఓ పోస్ట‌ర్ లో ఎలివేట్ చేసి క్యారెక్ట‌రైజేష‌న్ ని చెప్పే ప్ర‌య‌త్న‌మే చేసారు. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో చ‌ర‌ణ్ ఎలా క‌నిపించ‌నున్నాడు? కొమ‌రం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ ఎలా ఉంటాడు? అన్న దానిపై సోష‌ల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్లు త‌ప్ప‌! జ‌క్న‌న్న మాత్రం రివీల్ చేయ‌లేదు. దీనిపై ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో బోలెడంత చ‌ర్చ సాగింది.

న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ప్ర‌తి పండ‌గ అభిమానుల‌కు డ‌బుల్ ట్రీట్ అని చెప్పి..ఏ ట్రీట్ లేకుండా చేస్తున్నారు జ‌క్క‌న్న‌. దీంతో ఇద్ద‌రు హీరోల అభిమానుల జ‌క్క‌న్న పై కాస్త గుసాయింపుగానే ఉన్నారు. అయితే మార్చి..మే నెల‌లో ఇద్ద‌రు హీరోల పుట్ట‌న రోజులు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనైనా జ‌క్క‌న్న కరుణిస్తాడా? అన్న‌ది చూడాలి. చ‌ర‌ణ్ బ‌ర్త్ డే మార్చి 27. ఆ రోజున తెలుగు రాష్ర్టాల్లో అభిమానులు చేసే హ‌డావుడి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అఖిల భార‌త చిరంజీవి యువ‌త ఆధ్వ‌ర్యంలో శిబిరాలు ఏర్పాటు చేసి అభిమానులంతా ర‌క్త‌దాన కార్య‌క్ర‌మాలు చేస్తారు. మిఠాయిలు…స్వీట్లు పంచిపెట్టి త‌మ అభిమాన హీరో పుట్టిన రోజుని ఘ‌నంగా నిర్వ‌హిస్తారు.

ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20న అభిమానులు చేసే హంగామా గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తార‌క్ పేరు మీద సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి త‌మ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే ఆర్ ఆర్ ఆర్ లో తార‌క్-చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్నారు కాబ‌ట్టి ఒక హీరో వేడుక‌లో మ‌రో హీరో అభిమానులు పాల్గొనే అవకాశం ఉంద‌ని ఫ్యాన్స్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. మ‌రి ఇలాంటి ప‌రిణామ‌ల న‌డుమైనా జ‌క్క‌న్న అభిమానుల కోసం బ‌ర్త్ డే రోజైనా ఫ‌స్ట్ లుక్ ట్రీట్ ఏదైనా ఇస్తారేమో చూడాలి. ఇక చిత్రాన్ని 2021 జ‌న‌వ‌రి 8న రిలీజ్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.