Mr. Pregnant Movie Review: ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ రివ్యూ

(చిత్రం : మిస్టర్ ప్రెగ్నెంట్ , విడుదల తేదీ : ఆగస్టు 18, 2023, రేటింగ్ : 2.75/5, నటీనటులు: సోహెల్, రూప కొడువయూర్, సుహాసిని మణిరత్నం, వైవా హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర తదితరులు. దర్శకత్వం : శ్రీనివాస్ వింజనంపాటి, నిర్మాతలు: అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ, ఎడిటర్: ప్రవీణ్ పూడి).

నూతన నవతరం దర్శకుడు శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకత్వంలో సోహైల్‌ హీరోగా వచ్చిన తాజా చిత్రం `మిస్టర్‌ ప్రెగ్నెంట్‌`. రూపా కొడువయుర్‌ కథానాయికగా నటించింది. మైక్‌ మూవీస్‌ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్‌రెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా విడుదలకు ముందు విభిన్న తరహాలో పబ్లిసిటీ చేశారు. సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా చేశారు. ఈ చిత్రం ఈ శుక్రవారం (ఆగస్టు 18, 2023) విడుదలయింది. మరి ఈ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఎలా ఉంది..? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం…

కథ : అనగనగా.. ఓ అనాథ. గౌతమ్ (సోహెల్). టాటూ ఆర్టిస్ట్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. టాటూ కాంపిటీషన్స్‌లోనూ పాల్గొంటూ విజయాన్ని సాధిస్తాడు. మరోవైపు గౌతమ్‌ ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి (రూపా కొడువయూర్) ఎంతో ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ, గౌతమ్ మాత్రం ఆమెను ఏ మాత్రం పట్టించుకోడు. అయితే, ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే, పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్‌ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు నిర్ణయించుకుంటాడు?.. గౌతమ్ (సోహెల్) జీవితంలో జరిగిన విషాదం ఏమిటి?.. చివరకు తనే గర్భం దాలాల్చీన అవసరం ఎందుకు ఏర్పడింది? మధ్యలో డాక్టర్ వసుధ (సుహాసిని మణిరత్నం) పాత్ర ఏమిటి?, చివరికి `మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది? అనేది అసలైన ఆసక్తికరమైన కథ.

విశ్లేషణ : వినూత్న పాయింట్ తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ `మిస్టర్‌ ప్రెగ్నెంట్‌` చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే, కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నేరేషన్ తో సినిమా సాగడం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. వినడానికే విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్ తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ.. కొన్ని చోట్ల అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా.. పెద్దగా కథ లేకపోవడం కథనం కూడా రెగ్యులర్ గా, రొటీన్ గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ గా మారడానికి సంబంధించిన సీన్స్ మోటివ్ ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగా నటించాడు. తన స్టైలిష్ లుక్స్ తో అండ్ తన యాక్షన్ తో కూడా అదరగొట్టాడు. అన్నిటికీ మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ గా ఫ్రెష్ గా కనిపించాడు. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసులను దోచుకుంటుంది. మగవాళ్లు ప్రెగ్నెంట్‌ అవ్వడమనే ఓ కొత్త ప్రయోగంతో వచ్చిన సినిమా ఇది. అక్కడక్కడా చిత్రంలో వచ్చిన కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే, హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే డైలాగ్స్, హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు.. క్లైమాక్స్ లో హీరో చెప్పే డైలాగ్స్ థియేటర్లో చప్పట్లు కొట్టిస్తాయి. హీరోయిన్ రూప కొడువయూర్ కూడా చక్కటి నటనను ప్రదర్శించింది. ఆమె గ్లామర్, లుక్స్ బాగున్నాయి. ఇతర నటీనటుల విషయానికి వస్తే.. సుహాసిని మణిరత్నం తన పాత్రలో మెప్పించారు. వైవా హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అయితే, సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రస్ట్ అంశాలు ఉన్నప్పటికీ.. నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి.. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తోంది.

సాంకేతిక విభాగం : ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ వింజనంపాటి ఓ కొత్త పాయింట్ తో ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు. అయినప్పటికీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాను చూసిన ఫీలింగే వస్తుంది. ఇక సంగీతం విషయానికి వస్తే.. నేప‌థ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్ర‌ఫర్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా ఎఫెక్టివ్ గా తీశారు. ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాణ విలువ‌లు ఓకే . ఇలాంటి డేరింగ్ పాయింట్ తో వచ్చిన నిర్మాతలు అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి లను మెచ్చుకోవాలసిందే… మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.