భారీతనం నిండిన సినిమాలు తీయడంలో శంకర్ తర్వాతనే. అతడు ఓ సినిమా చేస్తే బడ్జెట్ల పరంగా.. కాన్వాసు పరంగా అదో సంచలనమే. హీరోలు భారీగా కాల్షీట్లు కేటాయించి అంకితం అవ్వాల్సి ఉంటుంది. అతడు ఇప్పటికే రజనీ, కమల్ హాసన్లతో పాటు అర్జున్, విక్రమ్ లాంటి స్టార్లతోనూ సినిమాలు తీశారు. కానీ సూర్య, అజిత్ లాంటి ట్యాలెంట్ తో సినిమాలు తీయలేదు. మరోవైపు టాలీవుడ్ నుంచి
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ శంకర్ తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని పలు సందర్భాల్లో తెలిపారు.
శంకర్ మునుముందు పలువురు తమిళ అగ్ర హీరోలతో సినిమాలు తీసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఆ జాబితాలో ఇలయదళపతి విజయ్, సూర్య కూడా ఉన్నారట. సూర్య హీరోగా కేవీ ఆనంద్ తెరకెక్కించిన కప్పాన్ (బందోబస్త్) ఆడియో ఈవెంట్ కి ముఖ్య అతిధిగా విచ్చేసిన శంకర్ సూర్యను ప్రశంసల్లో ముంచెత్తారు. అతడు ఇంకా ఇంకా యంగ్ గా
మారిపోతున్నారని వేదికపై పొగిడేశారు. ప్రతిభలో డెడికేషన్ లో సూర్యను చూసి నేర్చుకోవాలని ప్రశంసలు కురిపించారు. అంతేకాదు సూర్యతో ఇప్పటికే శంకర్ సినిమా చేయాల్సింది. కానీ రకరకాల కారణాల వల్ల కుదరలేదు. శంకర్కి సినిమా చేసే ఆసక్తి ఉందని కూడా కోలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. ఒకవేళ
ఇదే నిజమైతే సూర్య కెరీర్ లో అదో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందనడంలో
సందేహం లేదు.