అక్క‌డ అమ్మాయిల‌ను అమ్మేస్తారా?

చాలామంది బుల్లితెర నటీమ‌ణులు, యాంక‌ర్లు ఏదో చిన్న‌గా కెరియ‌ర్‌ని మొద‌లుపెడ‌తారు. త‌ర్వాత ఎక్క‌డి నుంచి ఎక్క‌డికో వెళ్ళిపోతారు. అలా తీన్మార్ వార్త‌ల‌తో వీ6 ఛాన‌ల్ నుంచి ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన మంగ్లీ.. తెలంగాణా స్లాంగ్లో మాట్లాడుతూ తెలంగాణ పాపుల‌ర్ యాంక‌ర్‌గా పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత తెలంగాణ పండగ ‘బతుకమ్మ’ పాటలతో తెలుగు ప్రజల్లో మంగ్లీ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. గాయనిగా, టీవీ యాంకర్‌గా బుల్లితెర వీక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. తాను పుట్టి పెరిగింది లంబాడా సామాజిక వ‌ర్గ‌మ‌ని అక్క‌డ ఆడ‌పిల్ల‌ల‌కు పెద్ద‌గా స్వేచ్ఛ ఉండ‌ద‌ని అక్క‌డి క‌ట్టుబాట్లు గురించి చెపుతూ ఆవేద‌న చెందారు.

తమ సమాజంలో ఎన్ని కట్టుబాట్లు వున్నా తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో వుండ‌డం తాను ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. ఆడపిల్ల పుడితే భారంగా భావించి చంపేయడమే… ఇతరులకు అమ్మేయడమో చేయడం సర్వసాధారణంగా వాళ్ళ ద‌గ్గ‌ర‌ జరుగుతుందన్నారు. త‌న చిన్న‌ప్పుడు ఈ సంస్కృతి కాస్త ఎక్కువ‌గా ఉండేదని వాట‌న్నిటి దాటి ఇంత మంచి స్థాయిలో ఉన్నందుకు చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్న‌ట్లు తెలిపారు.

ఇప్పటికీ తన అసలు పేరు చాలా మందికి తెలియదని… అందరికీ తాను మంగ్లీగానే పరిచయమన్నారు. అయితే తన అసలు పేరు స‌త్య‌వ‌తి అని తెలిపారు. స‌త్య‌వ‌తిగా హైద‌రాబాద్ వ‌చ్చినా.. మంగ్లీగా ఇంత మంచి పేరు వ‌చ్చేంత‌వ‌ర‌కు నాక‌ష్టాలు, బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం అన్నారు. లంబాడా సామాజికవర్గంలో వయస్సులో వున్న యువతులపై ఆంక్షలు ఎక్కువగా వుంటాయని మంగ్లీ అన్నారు. గతంలో నోరు విప్పి మాట్లాడినా.. ఊరు దాటి బ‌య‌ట‌కు వెళ్ళినా చాలా త‌ప్పుగా భావించేవారు. ఈ మ‌ధ్య కాస్త కాస్త అవ‌న్నీ మారుతూ వ‌స్తున్నాయ‌ని అన్నారు. కానీ ఇంకా కొన్ని మారుమూల చోట మాత్రం అవి అలానే ఉన్నాయి అని అన్నారు.