‘సైరా నరసింహారెడ్డి’ఐదు కోట్ల వివాదం తీరదా?

‘సైరా నరసింహారెడ్డి’ వివాదంలో తప్పెవరది…తేలుతుందా?

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను కథగా మలుచుకొని కొణిదెల ప్రొడక్షన్స్‌ ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తీసారు. అయితే ఈ చిత్రానికి సంభందించిన వివాదం మాత్రం తీరటం లేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబసభ్యులకు కొణిదెల సంస్థ గౌవర వేతనం ఇస్తానని మాటిచ్చిందని, కానీ ఇవ్వకుండా సినిమా రిలీజ్ చేసుకుంటున్నారంటూ…సైరా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాజాగా నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 10 ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని కొణిదల ప్రొడక్షన్స్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమకు ఇస్తామన్న పారితోషకాన్ని ఇవ్వాలని.. తమకు న్యాయం చేయాలని వారు కోరారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ తాలూకా, ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 5వ తరం వారసులు దొరవారి దస్తగిరిరెడ్డి, లక్ష్మి కుమారి మాట్లాడుతూ గత మే నెలలో స్వామినాయుడు, రాంచరణ్‌ పీఏ అవినాష్‌ తమను చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌కు పిలిపించి ఉయ్యాలవాడ వంశీకులు 22 మందికి రూ. 5 కోట్లు ఇప్పిస్తామంటూ అగ్రిమెంట్‌ చేసి నోటరీ కూడా చేసి ఇచ్చారన్నారు. అయితే ఇప్పటి వరకు న్యాయం చేయలేదన్నారు.

గత నెల 16న ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున ఏడు కుటుంబాలకు డబ్బులు ఇస్తామని తేల్చిచెప్పారన్నారు. అయితే ఇప్పటివరకు తమకు న్యాయం చేయకపోవడంతో తాము రాంచరణ్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామన్నారు. ఇటీవల అతడి పీఏ అవినాష్‌ మీకెలాంటి హక్కులు లేవంటూ చెప్పేశాడని ఆరోపించారు. తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటరీ చేసినప్పుడే 15 రోజుల గడువు ఇచ్చారని దానిని పూర్తిగా విస్మరించారన్నారు.

మార్చి 11న చిరంజీవి బ్లడ్‌ బ్యాంకుకు ఏడు కుటుంబాలకు చెందిన 22 మందిని పిలిపించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రామ్‌చరణ్‌ న్యాయం చేస్తానని మాటిచ్చారని, అయితే మధ్యవర్తులు కొందరు అందుకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు.