(చిత్రం : మంజుమ్మెల్ బాయ్స్ , విడుదల తేదీ : 06, ఏప్రిల్ 2024, రేటింగ్ : 3/5, నటీనటులు: సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ మరియు అర్జున్ కురియన్ తదితరులు, దర్శకత్వం: చిదంబరం, నిర్మాతలు: బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని, సంగీత దర్శకులు: సుశీన్ శ్యామ్, సినిమాటోగ్రఫీ : షైజు ఖలీద్, ఎడిటింగ్: వివేక్ హర్షన్).
సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్ కీలక పాత్రలు పోషించిన చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ . ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమా ఈ శుక్రవారం (6, ఏప్రిల్ 2024) విడుదలైంది. మరి ఈ చిత్రం, ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం….
కథ : కుట్టన్ (షౌబిన్ షాహిర్), సుభాష్ (శ్రీనాథ్ భాషి) కేరళలోని కొచ్చికి చెందిన మంజుమ్మల్ బాయ్స్. వీరి మిత్రులందరూ చిన్నచితకా ఉద్యోగాలు చేసుకుంటూ సరదాగా కాలం వెళ్లదీస్తుంటారు. అయితే, ఈ మంజుమ్మెల్ బ్యాచ్ కొడైకెనాల్ ట్రిప్ కు ప్లాన్ చేస్తారు. ఆ ట్రిప్ పై ఆసక్తి చూపని సుభాష్ ని కుట్టన్ ఒప్పించి తీసుకువెళ్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మంజుమ్మెల్ బాయ్స్ అందరూ గుణ కేవ్ అనే లోతైన లోయ ప్రాంతానికి వెళ్తారు. ఆ లోయల్లో పడ్డవాళ్లెవ్వరూ ప్రాణాలతో బయటపడ్డదాఖలాలు లేవు. అందుకే గుణ కేవ్ లోపలికి వెళ్లడాన్ని నిషేదించారు. కానీ, మంజుమ్మెల్ బాయ్స్ మాత్రం సెక్యూరిటీ సిబ్బందికి కళ్లుగప్పి ఆ గుణ కేవ్ లోపలికి వెళ్తారు. అలా అనుకోకుండా సుభాష్ ఓ ఇరుకైన లోయలోకి పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ?, సుభాష్ ప్రాణాలతో బయటపడ్డాడా ? లేదా ?, సుభాష్‌ను కాపాడటానికి కుట్టన్ ఎలాంటి సాహసం చేశాడు ?, చివరికి ఏం జరిగింది ? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ: ‘మంజుమ్మల్ బాయ్స్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్ లో చెప్పాలనకున్న మెయిన్ కంటెంట్ మరియు ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుపోయాయి. అలాగే నటీనటుల నటన అద్భుతంగా అనిపిస్తోంది. ముఖ్యంగా కుట్టన్ – సుభాష్ మరియు ప్రధాన పాత్రల మధ్య సున్నితమైన భావోద్వేగాలు కూడా ఆకట్టుకున్నాయి. కాకపోతే, స్లో నేరేషన్, పూర్తిస్థాయిలో కమర్షియల్ అంశాలు లేకపోవడం వంటి అంశాలు సినిమాకి కొంత మైనస్ అయ్యాయి. మంచి కథాంశం తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు చిదంబరం అంతే స్థాయిలో ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకున్నాడు. కానీ, కొన్ని సన్నివేశాలను మాత్రం సింపుల్ గా మలిచాడు. ఈ ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చినా.. కమర్షియల్ ఎలిమెంట్స్ కి మాత్రం దూరంగా సాగింది. ఎన్నో లాజికల్ పాయింట్స్ ని పర్ఫెక్ట్ గా రివీల్ చేసిన డైరెక్టర్ కొన్నిటిని మాత్రం ఇన్ డైరెక్ట్ గా చాలా సింపుల్ గా చూపించి వదిలేశాడు. అలాగే, కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాల్లో ప్రధానంగా సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ ను ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుంది ?, సుభాష్ పాత్ర ఆ లోయ నుంచి ఎలా బయట పడతాడు ? అనే ఉత్కంఠను ప్రేక్షకుల్లో బాగానే కలిగించినా.. అదే పాయింట్ చుట్టూ కథను సాగదీయడంతో సినిమాలో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే స్లో అయ్యింది. డిఫరెంట్ సర్వైవల్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఓ లోతైన లోయ చుట్టూ అల్లుకున్న ఇన్సిడెంట్స్, అలాగే స్నేహితుల మధ్య ఎమోషన్స్, టూరిస్ట్ గా వెళ్ళి రియలిస్టిక్ గా అనుకోని ప్రమాదంలో పడే సీన్స్ అండ్ ఆ లోయలో నుండి బయట పడే సీన్స్ మరియు చివరిగా సినిమాలో ఉన్న మంచి మెసేజ్ ఈ సినిమాకే హైలెట్స్ గా నిలిచాయి. వందలాది అడుగుల లోతైన లోయలో పడిన ఓ యువకుడిని అతడి స్నేహితులు ప్రాణాలకు తెగించి ఎలా కాపాడారు అన్నదే మెయిన్ పాయింట్. ఈ చిన్న పాయింట్ చుట్టూ రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామాను దర్శకుడు చిదంబరం చాలా బాగా బిల్డ్ చేశాడు. అలాగే, నటీనటుల యాక్టింగ్, విజువల్స్, బీజీఎమ్ ఈ సినిమాకు ప్రాణం పోశాయి. షౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాషిలతో పాటు మిగిలిన పాత్రధారులందరూ చాలా బాగా నటించారు. వారిది యాక్టింగ్ అన్న అనుభూతి ఎక్కడ కలగదు. రియల్ లైఫ్ లో యూత్ గ్యాంగ్ ఎలా ఉంటారో, వాళ్ల అల్లరి కూడా అలాగే సాగింది. వందల అడుగుల లోతైన లోయల్లో పడ్డాక సాగిన సన్నివేశాలు చాలా సహజంగా అనిపించాయి. ఆ లోయలో పడ్డవాళ్లెవ్వరూ ప్రాణాలతో బయటపడలేదు అని తెలిసినా తమ స్నేహితుడి కోసం మంజుమ్మల్ బాయ్స్ ప్రాణాలకు తెగించే సంఘటనలు కూడా ఆకట్టుకుంటాయి. పోలీస్ స్టేషన్ సీన్ తో పాటు సుభాష్‌ను కాపాడేందుకు చేసే ప్రయత్నాలు కూడా మెప్పిస్తాయి. ముఖ్యంగా చిన్ననాటి ఎపిసోడ్ లను ప్రస్తుత లోయ ప్రాంతానికి కనెక్ట్ చేస్తూ చిదంబరం రాసుకున్న స్క్రీన్ ప్లే బాగుంది.
సాంకేతిక విభాగం : ఈ సినిమాకు సంగీత దర్శకుడు సుశీన్ శ్యామ్ అందించిన సంగీతం బాగుంది. షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలీచింది. ఇక దర్శకుడు చిదంబరం ఆలోచనను నమ్మి ఇలాంటి వాస్తవిక చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాతలు బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని లను అభినందించాలి. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టే ఉన్నాయి. మొత్తమీద ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ ‘మంజుమ్మెల్ బాయ్స్’ ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను ఆకట్టుకునే ఓ ఎమోషనల్ థ్రిల్లర్ !
రేటింగ్ : 3/5