Kantara Movie Review: ఈ విజువల్ భక్తీ యాక్షన్ డ్రామా డిఫరెంట్! కాంతారా – చాప్టర్ 1 రివ్యూ!

రచన -దర్శకత్వం : రిషభ్ శెట్టి
తారాగణం : రిషభ్ శెట్టి, రుక్మిణీ వసంత్, జయరాం, రాకేష్ పూజారీ తదితరులు
సంగీతం : బి. అజనీష్ లోక నాథ్, చాయాగ్రహణం : అరవింద్ కశ్యప్ , కూర్పు : సురేష్ మల్లయ్య
బ్యానర్ : హోంబాలే ఫిలిమ్స్
నిర్మాత : విజయ్ కిరగందూర్
విడుదల ; అక్టోబర్ 2, 2025

2022 లో రిషభ్ శెట్టి దర్శకత్వంలో ‘కాంతారా’ అనే 16 కోట్ల బడ్జెట్ సినిమా దేశ వ్యాప్తంగా ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. 450 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ అద్భుత విజయంతో రిషభ్ శెట్టి పెద్ద స్టార్ అయిపోయాడు. వెంటనే ‘కాంతారా’ కి ప్రీక్వెల్ ప్రకటించి ఆ నిర్మాణ కార్యక్రమాల్లో మునిగిపోయాడు.

‘కాంతారా’ ని నిర్మించిన నిర్మాణ సంస్థ, హోంబాలే ఫిల్మ్స్, ‘కాంతారా’ ఫ్రాంచైజీ మొదటి భాగానికి ప్రీక్వెల్ కోసం రిషభ్ శెట్టితో మరోసారి జతకట్టింది. దీన్ని 125 కోట్ల భారీ బడ్జెట్ తో తలపెట్టారు. అయిదు భాషల్లో పానిండియా మూవీగా ఈ రోజు విడుదల చేశారు. చాలా ఆసక్తి రేపుతూ వచ్చిన ఈ ప్రీక్వెల్ ఇప్పుడు ‘కాంతారా’ ని మించి కంటెంట్ తో, మేకింగ్ తో ఏ స్థాయిలో ఉన్నదన్నది ప్రశ్న. ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోలేదు. మరి సినిమా ఆకట్టుకుంటోందా? నటుడు, దర్శకుడు, రచయిత రిషభ్ శెట్టి ఈ భక్తీ యాక్షన్ డ్రామాతో మరోసారి నిరూపించుకున్నాడా పరిశీలిద్దాం…

కథేమిటి?
‘ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో అప్పుడు ధర్మాన్ని కాపాడడానికి ఆ ఈశ్వరుడు తన గణాల్ని పంపుతూనే వుంటాడు. ఈ గణాలన్నీ వచ్చి కొలువైంది ఈ పుణ్యభూమిలోనే’ అంటూ దట్టమైన అడవిలో వున్న కాంతారా రహస్యాలు చెబుతూ కథ మొదలవుతుంది.

8వ శతాబ్దం నేపథ్యంలో కదంబుల రాజ్యం చివర వున్న కాంతారాలో ఈశ్వరుడి పూదోట వుంటుంది. ఈ ప్రాంతాన్ని గిరిజన తెగ రక్షిస్తూ వుంటుంది. అక్కడ దైవిక బావిలో దొరికిన శిశువు బెర్మే (రిషబ్‌ శెట్టి). ఇతను పెరిగి పెద్దయి భాంగ్రా రాజు కులశేఖర (గుల్షన్‌ దేవయ్య) రాజ్యంలోకి వెళ్లి, అక్కడి దౌర్జన్యాలనీ, వెట్టి చాకిరీనీ చూసి తిరుగుబాటు చేస్తాడు. అక్కడే సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఓ ప్రమాదం నుంచి యువరాణి కనకావతి (రుక్మిణీ వసంత్)‌ని కాపాడతాడు. ఆమె అతడ్ని ప్రేమించడం మొదలెడుతుంది. దీంతో రాజు కులశేఖర మొత్తం కాంతారానే తగలబెట్టేస్తాడు.

ఇప్పుడేం జరిగింది? కాంతారాని బెర్మే ఎలా కాపాడుకున్నాడు, అసలు బెర్మే ఎవరు, బాంగ్రా రాజ్యంతో కాంతారా వాసులు ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది, రాజశేఖర్‌ (జయరామ్‌), కనకావతి అసురజాతి పాత్రలతో కలసి దైవ రహస్యాలని ఎలా తెలుసుకున్నారు, బెర్మే పోరాటం ఎలా మలుపులు తిరిగిందన్నదీ మిగతా కథ.

ఎలావుంది కథ?
భక్తీ యాక్షన్ డ్రామాగా ఈ కథ కమర్షియల్ విలువలతో వుంది. కానీ ‘కాంతారా’ రియలిస్టిక్ విలువలతో వుండడం చేత ఆ కన్నడ కల్చర్ లోని నేటివిటీని ఓన్ చేసుకోగలిగారు ప్రేక్షకులు. ఈ ప్రీక్వెల్ లో బడ్జెట్ ని పెంచి లోకేషన్స్ నీ, విజువల్స్ నీ భారీ టెక్నికల్ విలువలతో ఒక కాల్పనిక ఫాంటసీ లాగా సృష్టించడంతో మనం కృత్రిమత్వాన్ని ఫీలవక తప్పదు. ప్రీక్వెల్ మీద ప్రేక్షకుల అంచనాలు పెరుగుతాయి కాబట్టి దాన్ని అందుకోవడానికి విజువల్ హంగామా చేయాల్సి వచ్చి నట్టుంది దర్శకుడుగా రిషభ్ శెట్టికి.

‘కాంతారా’ పీరియెడ్ కథ కాదు. ప్రస్తుత మనముంటున్న వర్తమాన కాలపు గిరిజన కథ. ఇప్పుడు అదే గిరిజనులతో ప్రీక్వెల్ ని 8 వ శతాబ్దానికి తీసికెళ్ళి పీరియెడ్ మూవీగా రూపొందించడంతో సహజంగానే నమ్మదగని కృత్రిమ ఫార్ములా కమర్షియల్ కథ మన కందింది.

‘కాంతారా’ లో భూతకోల వంటి కర్ణాటక సాంస్కృతిక/ జానపద కథతో ఆత్మ స్వాధీన ఆచారాల్ని, భక్తి విశ్వాసాలతో మిళితం చేసిన విధానం చాలా క్రేజ్ ని సృష్టించింది. దీనికి దూరంగా ప్రీక్వెల్ ని పూర్తీ స్థాయి భక్తీ యాక్షన్ అడ్వెంచర్ గా నిర్మించడంతో ప్రేక్షకులు తమ అంచనాలని పక్కనబెట్టి దీన్ని ఎంజాయ్ చేయడానికి సిద్ధపడాలి.

ఇక కథా కథనాలు చూస్తే, ఫస్టాఫ్ కథలేక ఎంత మందకొడిగా సాగుతుందో, సెకండాఫ్ కథతో అంత పరుగులు పెడుతుంది. మొత్తం సినిమాకి ఫస్టాఫ్ లో ఇంటర్వెల్, సెకండాఫ్ లో క్లయిమాక్స్ అద్భుతాలు చేస్తాయి. ఈ రెండే కమర్షియల్ గా నిలబెట్టే బలమైన అంశాలు. ఫస్టాఫ్ ఇటు గిరిజనుల ప్రాంతాన్నీ, జీవనాన్నీ; అటు రాజు కి చెందిన రాజ్యంలో జీవనాన్నీ ఎస్టాబ్లిష్ చేస్తూ చాలా సమయం గడిపేయడంతో అప్పటి వరకూ కథ ప్రారంభం కాక అసహనం పుడుతుంది. పైగా పేలవమైన కామెడీ సన్నివేశాలు ఇబ్బందిపెడతాయి. సెకండాఫ్ కథ మంచి పట్టులో వున్నప్పుడు కూడా ఇవే పేలవమైన కామెడీ కామెడీ సన్నివేశాలు అడ్డుపడతాయి.

ఇంటర్వెల్ సీన్ లోనే కథతో సినిమా పైకి లేచి అక్కడ్నుంచీ ముందుకి దూసుకుపోతుంది. ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంఛి క్లయిమాక్స్ వరకూ ఒకదాని తర్వాత ఒకటి ఉత్కంఠభరితమైన యాక్షన్-అడ్వెంచర్ సీక్వెన్స్‌లు కట్టిపడేస్తాయి. మొత్తం సినిమాకి ఆరు నుంఛి ఏడు బ్లాక్‌లు బాగా వర్కవుటయ్యాయి. పులితో తలపడే సీన్, రథం తో యాక్షన్ సీన్, ఇంటర్వెల్ ముందు వచ్చే సీక్వెన్స్, ఆత్మ పూనిన రిషభ్ శెట్టి ఒక అవతారం నుంఛి మరొక అవతారానికి మార్పు చెందే సన్నివేశాలు, అలాగే బాంగ్రా రాజ్యంలో ఈశ్వర విగ్రహం ప్రతిష్టాపన దృశ్యం, యుద్ధ దృశ్యాలు, చివర్లో బిగి సడలని పదిహేను నిమిషాల పాటు సాగే క్లయిమాక్స్ ఎపిసోడ్ – ఇవన్నీ ఫస్టాఫ్ బలహీన కథా కథనాల్ని మర్చిపోయేలా చేస్తాయి. అలాగే సెకండాఫ్ లలో ఊహించని ట్విస్ట్ సర్ప్రైజ్ చేస్తుంది.

ఎవరెలా చేశారు?
‘కాంతారా’ తో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించిన రిషభ్ శెట్టి ప్రీక్వెల్ లో కూడా అసాధారణ నటనా పటిమ కనబర్చాడని చెప్ప వచ్చు. ముఖ్యంగా ఆత్మ పూనిన అవాతారాలతో ప్రదర్శించిన రౌద్ర రసం కట్టిపడేస్తుంది. గిరిజన నాయకుడి పాత్రని ఈ సారి తీవ్రత పెంచి భక్తీ యాక్షన్ డ్రామాకి తగ్గట్టు పోషించాడు. ప్రేమ సన్నివేశాలు సహజంగా నటించాడు. అతడిలోని నటుడ్ని ప్రశ్నించడానికి వీల్లేదు. నటుడిగా అతడి విజృంభణ ఓవరాక్షన్ గా వుండదు, పాత్ర డిమాండ్ చేసినట్టుగానే వుంటుంది.

ఇక హీరోయిన్ రుక్మిణీ వసంత కూడా ఫస్టాఫ్ లో పెద్దగా పాత్ర లేకపోయినా, సెకండాఫ్ లో పాత్ర సృష్టించే మలుపుతో ఉర్రూతలూగిస్తుంది. ఇక్కడనుంచీ అద్భుత నటనతో పాత్రని ఎక్కడికో తీసికెళ్ళి పోయింది. ఇతర తారాగణం- కమెడియన్లు మినహా తమ తమ పాత్రల్లో అర్ధవంతంగా నటించారు.

సాంకేతికాల మాటేమిటి?
ఒక్కటే మాట- విజువల్ వండర్! వంక పెట్టలేని సీజీ ఎఫెక్ట్స్. కొత్త లోకంలోకి తీసికెళ్ళి విహరింప జేసే సాంకేతిక విలువలు- లోకేషన్స్, నిర్మాణాలు. ఎక్కువ భాగం దట్టమైన అడవుల్లో, కొండ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. ఇవన్నీ ప్రమాదకర లోకేషన్స్. అయినా వెనుదీయకుండా సాహసించి షూట్ చేశారు. కొండ ప్రాంతంలో రధం యాక్షన్ సీక్వెన్స్ గగుర్పాటు కల్గిస్తుంది. ఇలాటి రిస్కు చేసిన లొకేషన్స్ ఇంతకంటే భారీ బడ్జెట్స్ తో తీసిన ఏ పానిండియా సినిమాలోనూ కన్పించవు! అరవింద్ కశ్యప్ కెమెరా వర్క్ అవార్డులకి అర్హమైనది.

అలాగే అజనీష్ లోకనాథ్ సంగీతం. పీరియెడ్ కథ కనుగుణమైన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో, పాటలతో కథాత్మని మరో స్థాయికి తీసుకెళ్లాడు. సురేష్ మల్లయ్య కూర్పు కామెడీని తగ్గించి వుంటే సుదీర్ఘంగా సాగిన సినిమా నిడివి తగ్గేది. ఇతర సాంకేతికులందరూ రిషబ్ శెట్టి దార్శనికతకి ప్రాణం పోసేందుకు కలిసికట్టుగా కృషి చేసినట్టు కన్పిస్తుంది.

చివరికేమిటి?
ధర్మాన్ని తిరిగి స్థాపించే సంరక్షకుడి కథతో రిషభ్ శెట్టి చేసిన ఈ ప్రయత్నం ఒక విజువల్ వండర్. విజువల్ వండర్ కోసం వందల కోట్లు వెచ్చిస్తున్న ట్రెండ్ లో కేవలం 125 కోట్లతో సాధించి చూపించాడు. ఇది ఇతర దర్శకులకి బాట వేయాలి. కథా పరంగా, ఒరిజినల్ ‘కాంతారా’ నేటివిటీనీ, రియలిస్టిక్ అప్రోచ్ నీ అందుకోలేక పోయినా, ఈ చాప్టర్ -1 ని కమర్షియల్ సినిమా దృష్టితో చూసి వినోదించాల్సి వుంటుంది. చాలా సినిమాల సీక్వెల్స్ ఫ్లాపవుతున్న నేపథ్యంలో ఈ ప్రీక్వెల్ సక్సెస్ బాట వేసుకోవడం విశేషం. చాలా సినిమాలు ఫస్టాఫ్ బావుండి సెకండాఫ్ కథ దగ్గర చేతులెత్తేస్తున్న సందర్భంలో, ఇది రివర్స్ లో ఫస్టాఫ్ చేతులెత్తేసి సెకండాఫ్ చప్పట్లు కొట్టించుకునే ప్రత్యేకతని సాధించుకుంది. విజయానికి ఇంతకంటే ఏం కావాలి? దసరాకి సత్కాలక్షేపమే!

రేటింగ్ : 3/5

Prof Haragopal: Will The local elections be Postponed? | Court | Telugu Rajyam