Market Mahalakshmi Movie Review: ‘మార్కెట్ మహాలక్ష్మి’ మూవీ రివ్యూ

‘కేరింత’ మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. బి2పి స్టూడియోస్ బ్యానర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను వియస్ ముఖేష్ నిర్వహించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్ లో విడుదల కానుంది. ఈ సందర్భం గా చిత్ర యూనిట్ ప్రెస్ షో నిర్వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం….

కథ: ప్రభుత్వాఫీసులో గుమస్తాగా పని చేసే వ్యక్తి (కేదార్ శంకర్) తన కుమారుడు (పార్వతీశం)ని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేస్తాడు. అతనికి కట్నం ఎక్కువ ఇచ్చే అమ్మాయితో పెళ్లి చేసి తను పెట్టిన ఖర్చులకు వడ్డీతో సహా రాబట్టుకోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ, ప్లాన్ రివర్స్ అవుతుంది. పార్వతీశం తన తండ్రి చెప్పిన అమ్మాయిని కాకుండా మార్కెట్‌లో కూరగాయలు అమ్మే గడుసైన మహాలక్ష్మి(ప్రణీకాన్విక)ని ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. అయితే తండ్రి పక్షవాతంతో మంచాన పడడం, అన్న కోటర్ కృష్ణ(మహబూబ్ బాషా) తాగుడుకు బానిస అవడంతో మహాలక్ష్మే కుటుంబ బాధ్యతను భుజాలకెత్తుకుంటుంది. చిన్నప్పటి నుంచే రెబల్‌గా పెరగడంతో ప్రేమకి ఎక్కువ వాల్యూ ఇవ్వదు. అలాంటి అమ్మాయిని ప్రేమలో పడేయడానికి హీరో పార్వతీశం ఏం చేశాడు? తండ్రి మాట కాదని, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ కొత్త ట్విస్ట్ ఏంటి? అనేది కథ…

విశ్లేషణ: ‘మార్కెట్ మహాలక్ష్మి’ అనే టైటిల్‌తోనే ఇదొక ఫీమేల్ ఓరియెంటెడ్ అనిపించినప్పటికీ కుటుంబ విలువలు కూడా ఇందులో ఉంటాయి. తండ్రి చూపించిన ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయి తెచ్చే కట్నానికి అమ్ముడుపోయి బతకడం కంటే ఇండిపెండెంట్‌గా బతికే ఒక ఆడపిల్లను పెళ్లి చేసుకుంటే.. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా తను చూసుకుంటుందనే భరోసా ఉంటుందని ఆలోచించే హీరో కథే ఈ ‘మార్కెట్ మహాలక్ష్మి’. డైరెక్టర్ ముఖేష్ తన ఫ్రెండ్ లైఫ్‌లో జరిగిన సంఘటనల్ని తీసుకుని ఈ సినిమా కథ రాసినట్లు చెప్పారు. కొన్ని వైవిధ్యమైన జీవితాలు సినిమా కథలకు పనికొస్తాయనే పాయింట్‌ను నమ్మి డైరెక్టర్ ఈ కథను తీసుకున్నారు. తను తీసుకున్న పాయింట్‌ను ప్రేక్షకులకు అర్థమయ్యేలా కన్విన్సీగా చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. డైరెక్టర్ డైలాగ్స్ & కామిడి తో తన ప్రతిభను కనబర్చారు. కొన్ని సన్నివేశాల్లో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లు అనిపిస్తుంది. సీనియర్ ఆర్టిస్ట్, రచయిత, దర్శకుడు అయిన హర్ష వర్ధన్ క్యారెక్టర్ ద్వారా హీరో పాత్రకు గీతోపదేశం చేయిస్తాడు. మొత్తంగా అయితే డైరెక్టర్ తను అనుకున్న పాయింట్‌ను అనుకున్నట్లు చెప్పడంలో ఎక్కడా తడబడలేదు. తను చెప్పదలుచుకున్న కథ నూటికి నూరుపాళ్లు ప్రేక్షకులకు అర్ధమయ్యేలా విభిన్నంగా తెరపై చూపించి మంచి మార్కుల్ని కొట్టేశాడు. తొలిసగం ఓకే అనిపించేలా సాగింది. ద్వితీయార్ధం ఆసక్తికలిగించి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది.

నటి నటులు పెర్ఫామెన్స్: కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడే. ఈ సినిమాలో హీరో పార్వతీశం చాలా సెట్టిల్డ్ గా పెర్ఫామెన్స్ ఇస్తూ ది బెస్ట్ నటన కనబర్చారు. తన గత సినిమాల కన్నా ఈ సినిమా ది బెస్ట్ అని చెప్పచ్చు. హీరోయిన్ ప్రణికాన్విక(మహాలక్ష్మి) ఇండస్ట్రీ కి కొత్త అయ్యిన క్యారెక్టర్ లో చురుకు, బెడుసు తనం చూపిస్తూనే టైటిల్ క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ ఇచ్చింది. హీరో ఫ్రెండ్‌గా చేసిన ముక్కు అవినాష్ సీన్స్ తక్కువే అయ్యినప్పటికీ ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు. హీరోయిన్ అన్నగా చేసిన మహబూబ్ బాషా కొన్ని సీన్లలో జూనియర్ తాగుబోతు రమేష్‌ యాక్టింగ్ ఛాయలు కనిపిస్తాయి. ‘సలార్’ తర్వాత ఇందులో కసక్ కస్తూరి పాత్రలో నటించిన పూజా విశ్వేశ్వర్ తనదైన మేనరిజంతో మార్కెట్ లో పని చేసే గుర్తుండిపోయే క్యారెక్టర్ చేసింది. ఇక హర్షవర్ధన్, కేదార్ శంకర్, జయ, పద్మ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం: దర్శకుడు ముకేష్ కు సమర్ధవంతంగా షార్ట్ ఫిల్మ్స్ చేసిన అనుభవం ఉండటంతో ఎంతో పకడ్బందీగా 26 రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేసి మొదటి మార్క్ కనబర్చారు. సురేంద్ర చిలుముల సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. జో ఎన్మవ్ సంగీతం ఓకే. సాఫ్ట్ వేర్ పొరగా అంటూ సాగే సాంగ్ అలరించింది. సృజన శశాంక బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాత అఖిలేష్ కలారు కొత్తవాళ్లను నమ్మి సినిమా చేయడంతో మూవీస్ పై తనకున్న ఫ్యాషన్ అర్ధమవుతుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. సినిమాలో కుటుంబ విలువలతో పాటు, కామెడీ, డైలాగ్స్ ఈ సినిమాకి ప్రధాన బలం. ఓవరాల్ గా సినిమాని థియేటర్ లో తప్పకుండా చుడాల్సిన సినిమా. సో, డోంట్ మిస్ టూ వాచ్.

(చిత్రం: మార్కెట్ మహాలక్ష్మి , విడుదల తేదీ: 19/04/2024, రేటింగ్: 2.75/5, నటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్, తదితరులు…. , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: లోకేష్. పి, కొరియోగ్రఫీ: రాకీ, ఎడిటర్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లి, బ్యాగ్రౌండ్ స్కోర్: సృజన శశాంక, సంగీతం: జో ఎన్మవ్ , సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల, ప్రొడ్యూసర్: అఖిలేష్ కలారు, ప్రొడక్షన్ హౌస్: బి2పి స్టూడియోస్, రచన & దర్శకత్వం: వియస్ ముఖేష్)