తారాగణం: మౌళి తనుజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ తదితరులు
రచన, దర్శకత్వం: సాయి మార్తండ్
నిర్మాత: ఆదిత్య హాసన్
సంగీతం: సింజిత్ యెర్రమల్లి
విడుదల తేది: 05-09-2025
కథా నేపథ్యం:
“లిటిల్ హార్ట్స్” చిత్రం ప్రభుత్వ ఉద్యోగి గోపాల్ రావు (రాజీవ్ కనకాల) తన కుమారుడు అఖిల్ (మౌళి తనుజ్) ను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా, సంగీత దర్శకుడిగా చూడాలని కోరుకోవడంతో మొదలవుతుంది. అయితే అఖిల్ ఎంసెట్ క్వాలిఫై కాలేకపోవడంతో, లాంగ్ టర్మ్ కోచింగ్‌లో చేరతాడు. అక్కడ బైపీసీ చేసి మెడిసిన్ సీట్ సాధించలేక లాంగ్ టర్మ్ కోచింగ్‌కు వచ్చిన కాత్యాయని (శివానీ నాగరం)తో పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే వారి ప్రేమకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అఖిల్, కాత్యాయని తమ తల్లిదండ్రుల ఆశలను నెరవేరుస్తారా? వారి ప్రేమకు ఎలాంటి ముగింపు లభిస్తుంది? అనేది ఈ చిత్ర కథాంశం.
సినిమా విశ్లేషణ:
“లిటిల్ హార్ట్స్” ఒక రొటీన్ టీనేజ్ ప్రేమకథ అయినప్పటికీ, దర్శకుడు సాయి మార్తండ్ రాసిన సన్నివేశాలు, సంభాషణలు సినిమాను హాస్యభరితంగా మార్చాయి. పిల్లలను ఇంజినీరింగ్, మెడిసిన్ చదివించాలని తల్లిదండ్రులు పడే తపనను ఈ సినిమాలో ప్రధానాంశంగా చూపించారు. ఇది చాలా మంది ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశం. అఖిల్, కాత్యాయని స్నేహితుల మధ్య వచ్చే సరదా సన్నివేశాలు సినిమాకు హాస్యాన్ని పంచుతాయి. అయితే చిన్న పిల్లలను ప్రేమ వ్యవహారాలకు ఉపయోగించుకునే పాయింట్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బూతులను మినహాయిస్తే, దర్శకుడు ఒక ఫీల్ గుడ్, క్లీన్ ఎంటర్‌టైనర్‌ను అందించడంలో విజయం సాధించాడు.
సాంకేతిక వర్గం, నటీనటుల ప్రదర్శన:
మౌళి తనుజ్ అఖిల్ పాత్రలో ఒదిగిపోయి అత్యంత సహజంగా నటించాడు. అతని డైలాగ్ డెలివరీ, హావభావాలు అద్భుతంగా ఉన్నాయి. శివానీ నాగరం కాత్యాయనిగా తన నటనతో మెప్పించింది. రాజీవ్ కనకాల, అనితా చౌదరి అఖిల్ తల్లిదండ్రులుగా, కాంచీ, సత్య కృష్ణన్ కాత్యాయని తల్లిదండ్రులుగా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మధు పాత్రలో నటించిన అబ్బాయి నటన సినిమాకు మరో హైలెట్. సంభాషణలు ఈ సినిమాకు ప్రధాన బలం. సింజిత్ యెర్రమల్లి అందించిన నేపథ్య సంగీతం, కాత్యాయని పాట సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. కొన్ని పాటల ప్లేస్‌మెంట్ వల్ల సినిమా వేగం తగ్గింది. శ్రీధర్ సొంపల్లి ఎడిటింగ్‌లో సెకండాఫ్‌లో మరింత పదును పెట్టి ఉంటే బాగుండేది. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ సైనిక్‌పురి, మల్కాజిగిరి నేపథ్యాన్ని అందంగా చూపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్:
హాస్యభరితమైన సంభాషణలు
నటీనటుల సహజ నటన
ఫీల్ గుడ్ ఎంటర్‌టైన్‌మెంట్
యువతరం సమస్యలను చర్చించిన విధానం
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథాంశం
సెకండాఫ్‌లో సాగదీత
కొన్ని పాటల ప్లేస్‌మెంట్
చిన్న పిల్లలను ప్రేమ సన్నివేశాలకు ఉపయోగించడం
ముగింపు: “లిటిల్ హార్ట్స్” సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే, రెండు గంటల పాటు నవ్వుకొని బయటకు వచ్చే ఒక మంచి సినిమా. యాక్షన్ సినిమాల మధ్య హాయిగా నవ్వుకోవాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక. థియేటర్‌లో ఈ సినిమాను చూడటం మంచి అనుభూతిని ఇస్తుంది.
రేటింగ్: 3/5




