సీనియర్ నటీనటులు జయప్రద, పూర్ణ, సాయికుమార్ వంటి వారు నటించడంతో సహజంగానే ‘సువర్ణ సుందరి’ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ఈ చిత్రానికి సంబంధించి విడుదలకు ముందే వచ్చిన టీజర్, ట్రైలర్‌లతో ఈ ఆసక్తి మరింత పెరిగెలా చేశాయి. అలాగే తెలుగు చిత్ర సీమలో ప్రస్తుతం నటి పూర్ణకు మంచి క్రేజ్ ఉంది. ప్రతిభగల నటిగా తనను తాను నిరూపించుకుంటూ కెరీర్ లో పయనిస్తోంది. ఆమె ఎంచుకున్న పాత్రలు.. ఆమె అంగీకరిస్తోన్న సినిమాలు వేటికవే భిన్నంగా ఉండడంతో అవి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నటి పూర్ణ నటిస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ శుక్రవారం (3, ఫిబ్రవరి 2023) ‘సువర్ణ సుందరి’ థియేటర్లలో అడుగుపెట్టింది. మరి ఈ సినిమా అంచనాలను చేరుకుందా? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించింది? ఇంతకీ ఆ ‘సువర్ణ సుందరి’ ఎవరు? ఆమె కథ ఎలాంటిది? తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.
ముందుగా కథేంటో చూద్దాం…త్రినేత్రి అమ్మవారి విగ్రహం చుట్టూ ఈ ‘సువర్ణ సుందరి’ కథ మొత్తం సాగుతుంది. కాకపోతే ఆ విగ్రహం వల్ల అంతా వినాశనమే జరుగుతుంది. సువర్ణ సుందరిగా పిలిచే ఆ విగ్రహంలో దుష్టశక్తి ఎలా ప్రవేశించింది? అది అసలు ఎందుకు అలా మారింది? దానికి అంజలి (పూర్ణ) ఎలా బలైంది. సాక్షి (సాక్షి చౌదరి)కి ఆ విగ్రహంతో ఉన్న సంబంధం ఏంటి? విశాలాక్షి (జయ ప్రద) ఆ సువర్ణ సుందరిని అడ్డుకునేందుకు ఏం చేసింది? ఈ కథలో పోలీస్ ఆఫీసర్ గుణ (సాయి కుమార్) పాత్ర ఏంటి? మిగిలిన తదితర విషయాలు తెలియాలంటే థియేటర్ లోకి అడుగు పెట్టాల్సిందే..
విశ్లేషణలోకి వెళదాం…సినిమా ఆద్యంతం సస్పెన్స్ తో సాగుతూ ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది. అనుక్షణం ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? అన్న ఆసక్తిని కలిగిస్తుంది. సువర్ణ సుందరిగా పిలిచే ఆ విగ్రహంలో దుష్టశక్తి ఎలా ప్రవేశించింది? అన్నది ప్రేక్షకుల్లో బలమైన ఆలోచనను రీకెత్తించింది. ఆ దుష్టశక్తకి అంజలి ఎలా బలైంది? సాక్షికి ఆ విగ్రహంతో ఉన్న సంబంధం ఏంటి? విశాలాక్షికి ఆ సువర్ణ సుందరికి కనెక్షన్ ఏమిటి? అనేది ఆసక్తికరమైన కథనం. ఈ కథనం సాగుతున్నంతసేపూ ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలుగుతుంటుంది. ఆలోచనలను రేకెత్తిస్తూ ఆసక్తిగా సాగుతున్న కథనానికి తోడు ఆయా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసిన నటీనటులు తమవంతుగా జీవించేశారు. ఈ ‘సువర్ణ సుందరి’ కథ ఎంతో ఉత్కంఠను కలిగిస్తుంది. . ఓ విగ్రహం చూడటానికి దేవతలా ఉంటుంది.
కానీ అందులో అనంతమైన దుష్ట శక్తి ఉంటుంది. దాని రక్త దాహం తీర్చుకోవడానికి రాజ్యాలను సైతం మట్టు బెట్టేస్తుంది. అది ఎవరి చేతిలో ఉంటే.. వారు రాక్షసుల్లా మారిపోతారు. చుట్టు పక్కల ఉన్న వారిని చంపేసి రక్తం దాహం తీర్చుకుంటారు. వినడానికి ఈ పాయింట్ బాగుంటుంది. అంత శక్తి వంతమైన విగ్రహాన్ని ఎవరు మట్టు బెడతారు.. ఎలా ఆట కట్టిస్తారు.. వంటి పాయింట్లు ప్రేక్షకుడిని తొలిచేస్తుంటాయి. అలాంటి అంశాలను ఎంతో చక్కగా తెరపై ఆవిష్కరించాడు ఎం.ఎస్.ఎన్ సూర్య. అంతేకాదు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సువర్ణ సుందరి చేసే విధ్వంసం గురించి మొదటి సన్నివేశంలోనే చూపించి అందరినీ భయపెట్టేశాడు. ఇలా భయపెట్టడంలో మాత్రం సువర్ణ సుందరి తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. సినిమా ప్రథమార్థంలో సువర్ణ సుందరి ఎంట్రీ ఇచ్చే సన్నివేశాలు ఎంతో ఆసక్తిగా ఉండి ప్రేక్షకులను ఊపిరిబిగపట్టేలా చేస్తుంది. ఈ తాలూకు సన్నివేశాలన్నీ ఆద్యంతం ఆసక్తిగా సాగాయి. కథనం అక్కడక్కడ కాస్త స్లోగా అనిపించినా ‘సువర్ణ సుందరి’ ఎంట్రీ ఇచ్చాక జరిగే పరిణామాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ద్వితీయార్ధంలో అసలు కథ ఏమిటనేది రివీల్ అవుతుంది సువర్ణ సుందరిని ఎలా అడ్డుకుంటారు..అసలు సువర్ణ సుందరి నేపథ్యం ఏంటి? అనేది వివరిస్తూ సాగే సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ సాగుతాయి. ఒక దశలో ఈ సన్నివేశాలన్నీ ఆశ్యర్యపోయేలా ఉంటాయి.
ఎవరెలా చేశారంటే… నటి పూర్ణ చేసిన అంజలి పాత్ర ఈ సువర్ణ సుందరికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు! అంజలి పాత్రలో ఆమె పూర్తిగా ఇమిడిపోయింది. ఆ పాత్రకే నిండుతనాన్ని తెచ్చింది. ఆయా పాత్రలో చిక్కటి పెర్ఫామెన్స్ తో పాటు, గ్లామర్ గా కనిపించి విశేషంగా ఆకట్టుకుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఎంతో నిండుగా కనిపిస్తుంది. ప్రజెంట్ సీన్లు వచ్చినప్పుడు ఎంతో మోడ్రన్‌గా కనిపిస్తుంది. ఇక సాక్షి సైతం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో అదరగొట్టేస్తుంది. జయప్రద తన అనుభవాన్ని రంగరించి హుందాగా నటించింది. సాయికుమార్ కు ఎలాంటి పాత్రలు కొట్టినపెండే అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. అయన పాత్ర కూడా ఉన్నంత సేపు అందర్నీ ఆకట్టుకుంటుంది. కోట శ్రీనివాసరావు, నాగినీడు, అవినాష్ వంటి వారు తమ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. మిగిలిన పాత్రలన్నీఅంతంత మాత్రమే! అలా వచ్చి ఎలా వెళతాయి. మొత్తం మీద ఈ ‘సువర్ణ సుందరి’ భయపెడుతూనే సాగి ఆద్యంతం ఆకట్టుకునేలానే ఉంది. -ఎం.డి. అబ్దుల్
(చిత్రం : సువర్ణ సుందరి, విడుదల : 3, ఫిబ్రవరి 2023, రేటింగ్ : 3/5, దర్శకత్వం : ఎం.ఎస్.ఎన్ సూర్య, నటీనటులు : జయప్రద, పూర్ణ , సాయి కుమార్, సాక్షి చౌదరి, కోట శ్రీనివాస రావు తదితరులు, సంగీతం: సాయి కార్తీక్, నిర్మాత : ఎం.ఎల్ లక్ష్మీ)