విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్కార్’ చిత్రానికి చిక్కులు తొలగిపోయినట్టే. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఎత్తి చూపుతూ రూపొందించిన ‘సర్కార్’ చిత్రం ఈ నెల 6న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని కొన్ని సీన్లు, డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీ నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఈ పార్టీకి సంబంధించిన మంత్రులు కడంబూరు రాజు, జయకుమార్, ఉదయకుమార్, కామరాజ్ తో పాటు ఇతరులు చిత్రాన్ని ఖండిస్తూ తీవ్రస్థాయిలో ప్రకటనలు చేశారు. ప్రస్తుతం జయలలిత ఉంటే సర్కార్ చిత్ర యూనిట్ ఈ సాహసానికి ఒడిగట్టేదా అని ప్రశ్నించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ‘సర్కార్’ ప్రదర్శితమవుతున్న థియేటర్ల ముందు అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనలు చేపట్టడమే కాకుండా చిత్ర పదర్శన నిలుపుదలకు యత్నించారు. అలాగే సినిమాకి సంబంధించిన బ్యానర్లు ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన నిర్మాతలు రీ-సెన్సార్ చేసి అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించాలంటూ సెన్సారుబోర్డుకు గురువారం రాత్రి విజ్ఞప్తి చేశారు. దీంతో శుక్రవారం ఉదయం సెన్సార్‌బోర్డు ఆ సీన్లు, డైలాగులను తొలగించడంతో సమస్య సద్దుమనిగింది. ఇక శుక్రవారం మధ్యాహ్నం నుంచి అన్ని థియేటర్లలో సర్కార్ షోలు ప్రారంభమయ్యాయి.
అభ్యంతరం ఎందుకు?
ఈ చిత్రంలో జయ అసలు పేరు కోమలవల్లిని ఉపయోగించారు. అంతేగాక ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన కలర్‌టీవీలు, మిక్సీలు తదితర వస్తువులను వ్యతిరేకిస్తూ దహనం చేసే సన్నివేశముంది. ఇందులో మిక్సీలపై జయలలిత ఫోటో ఉంది. ఇదే అసలు సమస్యకు కారణమైంది. గతంలో జరిగిన సంఘటనలను మనసులో పెట్టుకున్న విజయ్.. ఉద్దేశపూర్వకంగా జయలలిత ఫోటో పెట్టి దహనం చేయించారని అన్నాడీఎంకే నేతలు విమర్శిస్తున్నారు.
ముందస్తు బెయిల్‌కి దరఖాస్తు చేసుకున్న మురుగదాస్
సర్కార్ మూవీ వివాదంలో భాగంగా గురువారం రాత్రి చెన్నైలో దర్శకుడు మురుగదాస్ ఇంటి వద్ద హై డ్రామా నడిచింది. తన తాజా చిత్రం ‘సర్కార్’తో తమిళనాడులో పొలిటికల్ పార్టీల ఆగ్రహానికి గురయ్యారని, అందుకే ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు తన ఇంటి వద్దకు వెళ్లారని సమాచారం. ఈ విషయాన్ని ‘సర్కార్’ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ‘మురగదాస్‌ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటివద్దకు వెళ్లారు’ అని ట్వీట్ చేశారు. ఆ వెంటనే ‘‘మా ఇంటికి పోలీసులు వచ్చారు. నేను లేనని తెలుసుకొని తిరిగి వెళ్లిపోయారు’ అని మురుగదాస్ ట్వీట్ చేశారు. ఈ పరిస్థితుల్లో మురుగదాస్ ముందస్తు బెయిల్‌కి దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 27 వరకూ ఆయన్ని అరెస్ట్ చేయకూడదని చెన్నై కోర్ట్ ఆదేశించింది. ఈ చిత్రాన్ని మళ్లీ సెన్సార్ చేసి, మూడు సన్నివేశాల్లో కట్స్ చేయమని ఆదేశించారు. మురుగదాస్ గతంలో తెరకెక్కించిన ప్రతి చిత్రానికి కాపీ రైట్స్ విషయంలోనూ, ఇతర విషయాలకి సంబంధించిన ఏదొక సమస్య వస్తూనే ఉంటుంది. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడ సర్కార్ చిత్రంపై వచ్చిన సమస్య నుండి క్లీన్ చీట్ తో బయటపడి, ప్రస్తుతం ఈ మూవీపై ఎటువంటి సమస్యలు..అడ్డంకులు లేకుండా చిత్రం అన్ని చోట్ల ప్రదర్శనలు జరుపుకుంటుంది.
. సర్కార్ చిత్రానికి ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖుల మద్దుతు
అయితే వివాదంలో చిక్కుకున్న ఈ చిత్రానికి మద్దతుగా కోలీవుడ్, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు నిలిచారు. కోలీవుడ్ నుండి రజనీకాంత్, కమల్ హాసన్, విశాల్ వంటి అగ్రహీరోలు చిత్రానికి మద్దతుగా నిలబడటమే కాకుండా, వారి వంతుగా సమస్య తీవ్రతను తగ్గించేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి మహేష్ బాబు, నవదీప్, హరీష్ శంకర్ వంటి ఇతర అగ్రహీరోలు, దర్శకులు సైతం చిత్రానికి మద్దతుగా నిలిచారు.