కరోనా వైరస్ టాలీవుడ్లో సమూల మార్పులకు కారణంగా మారుతోంది. రిలీజ్ కావాల్సిన సినిమాలు కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడ్డాయి. స్టార్ హీరోల చిత్రాల షూటింగ్‌లన్నీ వాయిదా పడ్డాయి. మళ్లీ యదాస్థితి నెలకొనాలంటే సెప్టెంబర్ వరకు వేచి చూడక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా పెద్ద సినిమాలు బడ్జెట్ తగ్గించుకోవాలని, స్టార్ హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకోవాలని ఇండస్ట్రీలో చర్చమొదలైంది.
ఈ నెల 7న లాక్డౌన్ ఎత్తేస్తే రెండవ వారం దీనిపై చర్చించాలని అంతా అనుకున్నారు కానీ అనూహ్యంగా మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగించడంతో చర్చను మళ్లీ వాయిదా వేశారు. ఇదిలా వుంటే లెక్కల మాస్టారు సుకుమార్ మాత్రం `పుష్ప` కోసం ఒక్క సీన్‌కే ఏకంగా 6 కోట్లు ఖర్చు చేయాలని ప్లాన్ చేశాడట. అది కూడా కేవలం 6 నిమిషాల సీన్ కోసం భారీ బడ్జెట్‌ని కేటాయించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అల్లు అర్జున్‌తో సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం `పుష్ప`. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ రేంజ్లో ఓ ఫైట్‌ని ప్లాన్ చేశారట. దీనికి హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్‌తో పాటు ఫైటర్స్‌ని కూడా బుక్ చేయాలనుకుంటున్నారట. దీనికి 6 కోట్లు ఖర్చు అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ టైమ్‌లో ఇంత బడ్జెట్ అవసరమా? అని ఇండస్ట్రీలో సుక్కుపై సెటైర్లు వినిపిస్తున్నాయి. అయితే దీనికి మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. ముందు భారీ రేంజ్లో ఫారిన్ ఫైటర్స్‌తో ఈ ఫైట్‌ని ప్లాన్ చేశారని, కరోనా కారణంగా లోకల్ ఫైటర్స్‌తో అదే స్థాయి అవుట్ పుట్ని రాబట్టాలని ప్లాన్ మార్చినట్టు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది.