మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బైక్ యాక్సిడెంట్ తర్వాత అతడి నుంచి వస్తున్న చిత్రమిది. తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకులెవరూ ఈ మధ్య కాలంలో తమ చిత్రాలతో ప్రేక్షకులను నిరాశపరచలేదు.
‘ఉప్పెన’తో వచ్చిన బుచ్చిబాబు సెన్సేషనల్ హిట్ నమోదు చేస్తే.. ‘దసరా’తో శ్రీకాంత్ ఓదెల మతిపోగొట్టాడు. ఇప్పుడు సుకుమార్ మరో శిష్యుడు కార్తీక్ దండు కూడా మంచి హారర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులముందుకొచ్చాడు. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. సాయిధరమ్ తేజ్.. కెరీర్ ఆరంభంలో ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుప్రీమ్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి వరుస హిట్స్ తో హ్యాట్రిక్ అందుకున్న హీరో. అయితే ఆ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేక కెరీర్ కొంచెం నెమ్మదించింది. ఆరు వరుస ఫ్లాప్ సినిమాల తర్వాత చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాలు ఫర్వాలేదు అనిపించినప్పటికీ.. తర్వాత కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ తర్వాత యాక్సిడెంట్ కి గురై రికవర్ కావటానికి సమయం పట్టడంతో తేజ్ సినిమాల నుండి గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. గ్యాప్ తర్వాత తాజాగా ‘విరూపాక్ష’ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. సినిమా విడుదలకు ముందు బ్లాక్ మ్యాజిక్ వంటి ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నట్టు చెప్పుకున్నారు మేకర్స్. దాంతో విడుదలకు ముందే సినిమా కథ ఏంటన్న దానిపై అందరిలోనూ క్యూరియాసిటీ పెంచేసింది. టాలీవుడ్ మార్కెట్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి విస్తరించిన నేపథ్యంలో టైర్ 2 హీరోలు కూడా పాన్ ఇండియా విడుదల చేసి సక్సెస్ అవుతున్నారు. కెరీర్ ప్రారంభించి పది సంవత్సరాలు దాటుతున్నా తేజ్ కి 100కోట్ల మార్క్ అందుకునే ఛాన్స్ రాలేదు. మరో పక్క తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీతోనే 100కోట్ల మార్క్ అందుకున్నాడు.
ఈ క్రమంలో ‘విరూపాక్ష’ సినిమా తేజ్ కెరీర్ కి కీలకంగా మారింది. ప్రస్తుతం సుకుమార్ శిష్యుల హిట్ల పరంపర నడుస్తున్న తరుణంలో తేజ్ కి కూడా ఈ సెంటిమెంట్ కలిసొచ్చి 100కోట్ల మార్క్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. టాలీవుడ్ లో చాలా తక్కువ సినిమాలకే మంచి గుర్తింపును సొంతం చేసుకుని.. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రాజెక్టులను చేసుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఆ మధ్య వరుస హిట్లతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన అతడు.. ‘రిపబ్లిక్’తో ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కు గురైన తరవాత నటించిన సినిమా కావడంతో ‘విరూపాక్ష’పై అందరికీ ఆసక్తి ఏర్పడింది. ‘రిపబ్లిక్’ లాంటి సోషల్, పొలిటికల్ డ్రామా తరవాత సాయితేజ్ చేసిన థ్రిల్లర్ మూవీ ఇది. సుమారు రెండేళ్ల విరామం తరవాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హారర్ సినిమాలు చూడటం వేరు. చేయడం వేరు. ప్రమాదం జరిగిన తరువాత మళ్లీ సాయి ధరమ్ తేజ్ సినిమాలు చేస్తాడా ? లేదా? అని అంతా అనుకున్నారు. సాయి ధరమ్ తేజ్ తొలిసారి ఇలాంటి కొత్త జానర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పటికే ట్రైలర్‌తో పాటు ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకోవడంతో సినిమా ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికుల్లోనూ నెలకొని ఉంది. దీంతో ఈ సారి సరికొత్త ప్రయోగం చేసి ‘విరూపాక్ష’ అనే విలేజ్ హర్రర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో నేడు (ఏప్రిల్ 21, 2023)న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. మరి ఈ సినిమా ఎలా వుంది? ఈ సినిమాతో సాయి తేజ్ హిట్ కొట్టాడా? లేదా? అనేవి తెలుసుకుందాం…
కథలోకి వెళదాం… ఇది 80, 90వ దశకంలో జరిగిన కథ. భయాన్ని కలిగించే సెటప్ మధ్య వయోలెన్స్ ఎక్కువగా ఉన్న సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. 1979 నేపథ్యంలో ఓపెన్ అయిన ఈ చిత్రం మళ్ళీ 1991కి మారుతుంది. రుద్రవరం అనే గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలు ఎంతో భయానకంగా ఉంటాయి. సూర్య గా సాయి ధరమ్ తేజ్ , నందిని గా సంయుక్త మీనన్ కనిపిస్తారు. అయితే రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పద మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. చేతబడి వలన చనిపోతున్నారా? లేక మరేదైన ఇతర కారణాల వలన చనిపోతున్నారా? అనే మిస్టరీని సాయి తేజ్ చేదిస్తాడు. ఆ మిస్టరీ మరణాల వెనకాల ఎవరున్నారు? ఆ గ్రామాన్ని పట్టిపీడుస్తున్న శక్తి ఏంటి? హీరో దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు.. ఆ ఊరి ప్రజలకు ఎలాంటి విముక్తినిచ్చాడు? అనేది కథ.
విశ్లేషణ : ఓ గ్రామంలో అంతు చిక్కని కథ వల్ల అందరూ భయపడుతూ ఉంటారు. అక్కడకు వెళ్లిన హీరో ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు? అందుకు అతడే ఎందుకు ముందుకు వెళ్లాడు? ఇంతకీ ఆ గ్రామంలో మిస్టరీ ఏంటి? అనే అంశాలతో ‘విరూపాక్ష’ చిత్రం తెరకెక్కింది. ఇందులో ఎన్నో ట్విస్టులు, హర్రర్ ఎలిమెంట్స్ జోడించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఊహించని ట్విస్ట్ లతో, అద్భుతమైన టేకింగ్ తో డైరెక్టర్ కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ప్రారంభం నుండి చివరి వరకు సినిమా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. 80, 90వ దశకంలో ఈ కథ జరుగుతుంది. వరుసగా జరిగే మిస్టరీ డెత్‌లు ఏంటి? ఊరి మీద చేతబడి చేయించారా? చేస్తే ఎవరు చేసి ఉంటారు? అనే దాని చుట్టూ జరిగే కథ ‘విరూపాక్ష’. విరూపాక్ష అంటే రూపం లేని కన్ను. అంటే శివుడి మూడో కన్ను. రూపం లేని దాంతో ఈ సినిమాలో పోరాటం జరుగుతుంది. అందుకే ‘విరూపాక్ష’ అని టైటిల్ పెట్టారు.
80, 90వ దశకంలోని కథ కాబట్టి.. అప్పట్లో ప్రేమలు ఎలా ఉండేవో కళ్లకు కట్టింది. 80, 90వ దశకంలో ఎలా ఉండేవారు.. ఎలా ప్రవర్తించేవారు.. ఎలా కనిపించాలి? ఇలా ప్రతీ ఒక్క అంశంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకొని పాజిటివ్ బజ్ సాధించ గలిగింది. సుకుమార్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించటం, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటంతో ఈ సినిమాకు విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ స్టేజ్ కి వచ్చిందని అంటున్నారు. ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. కాస్త ‘బోరింగ్ లవ్ ట్రాక్ ఉన్నప్పటికీ.. కథాంశం అంతా ఆసక్తికరంగా సాగింది. కొన్ని చిల్లింగ్ మూమెంట్లతో ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా బాగా పుంజుకుంది. దీనికి సౌండ్ మిక్సింగ్ బాగా సెట్ అయింది. సెకెండాఫ్‌పై ఆసక్తిని పెంచింది. ‘ఒక చంద్రముఖి.. ఒక అరుంధతి.. ఒక కాంచన.. ఒక విరూపాక్ష. మొదటి పది నిమిషాల లవ్ ట్రాక్ తప్ప మిగిలిదంతా హర్రర్‌గానే ఉంది. ‘విరూపాక్ష ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. లవ్ ట్రాక్, లీడ్ యాక్టర్స్ మధ్య సీన్స్‌తో పాటు కొన్ని థ్రిల్ ఎలిమెంట్స్ బాగున్నాయి. సెకెండాఫ్‌లో హర్రర్ అండ్ స్టోరీ బాగుంది. ఓవరాల్‌గా సెకెండాఫ్ ఎక్స్‌లెంట్‌గా ఉంది. ‘విరూపాక్ష’లో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు మంచి కథను తీసుకొచ్చాడు. అజ్ఞానం భయానికి మూలం. భయం మూఢ నమ్మకానికి కారణం.
ఆ నమ్మకమే నిజమైనపుడు .. ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనపుడు.. అసలు నిజం చూపించే జ్ఞాన నేత్రం.. హీరోగా తొలిసారి సాయి ధరమ్ చేసిన థ్రిల్లర్ చిత్రం. విలేజ్ లో ఉండే మరణాల గురించి హీరో ఏ విధంగా రీసెర్చ్ చేశాడు ఇక వచ్చే ప్రమాదాలను ఏ విధంగా ఆపాడు అనే ప్రశ్నలు ఈ సినిమాలో ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. అప్పట్లో మూఢనమ్మకాలు చేతబడులు ఎలా ఉండేవి అనే పాయింట్ లో దర్శకుడు ఈ సినిమాను ఒక హారర్ల్ల థ్రిల్లర్ కాన్సెప్ట్ తోనే తెరపైకి తీసుకువచ్చాడు. అయితే ఒకవైపు భయాన్ని కలిగించే ఈ సినిమాలో మరోవైపు మంచి లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది. హీరో మిస్టరీ వెనుక ఉన్న కారణాలు ఏంటి చేతబడులు ఎవరూ చేశారు? ఇక దాన్ని ఎలా అడ్డుకోవాలి? మిగతా జనాలను ఎలా కాపాడాలి? అనే సవాళ్ళు ఉండడం సినిమా మొత్తానికి ఒక హైలెట్ గా నిలిచింది. ఇక జరగబోయే మరణ హోమాన్ని ఆపలేవు అని సవాళ్లను హీరో ఎదుర్కోబోతున్నాడు. సమస్యకు పరిష్కారం నేను వెతుకుతాను అంటూ అతను చెప్పిన డైలాగ్ కూడా హైలెట్ అవుతుంది. ఈ రుద్రవనాన్నిన్ని కాపాడగల వీరుపాక్షకుడు నువ్వే అంటూ మరో క్యారెక్టర్ చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే… సూర్యగా సాయిధరమ్ తేజ్ చాలా కొత్తగా, ఫ్రెష్‌గా కనిపించాడు.ఈ సినిమా అతడిలోని నటుడ్ని పరీక్ష పెట్టినట్టు అనిపించింది. చాలెంజింగ్‌గా అనిపించింది. ఆయన లుక్, యాక్టింగ్ స్టయిల్ కూడా కొత్తగా ఉంది. అతడి యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. దర్శకుడు క్రియేట్ చేసిన పాత్రలో పూర్తిగా ఇన్‌వాల్వ్ అయి చేశాడు. చాలా సెటిల్డ్ గా నటించాడు. తేజ్ చాలా మెచ్యూర్డ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. అతనికి ఇదొక బౌన్స్ బ్యాక్ లాంటి సినిమా అవుతుందని చెప్పొచ్చు. అతడికి కెరీర్‌లో చెప్పుకునే చిత్రమవుతుంది. అతడు చెప్పిన ”సమస్య ఎక్కడ మొదలవుతుందో.. పరిష్కారం అక్కడే వెతకాలి’ అనే డైలాగ్ బాగుంది. మొత్తానికి ఈ సినిమాతో సాయి తేజ్ మరో హిట్ అందుకున్నాడు. ఇక నందినిగా కనిపించిన సంయుక్త మీనన్‌కి మంచి పాత్ర దక్కింది, ఆమె కూడా సినిమాకి ఓ పిల్లర్‌లా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రీ క్లైమాక్స్ లో ఇరగదీసింది. తేజ్, సంయుక్త కెమిస్ట్రీ కూడా బాగా పండింది. సునీల్ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. ఇక్కడ ఎవరికైనా చావుకు ఎదురు వెళ్లే దమ్ముందా? అని అతను చెప్పిన డైలాగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నటులు బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల తమ పాత్రలకి న్యాయం చేశారు. అఘోరాగా నటుడు అజయ్ కూడా అలరించాడు.
సాంకేతికంగా చూద్దాం… ముఖ్యంగా డైరెక్టర్ కార్తీక్ సినిమాను అద్భుతంగా హ్యాండిల్ చేశారు. దర్శకుడు కథను నడిపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. సుకుమార్ రాసిన స్క్రీన్‌ప్లే అయితే ప్రేక్షకుడిని సీటులో నుంచి కదలనివ్వలేదు. సినిమాను నేపథ్య సంగీతం మరో పెద్ద బలం ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఆయన అందించిన నేపథ్య సంగీతం చాలా కాలంపాటు ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. ఎలాంటి అనవసర సన్నివేశాలు లేకుండా దర్శకుడు ఫస్టాఫ్‌లో స్ట్రయిట్‌గా పాయింట్‌కు వెళ్లిపోయారు. అయితే, ఫస్టాఫ్ ఉన్నంత ఎంగేజింగ్‌గా సెకండాఫ్ లేదు . ముఖ్యంగా లవ్ ట్రాక్ కాస్త బోరింగ్‌గా ఉంది. ఇలాంటి సన్నివేశాలు ప్రధాన కథను దారి మళ్లించాయి. లవ్ స్టోరీ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా అదే ప్లాట్‌లో సినిమాను తీసుకెళ్లుంటే మరో లెవెల్‌లో ఉండేది ఏదేమైనా బొమ్మ అయితే అదిరిపోయింది. ఈ ఏడాది వచ్చిన సినిమాలన్నింటిలోకి ‘విరూపాక్ష’ ఒక ప్రత్యేకమైన సినిమా అని చెప్పొచ్చు. ఇక విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ గానీ, టెక్నికల్‌గానూ సినిమా బాగుంది. కొన్ని సన్నివేశాలు అయితే దర్శకుడు ముందుగా చెప్పినట్లుగా వణుకు తెప్పించే విధంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన క్షణాలు, చక్కని ట్విస్టులతో ఆసక్తికరమైన కథాంశం. ఫస్టాఫ్‌లో లవ్ ట్రాక్ బోరింగ్‌గా ఉంది. అలాగే, కొన్ని సన్నివేశాలు అసమానంగా ఉన్నాయి. అయినప్పటికీ స్క్రీన్‌ప్లే చాలా వరకూ ఎంగేజింగ్‌గా ఉండడంతో వర్కౌట్ అయింది. అయితే, కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా అవి అంతగా ప్రభావం చూపవు. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. క్లైమాక్స్, లవ్ స్టోరీ, కొన్ని సాగదీత సన్నివేశాలున్నప్పటికీ ఓవరాల్‌గా చూస్తే ‘విరూపాక్ష’ ది బెస్ట్ మూవీ అనిపిస్తుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతుంది.
రేటింగ్ 3/5