‘118’ మూవీ రివ్యూ

118

రచన – దర్శకత్వం : కె.వి. గుహన్
తారాగణం : కళ్యాణ్ రామ్, శాలినీ పాండే, నివేదా థామస్
సంగీతం : శేఖర్ చంద్ర, ఛాయాగ్రహణం : కె.వి. గుహన్
బ్యానర్ : ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్
నిర్మాత: కోనేరు మహేష్
విడుదల : మార్చి 1, 2019
2.5 / 5

నందమూరి కళ్యాణ్ రామ్ సక్సెస్ రేటు అంతంత మాత్రంగా వున్న వేళ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని ప్రయత్నించాడు. పిసి శ్రీరాం అసిస్టెంట్ అయిన సీనియర్ తమిళ ఛాయాగ్రాహకుడు (‘ఖుషి’ ఫేమ్’) కెవి గుహన్, మొదటిసారి దర్శకత్వం వహిస్తూ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తీశాడు. మాస్ సినిమాలు చేస్తూ వస్తున్న కళ్యాణ్ రామ్ గత ‘నా నువ్వే’ తో లవ్ సినిమా చేసి విఫలమై, ఇప్పుడు మరో మాసేతర ప్రయత్నం చేశాడు. లిమిటెడ్ ఆడియెన్స్ జానర్ అయిన ఇన్వెస్టిగేషన్ ఆధారిత సస్పెన్స్ థ్రిల్లర్ ని ఒక స్టార్ గా తను ప్రయత్నిస్తే మంచిదే. ‘బి’ గ్రేడ్ సినిమాలుగా వుంటూ వచ్చిన హార్రర్ సినిమాల్లో బాలీవుడ్ స్టార్లు నటించడం ప్రారంభించి ‘ఏ’ గ్రేడ్ గా మార్చినట్టు, ఒక స్టార్ గా కళ్యాణ్ రామ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ హోదా పెంచగల్గితే మంచిదే. ట్రెండ్ సెట్టర్ అవుతాడు. కాకపోతే విషయం ఒక ‘గుప్త్’ స్థాయి మ్యూజికల్ థ్రిల్లర్ గా వుంటేనే ట్రెండ్ సెట్టింగ్ సాధ్యమవుతుంది. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ని గుహన్ ఒక స్టార్ ని దృష్టిలో పట్టుకుని తీశాడా, లేక చిన్న హీరోల బడ్జెట్ కథని కళ్యాణ్ రామ్ స్టేటస్ కి ఆపాదించాడా వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం…

కథ

గౌతమ్ (కళ్యాణ్ రామ్) ఒక టీవీ జర్నలిస్టు. ఒక రిసార్ట్ లో అతను రూమ్ నెం 118 లో బస చేసినప్పుడు ఒక కల వస్తుంది. ఆ కలలో ఒకమ్మాయిని ఎవరో చంపి కారుతో బాటు చెరువులోకి తోసేసినట్టు కన్పిస్తుంది. కొంత కాలం తర్వాత అదే రూమ్ లో బస చేసినప్పుడు అదే కల వస్తుంది. దీంతో ఈ కల అంతు తేల్చాలని నిర్ణయించుకుని ఇన్వెస్టిగేషన్ మొదలెడతాడు. ఈ ఇన్వెస్టిగేషన్ లో అసిస్టెంట్ (ప్రభాస్ శ్రీను) సహకరిస్తూంటాడు. ఒక వైపు మరదలు మేఘా (శాలినీ పాండే) తో పెళ్లి వుంటుంది. ఇటు వైపు ఆ కల గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు తన మీద దాడులు జరుగుతూంటాయి. ఎవరీ దాడులు చేస్తున్నారు? ఎందుకా అమ్మాయిని చంపారు? అసలా అమ్మాయెవరు?…ఆన్నవి గౌతమ్ చేసే ఇన్వెస్టిగేషన్ లో ఒకటొకటిగా తెలుస్తాయి.

ఎలావుంది కథ

థ్రిల్స్ ఎక్కువ, సస్పెన్స్ తక్కువగా వుంది. ఏ సస్పెన్స్ ని విప్పడానికి థ్రిల్స్ కి పాల్పడుతున్నారో ఆ సస్పెన్స్ తేలిపోయేట్టుగా వుంది. పైగా మిస్టరీ కోసం సృష్టించిన ఫ్లాష్ బ్యాక్ లో విషయం రొటీన్ మెడికల్ మాఫియా ఫార్ములా కథగా బయటపడడంతో, ఏదో నావెల్టీ తో వుంటుందనుకున్న కాన్సెప్ట్ తేలిపోయింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి లూసిడ్ డ్రీమ్స్ అనే సైకియాట్రిక్ టచ్ ఇచ్చారు, ‘టాక్సీవాలా’ లో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటూ పారాసైకలజికల్ టచ్ ఇచ్చినట్టు. అయితే ఈ పాయింటుతో ‘టాక్సీవాలా’ నిలబెట్టుకున్నంత మిస్టరీ ఎలిమెంట్ ‘118’ లోపించడం పెద్ద మైనస్ పాయింటుగా వుంది.

ఎవరెలా చేశారు

టీవీ జర్నలిస్టుగా కళ్యాణ్ రామ్ పాత్రయితే వుంది గానీ, పాత్రకి తగ్గట్టు ఆందోళన, ఎమోషన్లు, పరుగులు, పోరాటాలు మొదలైనవన్నీ బలహీన కథకోసం ప్రదర్శించాడు. కథతో తనకెలాటి ఎమోషనల్ కనెక్ట్ లేదు. చనిపోయిన అమ్మాయితో తనకి కనీసం ప్రొఫెషనల్ కనెక్ట్ కూడా లేదు. పైగా ఒక స్టార్ గా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో స్టార్ ఎలిమెంట్స్ కూడా లేవు. ఇలాటి సినిమాలతో చిన్న హీరోల రేంజికి మించి పాత్ర ఎలివేట్ కాలేదు. కథనం, దాంతో బాటు ఫ్లాష్ బ్యాకు స్టార్ రేంజికి వున్నట్టయితే, కళ్యాణ్ రామ్ పడ్డ కష్టం ఒక గుర్తుండిపోయే ప్రయత్నంగా వుండేది. తనే కాదు, తనతోబాటే హీరోయిన్లిద్దరి పాత్రలు కూడా స్టార్ రేంజి ప్రదర్శన చేసినప్పుడే కళ్యాణ్ రామ్ ఈ లిమిటెడ్ ఆడియెన్స్ జానర్ మూవీని అన్నివర్గాల ప్రేక్షకుల ఎంటర్ టైనర్ గా చేసే వీలవుతుంది. అదేవిధంగా మ్యూజికల్ గా కూడా పవర్ఫుల్ గా వుండాలి. బాబీ డియోల్, కాజోల్, మనీషా కోయిరాలా నటించిన సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘గుప్త్’ లో కమర్షియల్, స్టార్, మ్యూజికల్ ఎలిమెంట్స్ అన్నీ బలంగా వున్నాయి. కోటి రూపాయలతో తీయగల రెంజితో స్క్రిప్టు తయారు చేసుకుని, 14 కోట్ల సినిమా తీస్తే ఎలా?

హీరోయిన్లిద్దరూ బరువు పెరిగిన పొట్టి అమ్మాయిలే. శాలినీ పాండే హీరోని అప్పుడప్పుడు పెళ్లిని గుర్తుచేయడం కోసం వుంటుంది. లేదంటే హీరో కంప్యూటర్ చెక్ చేస్తున్నప్పుడు, వెనకనుంచి వాటేసుకుని కంప్యూటర్ లోకి చూస్తూ వుంటుంది. ఇంకా లేదంటే హీరో వెంట పరుగులు తీస్తూ దిక్కులు చూస్తూ వుంటుంది. చనిపోయిన అమ్మాయి తండ్రిని కలిసిన సీన్లో హీరో వెంట శాలినీ వుండాల్సిన అవసరం లేదు. ఆ గంభీరమైన సీన్లో తను చేయాల్సింది లేక పేలవమైన క్లోజప్స్ ఇస్తూంటుంది.

ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ నివేదా థామస్ లక్ష్యం రొటీనే అయినా (మెడికల్ మాఫియాని బయట పెట్టడం) ఎలాగో ఆ రొటీన్ పాత్రలోనే నటించి – చనిపోయే ముందు మాత్రం ప్రభావం చూపగల్గింది. ఆ సమయంలో ఆమె కుండాల్సిన మైండ్ సెట్ ని దర్శకుడు కరెక్ట్ గా జడ్జి చేస్తి ఎఫెక్టు రాబట్టు కున్నాడు.

ఇక ఇతర పాత్రల్లో చాలా మంది వున్నారు. చాలా లీడ్స్, క్లూస్ ఇస్తూంటారు. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఇంత పెద్ద కేసుని టీవీ జర్నలిస్టు అయిన హీరోకే వదిలేసి, అతను ఎప్పుడడిగితే అప్పుడు కీలక సమాచారాన్ని అందించే కస్టమర్ కేర్ ఉద్యోగుల్లా వుంటారు!

ఈ థ్రిల్లర్ కి నేపధ్య సంగీతంతో శేఖర్ చంద్ర యాక్షన్ సీన్లు టాప్ రేంజికెళ్ళేలా చేశాడు. కెమెరా మాన్ అయిన దర్శకుడు కూడా థ్రిల్లింగ్ షాట్స్ తో మంచి ప్రతిభ కనబర్చాడు. స్టార్ తో చేస్తున్నప్పుడు స్టార్ సినిమా అవుతుందనుకున్నాడు, అలా కాలేదు.

చివరికేమిటి

ముప్పావు వంతు సినిమా చనిపోయిన అమ్మాయెవరో తెలుసుకునే కథనంతోనే నడుస్తుంది. క్లూస్, లీడ్స్ చాలా అందుతూ వాటిని పట్టుకుని పరుగులుదీస్తూంటుంది. మధ్య మధ్యలో విలన్స్ ని చూపుతూ వుండడం వల్ల ఈ మిస్టరీతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ ఎండ్స్ సస్పెన్స్ బారిని పడకుండా తప్పించుకోగల్గింది. ఈ అనేక క్లూస్ తో, లీడ్స్ తో ఎంతో బ్రహ్మాండంగా సినిమా చూపిస్తున్నట్టే వుంటుంది. కానీ కొన్ని చోట్ల ఆ క్లూసే, లీడ్సే మిస్టరీని తేల్చేసేవిగా వున్నా పట్టించుకోలేదు. హీరోని లారీతో మొదటి సారి చంపడానికి వచ్చినప్పుడే వాళ్ళెవరో హీరో తెలుసుకుంటే సరిపోతుంది, ఈ కథ అయిపోతుంది. క్లయిమాక్స్ లో తనని చంపడానికి వచ్చిన కిల్లర్ ని పట్టుకుంటే ఈ ముఠా ఎవరో తెల్సిపోతుంది. ఇలా చేయకుండా 118 రూమ్ లో కెళ్ళి లూసిడ్ డ్రీం లోకి వెళ్లి హంతకుల్ని తెల్సుకునే ప్రయత్నం చేస్తాడు. ఇలా లూసిడ్ డ్రీం అయిడియాకే అర్ధం లేకుండా పోయింది.

దీనికి ముందు ఆ కిల్లర్ ఫ్లాష్ బ్యాక్ తర్వాత దాడి చేసి నప్పుడు, చేతిలో రివాల్వర్ వున్నా హీరోని చంపకుండా చేతులతో ఫైటింగ్ చేసి తన్నులు తినిపోతాడు.

ఇంటర్వెల్ లో చనిపోయిన అమ్మాయి వాయిస్ తో ఫోన్ రావడం సరైన ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా కాదు. ఆ ఫోన్ చేసింది ఎస్తర్ అని వేరే అమ్మాయని తర్వాత రివీల్ అయినప్పుడు, ఆమె ఎందుకలా ఫోన్ చేస్తుంది? తను ప్రమాదంలో వున్నాననీ, చనిపోయిన అమ్మాయి గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్తాననీ అనొచ్చుగా? ఇంటర్వెల్ బ్యాంగ్ పేరుతో ఆ అమ్మాయి బతికే వుందని ఫాల్స్ సస్పెన్స్ సృష్టిస్తే ఎలా?

ఫ్లాష్ బ్యాక్ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ని రన్ చేస్తున్న జానర్ మర్యాదలో లేదు. పాత సినిమా దృశ్యాలు చూస్తున్న రొటీన్ ఫార్ములా దృశ్యాలతో వుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ సగంలోనే ఇక ఆమె ఎందుకు చనిపోతుందో, ఎవరు చంపుతారో, ఎందుకు చంపుతారో తెలిసిపోతుంది. విలన్స్ గురించి ఏదో రహస్యం తెలియడం, అది బయట పెట్టకుండా ఆ హీరోయిన్ని చంపడం చాలా సినిమాల్లో వచ్చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ లో చివర్లో మిస్టరీ రివీల్ అయినప్పుడు చాలా సర్ప్రైజింగ్ గా వుండాల్సింది లేదు.

బోలెడు స్పీడు, యాక్షన్ వున్న సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. స్టార్ సినిమాకి స్పీడు, యాక్షన్ మాత్రమే ప్రేక్షకులకి సరిపోతాయనుకుంటే తప్పక సక్సెస్ అయ్యే అవకాశముంది.

―సికిందర్