మాస్ మహారాజ రవితేజ తాజాగా వచ్చిన ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెగ హుషారుగా కనిపిస్తున్నాడు. ఆయన కెరీర్ లో చాలా కాలం తర్వాత చెప్పుకోతగ్గ స్థాయిని ఎంజాయ్ చేస్తున్నాడు. అతడి అభిమానులు సైతం మునుపెన్నడూ లేనంత ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విడుదలైన సినిమా ‘రావణాసుర’. ఈ ‘రావణాసుర’లో ఆయన తొలిసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్నక్యారక్టర్ చేయడంతో సహజంగానే సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి కలిగింది. పైగా రెండు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ హిట్ కోసం మాస్ మహారాజ ఇప్పుడు ‘రావణాసుర’తో ప్రేక్షకులను పలకరించడంతో ఆసక్తి మరింత రెట్టింపయింది. ‘ధమాకా’ వంటి సాలిడ్ కమర్షియల్ సక్సెస్ తర్వాత రవితేజ సోలో హీరోగా నటించిన చిత్రమిది. మధ్యలో ‘వాల్తేరు వీరయ్య’ విజయం కూడా ఉంది. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలను కలగచేసిన ఈ ‘రావణాసుర’ను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించారు. ఈ చిత్రం నేడు (ఏప్రిల్ 07, 2023) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. మరి ఈ సినిమా రవితేజకి హ్యాట్రిక్ హిట్ ఇచ్చిందా..? లేదా నిరాశపర్చిందా.?, అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు మనం సమీక్షలో తెలుసుకుందాం….
కథ: ఓ పేరున్న క్రిమినల్ లాయర్ కనక మహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గర రవీంద్ర (రవితేజ) జూనియర్ లాయర్ గా పని చేస్తూ ఉంటాడు. అయితే ఓ రోజు హారిక (మేఘా ఆకాష్) తన తండ్రి (సంపత్ రాజ్)ని ఓ హత్య కేసులో ఎవరో ఇరికించారు అని కనక మహాలక్ష్మి వద్దకు వచ్చి తన తండ్రి కేసు టేకప్ చేయమని అడుగుతుంది. ఆమె ఓ పెద్ద ఫార్మా కంపెనీకి సీఈవో. అయితే.. అక్కడే ఉన్నరవీంద్ర హారికని చూసి మొదటి చూపు లోనే ఆమెను ఇష్టపడి పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఈ కేసును తాను తీసుకుంటాడు. కానీ ఇక్కడ నుంచి ఈ కేసులో ఎన్నో ఆసక్తికరమైన షాకింగ్ నిజాలు తెలుస్తాయి. మరి ఆ నిజాలేమిటి? ఈ మర్డర్స్ చేసింది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? ఈ కథలో మిగతా హీరోయిన్స్ పాత్రలు ఏంటి? ఆ కిల్లర్ దొరుకుతాడా?, రిసార్టులో ఓ వ్యక్తిని హారిక తండ్రి మర్డర్ చేసిన వీడియోలతో సహా సాక్ష్యాలు ఉంటాయి. తాను ఆ మర్డర్ చేయలేదని, అసలు మర్డర్ జరిగిన రాత్రి తనకు ఏం జరిగిందో గుర్తు లేదని ఆమె తండ్రి (సంపత్ రాజ్) చెబుతాడు. నగరంలో అటువంటి మర్డర్స్ కొన్ని జరుగుతాయి. సిటీ కమిషనర్ హత్యకు గురి అవుతారు. హారికను రేప్ చేసి మర్డర్ చేస్తారు. వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు? పోలీసులు సాకేత్ (సుశాంత్) దగ్గరకు ఎందుకు వెళతారు? అతను ఎవరు? రెండు నెలల్లో రిటైర్ కానున్న ఏసీపీ హనుమంతురావు (జయరామ్) ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఆయనకు ఏం తెలిసింది? అనే ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ సినిమాని చూడాల్సిందే..
విశ్లేషణ : చిత్రం ప్రారంభం నుంచి అసలు ఏం జరుగుతుందో.. ఏమో ఎవ్వరికీ అంతుపట్టకుండా ఉంటుంది. యాక్షన్ లేని థ్రిల్లర్ అనుకుంటే పొరపాటే! థ్రిల్లర్ అని చెప్పుకున్న ఈ సినిమాలో అలాంటిదేమీ కనిపించదు. దర్శకుడు సుధీర్ వర్మ ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించేలా కథనాన్ని తీర్చిదిద్దలేకపోయాడనిపించింది. మర్డర్ సన్నివేశాలు కూడా అంతగా అతకలేదు. ప్రథమార్ధం కాస్త ఎంటర్ టైనర్ జానర్ లో కొనసాగిన ఈ సినిమాను ఒక్కసారిగా థ్రిల్లర్ జానర్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సినిమాకి ఎంతో కీలకమైన ద్వితీయార్ధంలో మాత్రం ఈ ఫ్లో ఫ్రెష్ నెస్ కొనసాగదు. కొన్ని సన్నివేశాల్లో లాజిక్స్ మిస్ అవ్వడం అలాగే పలు సీన్స్ కాస్త ఓవర్ గా కూడా అనిపిస్తాయి. ఇక మెయిన్ కథలోకి వెళ్ళాక కూడా ప్లాట్ లో పెద్దగా కొత్తదనం కనిపించదు. పూర్తిగా తేలిపోయినట్టు అనిపిస్తుంది. రవితేజ నుంచి కమర్షియల్, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ని కోరుకునేవారికి కాస్త నిరాశే కలుగుతుంది. దర్శకుడు సుధీర్ వర్మ ఇలాంటి థ్రిల్లర్ చిత్రాలని భాగా హ్యాండిల్ చేస్తాడు. అదే విధంగా ఈ ‘రావణాసుర’ లో కూడా చాలా మంచి థ్రిల్ ని, అలాగే ట్విస్ట్ లతో ఆడియెన్స్ లో ఆసక్తిని రేపగలిగాడు. అయితే సినిమా మెయిన్ పాయింట్ ని మాత్రం రెగ్యులర్ గా తీసుకోవడంతో బోర్ కొట్టించింది. ‘రావణాసుర’ ప్రారంభం ఆసక్తిగా ఉంటుంది. తొలుత కామెడీ సీన్లు ఓకే అనిపిస్తాయి. ఆ తర్వాత ఎవరు మర్డర్ చేస్తున్నారు? అనేది తెలిసిన తర్వాత దర్శకుడు సుధీర్ వర్మ కొన్ని సీన్లను బాగా డీల్ చేశారు. అయితే… మర్డర్స్ చేయడం మరీ అంత ఈజీనా? అని ప్రేక్షకుడికి సందేహం కలగక మానదు. అసలు సినిమాలో స్టార్టింగ్ టు ఎండింగ్… ఎక్కడా లాజిక్స్ లేవు. ఇంటర్వెల్ తర్వాత మేజర్ ట్విస్ట్ రివీల్ చేస్తుంటే… ఇప్పటికే ఇటువంటి సినిమాలు తెలుగులో చాలా చూసేశామని అనిపిస్తుంది. సీరియల్ మర్డర్స్ బ్రాక్ డ్రాప్‌తో ‘రావణాసుర’ చిత్రం రెగ్యులర్, రొటీన్ కామెడీతో కథ ముందుకెళ్తుంది. రవితేజ బాడీ లాంగ్వేజ్, ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు సుధీర్ వర్మ సేఫ్ గేమ్ ఆడినట్టు ఫస్టాప్‌లో స్పష్టమవుతుంది. అయితే ఫస్టాఫ్‌లో ట్విస్టులు, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నప్పటికీ.. కథనంలో ఆసక్తి లేకపోవడం వల్ల రెగ్యులర్ రివేంజ్ డ్రామా చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది. సాకేత్ (సుశాంత్) క్యారెక్టర్ రివీల్ అయిన తర్వాత ఇక క్లైమాక్స్ ఏమిటో అనే విషయం ఫస్టాఫ్‌లోనే క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఫస్టాఫ్ మాత్రం రవితేజ ఫెర్ఫార్మెన్స్ కారణంగా బాగుందనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. సెకండాఫ్‌లో క్లైమాక్స్ ఏం జరుగుతుందని తెలిసిన తర్వాత.. క్లైమాక్స్ వరకు కథను ఎలా తీసుకెళ్తాడనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. అయితే ఏ సినిమాకైనా సెకండాఫ్‌లో స్టోరి డెస్టినేషన్ ఎలా చేరిందనే విషయమే సక్సెస్, ఫెయిల్యూర్‌ను డిసైడ్ చేస్తుంది. రావణాసుర విషయంలో స్టోరి డెస్టినేషన్ చేరడంలో పెద్దగా ఎమోషనల్‌గా, థ్రిలింగ్‌గా, షాకింగ్‌గా లేకపోయిందనే చెప్పాలి. రెగ్యులర్, రొటీన్ స్క్రీన్ ప్లేతో క్లైమాక్స్ వరకు కథను లాగించాడనే ఫీలింగ్ కలుగుతుంది.
ఎవరెలా చేశారు : రొటీన్ కథ, కథనం, సన్నివేశాలను దాటి మరీ స్క్రీన్ చూసేలా చేసిన క్రెడిట్ మాస్ మహారాజ రవితేజది. ఆయన డిఫరెంట్ యాక్టింగ్, యాటిట్యూడ్ చూపించారు. నెగటివ్ షేడ్స్ లో ఇరగదీశాడు. ఆయనని చూసే ప్రతీ ఒక్కరికి ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. ఇలాంటి పాత్ర ఆయన ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదు. ఈ చిత్రంలో బిగ్గెస్ట్ ప్లస్ ఆడియెన్స్ కి బాగా ఆశ్చర్యపరిచే బిగ్ థింగ్ ఏదన్నా ఉంది అంటే అది రవితేజ సరికొత్త ఊహించని క్యారెక్టరైజేషన్ అని చెప్పాలి. దర్శకుడు రాసుకున్న పాత్రకి సినిమా టైటిల్ కి తగ్గట్టుగా పూర్తిగా కొత్త రవితేజని ఈ ‘రావణాసుర’లో చూస్తాం. నటన పరంగా తనలోకి కొత్త షెడ్ ని రవితేజ అద్భుతంగా చేసి సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్స్ లో ఒకటిగా నిలిపాడని చెప్పొచ్చు. అలాగే మరో ఆసక్తికరమైన విషయం.. రవితేజ నుంచి ఇంతకు ముందు చూడని డాన్సర్ రవితేజ ని కూడా చూడొచ్చు. రవితేజ అంటేనే హుషారు…ఈ ‘రావణాసుర’లో అయితే సీరియస్‌గా సాగే విలనిజాన్ని సైతం చూపించారు. తనదైన శైలి కామెడీ, డ్యాన్సులు చేశారు. అయితే…హైలైట్ మాత్రం రవితేజ విలనిజమే! ‘రావణాసుర’ సినిమాకు కర్త, కర్మ, క్రియ రవితేజ. కేవలం మాస్ మహారాజా సోల్ ఫెర్పార్మెన్స్‌తో సినిమా సాగుతుంది. ఒకరకంగా ఇది రవితేజ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఇక హీరోయిన్స్ గా నటించిన ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, దక్ష నగర్కార్ అందరికీ చక్కటి పాత్రలే లభించాయి. ఆయా పాత్రలకున్న వారి పరిధిలో మంచి ఎమోషన్స్ తో కూడిన సన్నివేశాల్లో కనిపిస్తారు. ఇక యువ హీరో సుశాంత్ కి చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్ర దక్కింది అనే చెప్పాలి. ఆ పాత్రలో అందర్నీ ఆకట్టుకుంటాడు. సుశాంత్ పాత్రకు స్టార్టింగులో ఇచ్చిన ఇంపార్టెన్స్ తర్వాత ఉండదు. అయితే, ఆయన స్టైలింగ్ బావుంది. పాత్ర పరిధి మేరకు నటుడిగా బాగా చేశారు. రవితేజ నటన ముందు మిగతా ఆర్టిస్టులపై ప్రేక్షకుల చూపు అంతగా పడదు. ఉన్నంతలో రవితేజతో కొన్ని సీన్లలో ‘హైపర్’ ఆది, ఫరియా అబ్దుల్లా బాగా చేశారు. రావు రమేష్ సాలిడ్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సంపత్ రాజ్, జయరాం వంటి నటీనటుల నటన కూడా ఈ సినిమాకి హైలైట్ గానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జయరాం – రవితేజ మధ్య సాగే పోలీస్ దొంగ ఆట ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా చేస్తుంది. ఏ క్యారెక్టర్‌కు బలమైన బ్యాకప్ లేదనే ఫీలింగ్ కలుగుతుంది. కొంతలో కొంత మేఘా ఆకాశ్, పూజిత పొన్నాడ క్యారెక్టర్లు బెటర్‌గా అనిపిస్తాయి. మురళీశర్మ, సంపత్, రావు రమేష్ పాత్రలు అతిథులుగానే కనిపిస్తాయి.
సాంకేతిక వర్గం : సుధీర్ వర్మ సినిమాల్లో టైటిల్ సాంగ్స్, థీమ్ సాంగ్స్ బావుంటాయి. ‘రావణాసుర’ థీమ్ సాంగ్ దానిని పిక్చరైజ్ చేసిన విధానం బావుంది. భీమ్స్ మ్యూజిక్ అందించిన ‘డిక్కా డిష్యూం’ ఓకే. మిగతా పాటలు సోసోగా ఉన్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం ఓకే. విలనిజం చూపించే సన్నివేశాల్లో రీరికార్డింగ్ ఇరగదీశారు. సినిమాటోగ్రఫీ బావుంది. ఈ చిత్రంలో అభిషేక్ ఆర్ట్స్ వారి నిర్మాణ విలువలు బావున్నాయి. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్ గా కనిపించింది. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం, భీమ్స్ ల పనితనం ఒకే. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ తన విజువల్స్ ని ఆసక్తికరంగా ఉండేలా చేసింది. నవీన్ నూలి ఎడిటింగ్ ఫర్వాలేదు.
మొత్తంగా చూసినట్టు అయితే రెండు భారీ విజయాల తర్వాత రవితేజ నుండి వచ్చిన ఈ ‘రావణాసుర’ రొటీన్ స్క్రీన్ ప్లే తో ఇది వరకే చూసిన రివెంజ్ డ్రామాలా అనిపిస్తుంది. మాంచి యాక్షన్ థ్రిల్లర్ చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగించి… కాసేపటికి రొటీన్ కథను మీకు ఈ విధంగా చెప్పామని క్లారిటీ ఇచ్చి… అంత కంటే రొటీన్ క్లైమాక్స్ చూపించిన సినిమాగా ‘రావణాసుర’ను చెప్పుకోవచ్చు!అతిగా ఆశపడి.. అంచనాలు పెట్టుకొని వెళితే నిరాశపరుస్తుంది. -ఎం. డి. అబ్దుల్
(చిత్రం : ‘రావణాసుర’, విడుదల తేది : ఏప్రిల్ 07, 2023, రేటింగ్ : 2/5, నటీనటులు: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దక్ష నగర్కర్, పూజిత పొన్నాడ, శ్రీరామ్, రావు రమేష్, జయరామ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, జయప్రకాశ్, హైపర్ ఆది, సత్య తదితరులు. కథ, మాటలు : శ్రీకాంత్ విస్సా, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్: నవీన్ నూలి, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్ – ఆర్టీ టీమ్ వర్క్స్, నిర్మాతలు: అభిషేక్ నామా-రవితేజ, స్క్రీన్ ప్లే- దర్శకత్వం : సుధీర్ వర్మ)