రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మించిన ‘కదరం కొండన్’ తెలుగులో ‘మిస్టర్ కేకే’ గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ మామూలుగా వుంది. చియాన్ విక్రమ్ నటించిన ఈ మాఫియా యాక్షన్లో విషయం కొత్తగా ఏమీ లేదు. హీరోయిన్ అక్షర హాసన్ గర్భవతి, ఆమె భర్త అభి హాసన్ ఆమెని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇంతలో అతడి మీద మాఫియాలు ఎటాక్ చేయడంతో వాళ్ళ జీవితాలు ఛిన్నాభిన్నమవుతాయి. అప్పుడు ఎంటరవుతాడు మిస్టర్ కేకే. ఇతను ఒకప్పుడు అండర్ కవర్ ఏజెంట్, ఇప్పుడు డబుల్ ఏజెంట్. మోస్ట్ వాంటెడ్ లిస్టులో వుంటాడు, మలేషియా మాఫియా ప్రపంచాన్ని ఏలుకుంటాడు. ఆ భార్యా భర్తల మీద ఎటాక్ చేసిన మాఫియాల పని పట్టడం మొదలెడతాడు. ఆ మాఫియాలు ఎందుకు భార్యా భర్తల మీద ఎటాక్ చేశారు, వాళ్ళని ఎందుకు కాపాడడానికి మిస్టర్ కేకే వచ్చాడన్నది సస్పెన్స్.
విక్రం నెరిసిన గడ్డం తో వయసు మీరిన హాలీవుడ్ హీరోలా వున్నాడు. ట్రైలర్ లో అతడి సీన్స్ అన్నీ యాక్షన్ తోనే వున్నాయి. కాల్చి చంపడం, ఛేజింగ్ చేయడం. మలేషియాలో ఔట్ డోర్స్ తీసిన యాక్షన్ సీన్స్ థ్రిల్లింగ్ గా వున్నాయి. మామూలు కథకి భారీ యాక్షన్ జోడించి ఈ మూవీ తీసినట్టుంది.
కమల్ హసన్ తో 2015 లో ‘తూంగవనం’ (చీకటి రాజ్యం) తీసిన దర్శకుడు రాజేష్ సెల్వ నిజానికి ‘కదరం కొండన్’ ని కమల్ హాసన్ తోనే తీయాలి. అప్పట్లో కమల్ రాజకీయాల్లో బిజీగా వుండడంతో కుదరలేదు. దీంతో అదే కమల్ నిర్మాతగా విక్రంతో తీశాడు. కదరం అంటే మలేషియాలో కేదా అనేప్రాంతం. కదరం కొండన్ అంటే ఆ ప్రాంతాన్ని జయించిన వాడని అర్ధం. ఇందులో కమల్ చిన్న కుమార్తె అక్షరా హసన్ హీరోయిన్ గా నటించింది.
జిబ్రాన్ సంగీతం కూర్చిన ఈ మూవీకీ ఛాయాగ్రహణం శ్రీనివాస్ గుత్తా. యాక్షన్ కొరియోగ్రఫీ వర్జినీ అర్నాడ్ , గిల్స్ కాన్సీల్, ఒలివర్ సా. తెలుగులో పరాజిత మూవీ క్రియేషన్స్ తరపున టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ లు విడుదల చేస్తున్నారు. సమర్పణ టి. అంజయ్య. జులై 19 న విడుదల.