Sundarakanda Movie Review: ‘సుందరకాండ’ మూవీ రివ్యూ

రచన- దర్శకత్వం : వెంకటేష్ నిమ్మలపూడి
తారాగణం: నారా రోహిత్, శ్రీ దేవీ విజయ్ కుమార్, వృతీ వాఘానీ, నరేష్, వాసుకీ ఆనంద్, సత్య, అజయ్, అభినవ్ గోమఠం, విశ్వంత్, రూపా లక్ష్మి, సునైనా, రఘు బాబు, అమృతం వాసు తదితరులు.
సంగీతం : లియోన్ జేమ్స్, ఛాయాగ్రహణం : ప్రదీష్ ఎమ్ వర్మ
బ్యానర్: సందీప్ పిక్చర్ ప్యాలెస్
నిర్మాతలు: సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి , రాకేష్ మహంకాళి
విడుదల : ఆగస్టు 25, 2025

ఇటీవల కాలంలో విడుదలైన ప్రతినిధి 2, భైరవం సినిమాల తర్వాత నారా లోకేష్ నటించిన తాజా మూవీ ‘సుందరకాండ’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. గతంలో ఒకటి రెండు తప్ప 14 వరస ఫ్లాపులే ఎదుర్కొన్న రోహిత్, ఈసారి కొత్త దర్శకుడు వెంకటేష్ నిమ్మల పూడి తో రొమాంటిక్ కామెడీ ప్రయత్నించాడు. ఈ మధ్య రోమాంటిక్ కామెడీల మార్కెట్ తగ్గినా పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కలిసి చేసిన ప్రయత్నం సఫలమైందా లేదా చూద్దాం….

కథేమిటి?
సిద్ధార్థ్ (నారా రోహిత్) 40 దగ్గర పడుతున్నా పెళ్ళి చేసుకోకుండా జుట్టుకి రంగేసుకుని తిరుగుతూంటాడు. తల్లి దండ్రులు (నరేష్, రూపలక్ష్మి) ఏ సంబంధం చూసినా దాన్ని చెడగొడుతూంటాడు. కారణం తను కోరుకున్న ఐదు లక్షణాలూ ఏ అమ్మాయిలోనూ కనిపించక పోవడం. ఈ ఐదు లక్షణాలు స్కూల్లో చదివేటప్పుడు తన సీనియర్ వైష్ణవి (శ్రీదేవీ విజయకుమార్) లో చూసి మెచ్చుకున్నాడు. అదే మనసులో వుంచుకుని ఇప్పుడు పెళ్ళి దగ్గర స్ట్రగుల్ చేస్తున్నాడు.

ఇలావుండగా, ఇక ఫారిన్ వెళ్ళిపోవాలని ఏర్ పోర్టుకి వెళ్తే అక్కడ ఐరా (వృతీ వాఘానీ) అనే అమ్మాయిని చూసి ఆగిపోతాడు. ఆమెలో తను కోరుకుంటున్న ఐదు లక్షణాలూ కనిపిస్తాయి. ఇక ఆమె వెంటపడి ప్రేమించి పెళ్ళికి ఒప్పించుకుంటాడు. ఇక తన కంటే చాలా చిన్నదైన ఐరా కుటుంబంతో సంబంధం మాట్లేడేందుకు వెళ్ళేసరికి అక్కడ షాక్ తింటాడు.

ఇది ఊహించని పరిస్థితి. తన పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఇప్పుడేం చేయాలి? ఈ పెళ్ళి జరుగుతుందా? ఎలా జరుగుతుంది? ఏమిటి మార్గం? అసలా పరిస్థితి ఏమిటి? ఈ చిక్కుముడిని ఎలా విప్పాలి? …ఇదీ మిగతా ప్రేమ కథ. .

ఎవరెలా చేశారు?
నారా రోహిత్ వయసు దాటిన బ్యాచిలర్ గా తన వయసు రీత్యా కూడా సరిపోయాడు. కాకాపోతే ఎప్పటిలానే అన్నిటికీ ఒకే ఎక్స్ ప్రెషన్ తో సరిపుచ్చాడు. ఎక్కువగా కామెడీతో సాగే కథ కాబట్టి అంతవరకూ ఫర్వలేదనిపిస్తాడు. బరువైన సీన్లు వచ్చినప్పుడు మాత్రం ఎక్స్ ప్రెషన్స్ డిటో. ఫన్నీగానే కనిపిస్తాడు. రోమాంటిక్ సీన్లు మాత్రం బాగానే చేశాడు. స్టయిలిష్ లుక్ తో ఫైట్లు కూడా చేశాడు. అయితే ఈ కథకి ఫైట్లు అవసరం లేదు. ఐరాగా హీరోయిన్ వృతీ వాఘానీ కాలేజీ స్టూడెంట్ పాత్రకి సరిపోయింది యూత్ అప్పీల్ తో. కథలో వున్న మలుపుల్లో, బరువైన సన్నివేశాల్లో నెట్టుకు రావడానికి కష్టపడింది. సీనియర్ హీరోయిన్ శ్రీదేవీ విజయకుమార్ వయసుకి పాత్రలో హుందాతనం కనబర్చింది. హీరో తండ్రిగా నరేష్ కామెడీ పాత్రే. ఇక హీరో ఫ్రెండ్ గా కమెడియన్ సత్య కామెడీ తో బాగా ప్లస్ అయ్యాడు. ఇదొక సీరియస్ ప్రేమ కథే అయినా అందులోని సమస్యని దాటవేస్తూ కామెడీతోనే నడిపించడం వల్ల అందరి నటనలూ లైటర్ వీన్ గానే కనిపిస్తాయి.

సాంకేతికాలేమిటి?
లియోన్ జేమ్స్ సంగీతంలో రోమాంటిక్ కామెడీ పాటలు క్యాచీగా ఏమీ లేవు. తెరమీద చూస్తే చెల్లిపోయేట్టుగా వున్నాయే తప్ప, పాటల కోసం ప్రేక్షకులు వచ్చేలా మాత్రం లేవు. దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ఫ్రెష్ డైలాగుల మీద పెట్టిన దృష్టి పాతాళ మీద కూడా పెట్టి వుండాల్సింది. ప్రదీప్ వర్మ చాయాగ్రహణం బ్రిలియెంట్ గా వుంది. మోడరన్ లవ్ స్టోరీ కి తగ్గట్టు స్టయిలిష్ గా, కూల్ గానూ కూడా వుంది. ఫైటింగ్ దృశ్యాలు, ఇతర ప్రొడక్షన్ విలువలూ ఉన్నతంగా వున్నాయి. ఎడిటింగ్ ఎడిటర్ చేతిలో లేదు. దర్శకుడి కథలో సాగదీసిన సన్నివేశాలు ఎడిటింగ్ కి అందకుండా వున్నాయి.

కథా కథనాలు?
1975 లో దాసరి నారాయణ రావు నరసింహా రాజు, మాధవి, శ్రీ విద్య, సత్య నారాయణ లో తీసిన ‘తూర్పు పడమర’ కథని పోలి వుంది ‘సుందరకాండ’ కథ. ‘తూర్పు పడమర’ ని తమిళంలో కే బాల చందర్ తీసిన హిట్ ‘అపూర్వ రాగంగళ్’ రీమేకుగా తెలుగులో తీశారు. ఇందులో తెలియక తండ్రీ కొడుకులు తల్లీకూతుళ్ళని ప్రేమించి ప్రమాదంలో పడతారు. ‘సుందర కాండ’ లో తల్లిని ప్రేమించిన హీరో కూతుర్ని పెళ్లాడ బోతాడు. ఇది రిస్కీ సబ్జెక్టే, దీన్ని డీల్ చేసిన విధానం ఆషామాషీగా సాగిపోయింది. కథలో ఏర్పడ్డ సమస్యని మరిపించాలని చూస్తూ కామెడీ కథనంతో లాక్కుపోయాడు దర్శకుడు. హీరో తల్లిని ప్రేమించాడు, ఆమె కూతుర్ని పెళ్ళి చేసుకోవడానికి ఆమె తల్లి దగ్గరికె పోయాడు…ఆన్న సెన్సిటివ్ విషయాన్నీ, ఇందులోని నైతికతని, సామాజిక ఒప్పుదలనీ …మొదలైన వాటిని డీల్ చేయకుండా, పాత్రల్ని కామెడీగా మార్చేసి కథ నడిపే సేఫ్ రూటుని ఎంచుకున్నాడు దర్శకుడు. ఈ కథని సీరియస్ గా తీసుకోకుంటే సరదాగా ఓసారి చూసేయవచ్చు.

ఐతే ఫస్టాఫ్ లో హీరోయిన్ ఎంటరయ్యే వరకూ హీరోతో కథ ఫ్లాట్ గా తెగ సాగదీసి నడిపాడు. అలాగే సెకండాఫ్ కతముగించడానికి కుదరక సాగదీశాడు. దీనికి ఎడిటర్ కత్తెర కూడా పడే పరిస్థితి లేదు. అయితే కొత్త దర్శకుడు తోలి సినిమాతో ఈ మాత్రం కృషి చేయడం గొప్పే. చాలా కాలం తర్వాత నారా రోహిత్ కి ఓ ఫర్వాలేదనిపించే ఎంటర్ టైనర్ గా ‘సుందర కాండ’ దొరికింది.

చంద్రబాబు బాగోతం || Analyst Chitti Babu EXPOSED Chandrababu Reaction On Jr NTR Mother Issue || TR