Mithra Mandali Movie Review: ‘మిత్రమండలి’ మూవీ రివ్యూ!

రచన- దర్శకత్వం : ఎస్. విజయేందర్
తారాగణం : ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓ.ఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ తదితరులు
సంగీతం : ఆర్.ఆర్‌.ధ్రువన్, చాయాగ్రహణం : సిద్ధార్థ్ ఎస్ జే
సమర్పనా : బన్నీ వాస్

నిర్మాతలు : కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప్, డాక్టర్ విజయేందర్ రెడ్డి
విడుదల : అక్టోబర్ 16, 2025

ఇటీవల ఒక విజయం (కోర్ట్), ఇంకో పరాజయం (సారంగ పాణి జాతకం) ల తత్వాత ‘మిత్రమండలి’ అనే కామెడీతో దీపావళి వినోదానికి విచ్చేశాడు హీరో ప్రియదర్శి. గతంలో తను నటించిన ‘జాతి రత్నాలు’ కామేడీ సూపర్ హిట్టయ్యింది. అది మైండ్ లెస్ కామెడీ. ‘మిత్రమండలి’ ని కూడా మైండ్ లెస్ కామెడీ గానే తీశాడు దర్శకుడు విజయేందర్. మరి ఇది ‘జాతి రత్నాలు’ సరసన నిలబడుతుందా? ఇది ప్రియదర్శికి ఎలాటి విజయం? వివరాలు ఈ కింద రివ్యూలో…

కథేమిటి?

జంగ్లీ పట్టణం అనే వూళ్ళో నల్గురు ఆవారా కుర్రాళ్ళు చైతన్య (ప్రియదర్శి), అభయ్ (రాగ మయూర్), సాత్విక్ (విష్ణు, రాజీవ్ (ప్రసాద్) ఉంటారు. తిని తాగి తిరగడం తప్ప ఏం పనుండదు. వీళ్ళ మధ్యకి స్వేచ్చ (నిహారిక) అనే అమ్మాయి వచ్చి ఒకరితో ప్రేమలో పడుతుంది. వీళ్ళ ప్రేమని గెలిపించడానికి మిగతా ముగ్గురూ వాళ్ళతో పారిపోతారు. ఎందుకంటే స్వేచ్చ నాన్న నారాయణ (విటివి గణేష్) కులం పట్టింపు వున్న క్రూరుడు. కులాంత ప్రేమల మీద పగ బట్టి ఉంటాడు. అలాటిది సరీగ్గా ఇతను ఎన్నికల్లో నిలబడుతున్న సమయంలో కూతురు లేచిపోవడం ఘోరంగా అనిపిస్తుంది. పోలీస్ కే స్టేషన్ కెళ్ళికూతురు లేచిపోయిందన్న విషయం దాచి పెట్టి కిడ్నాప్ కంప్లెయింట్ ఇస్తాడు. దీంతో ఎస్సై సాగర్ (వెన్నెల కిషోర్) కిడ్నాపర్స్ ని పట్టుకోవడానికి రంగంలోకి దూకుతాడు.

ఇంతకీ స్వేచ్చ ప్రేమించింది ఎవర్ని? వాళ్ళ ప్రేమ ఆ ప్రేమ ఫలించేట్టు చూశారా మిగతా ముగ్గురు ఫ్రెండ్స్? వీళ్ళు పోలీసులకి దొరికారా? అప్పుడు నారాయణ ఏం చేశాడు? ఇదీ మిగతా కామెడీ కథ.

ఎలా వుంది కథ:
మైండ్ లెస్ కామెడీకి పెద్దగా కథ ఉండనవసరం లేదు. ఆ కథ కొత్తగా కూడా ఉండనవసరం లేసు. కేవలం కథనం ఎంత మైండ్ లెస్ గా వుంటే అంత ఎంటర్ టైన్ చేస్తుంది. ఇందుకే ఇలాటి మైండ్ లెస్ కామెడీగా ‘జాతతి రత్నాలు’ అంత హిట్టయ్యింది. అలాగే హిందీలో రోహిత్ శెట్టి తీసిన ‘గోల్ మాల్ ‘ సిరీస్ నాలుగు మైండ్ లెస్ కామేడీలూ అంత హిట్టయ్యాయి. కథ వుండని వీటిని కేవలం కథనంతో కొత్తగా మైండ్ లెస్ కామెడీని సృష్టించి నిలబెట్టాల్సి వుంటుంది. దురదృష్టవశాత్తూ ‘మిత్రమండలి’ లో ఈ కొత్తదనమే లోపించింది. పైగా వున్న కథనంతో కూడా నవ్వించలేక చతికిలబడింది.

ఫస్టాఫ్ నల్గురు ఆవారా మిత్రుల ‘కామెడీ’ చేష్టలు, వెకిలితనాలు, హీరోయిన్ తండ్రి కులపిచ్చి, అతడి కూతురు ఆతడి చెర నుంచి బయటపడి ప్రేమించిన వాడితో పారిపోవడం, మిత్రమండలి వాళ్లకి తోడ్పడడం వగైరా సన్నివేశాలతో బలవంతంగా నవ్వించే ప్రయత్నం చేస్తూ సాగుతుంది. ఎందరో కమెడియన్లు కనిపిస్తారు. పొడవైన డైలాగులు చెప్తారు. కానీ ఒక్క క్షణం కూడా నవ్విన్చాలేకపోతారు ప్రియదర్శి సహా. కేవలం ఇంటర్వెల్లో వచ్చే సత్య మాత్రమే కామెడీకి కిక్ ఇస్తాడు.

ఇక్కడ్నుంచీ సెకండాఫ్ సత్య కామెడీ మాత్రమే హైలైట్ అవుతూ వుంటుంది. మిగతా కథనం మిత్రమండలిని పట్టుకోవడానికి పోలీసుల వేట, దానికో క్లయిమాక్స్, రొటీన్ ఫార్ములా ముగింపూ వుంటాయి, అంతే!

ఎవరెలా చేశారు?

ఎవరూ చేసిందేమీ లేదనే చెప్పుకోవాలి. మైండ్ లెస్ కామెడీ పేలవంగా వుంటే ఎవరేం చేయగలరు. ఇలాటి ఆవారా కుర్రాళ్ళ యూత్ సినిమాలు ఇరవై ఏళ్ల క్రితం ఎన్నో వచ్చాయి. అవి వెగటు పుట్టించి మాయమై పోయాయి. ఇది కూడా ఇంతే. కనీసం కథానాయకుడుగా ప్రియదర్శ కి సరైన పాత్ర, సన్నివేశాలు లేవు. ఇతరుల సంగతి చెప్పనవసరం లేదు, సత్య తప్ప. సత్య్హతో కామెడీ చేయించి నిలబెట్టగల్గిన దర్శకుడు మిగతతా నటులతో ఎందుకు చేయలేకపోయాడో అర్ధం గాదు చేయడానికి కొత్త అయిడియాలు అతడి దగ్గర ఏమీ లేవు. ఒక పాటలో బ్రహ్మానందం కనిపిస్తాడు. హీరోయిన్ గ్లామర్ ప్రదర్శనకి పనికొచ్చింది.

ఇక సంగీత పరంగా, ఇతర సాంకేతిక అంశాల పరంగానూ బలహీనంగానే వుంది సినిమా. పూర్ రైటింగ్, పూర్ మేకింగ్ ఈ సినిమా ప్రత్యేకత. మూడు బ్యానర్లు కలిసి ఈ సినిమాని నిర్మించినా బడ్జెట్ విషయంలో చాలా పొదుపు పాటించి నట్టున్నారు.

చివరికేమిటి?

ఈ సినిమా నచ్చక పొతే నా నెక్ట్స్ సినిమాని చూడకండి’ అని ప్రియదర్శి స్టేట్‌మెంటే ఇచ్చేశాడు. ప్రేక్షకులు కచ్చితంగా నెక్స్ట్ సినిమా చూడరు. ఈ స్టేట్ మెంట్ తో అసలు ఇదైనా చూసేందుకు వస్తారా అన్నది ప్రశ్న. దర్శకుడు విజయేందర్ కి మాత్రం ఈ ‘మిత్ర మండలి’ మంచి గుణపాఠం. మైండ్ లెస్ కామెడీని ఇంత మైండ్ లెస్ గా తీస్తే ఏమవుతుందో ప్రాక్టికల్ గా తెలుసుకునేట్టు చేస్తోందీ సినిమా. దర్శకుడు టైటిల్స్ లోనే చెప్పేశాడు- ఇందులో కథ ఉండదని, క్యారెక్టర్లతోనే ఇదో సోది అని కూడా సెలవిచ్చేశాడు. ఇలా ఈ దర్శకుడు, ప్రియదర్శి కలిసి నిర్మాతలు పెట్టిన బడ్జెట్ నే కామెడీగా తీసుకున్నారు!

రేటింగ్ : 2 /5

Konda Surekha Creates Tension In Congress | Revanth Reddy | Telugu Rajyam