కథ : సాప్ట్ వేర్ ఎంప్లాయ్ భాను ప్రకాష్ (వినోద్ వర్మ) జీవితం నిస్సారంగా, నిస్తేజంగా సాగిపోతూ ఉంటుంది. ఆఫీస్ కి దగ్గిరగా ఉంటుందని తన ఫ్రెండ్ ఫ్లాట్ కి మారిన భాను కి అక్కడ స్వేచ్చ (జ్ఞానేశ్వరి కండ్రెగుల) తో పరిచయం అవుతుంది. బ్రాడ్ మైండెడ్ గా మోడర్న్ భావాలు కల స్వేచ్ఛ తో భాను చనువుగా ఉంటాడు. స్వేచ్ఛ ఓపెన్ రిలేషన్ షిప్ లో ఉండగా భాను మాత్రం ఎమోషనల్ కమిట్మెంట్ కోరుకుంటాడు. స్వేచ్ఛ పరిచయం భాను జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది ? విరుద్ధ భావాలు గల వీళ్లిద్దరూ చివరికి ఏమయ్యారు అనేదే ‘ ఏమి సేతుర లింగ’.
విశ్లేషణ : రెండు గంటల లోపే నిడివి ఉండే ఏమి సేతుర లింగ యువత లోని ఆధునిక భావాలను, ఆలోచనలను ఎఫెక్టివ్ గా డిస్కస్ చేస్తుంది. చాప్టర్స్ గా విభజించి స్టోరీ ని నేరెట్ చేసిన విధానం బాగుంది. ఈ స్క్రీన్ ప్లే టెక్నిక్ కాంప్లెక్స్ సబ్జెక్ట్ ను సింపుల్ గా చెప్పడానికి ఉపయోగపడింది. మొదటి సగ భాగం నెమ్మదిగా సాగినా, హీరో తీసుకునే కీలక నిర్ణయం తర్వాత సినిమా ఆసక్తికరంగా మారుతుంది. అందుకు తగ్గట్టుగానే సన్నివేశాలను రాసుకోవడం పాత్రలతో మనం ట్రావెల్ అవుతాం. రెండో సగం మంచి ఎమోషన్స్ తో, స్పీడ్ స్క్రీన్ ప్లే తో ఎంగేజ్ చేస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే డైలాగులు బాగున్నాయి.
సాంకేతిక నిపుణుల పనితీరు : మోడర్న్ రిలేషన్ షిప్స్ ఆధారంగా నేటి యువత ఆలోచనలు, సందిగ్ధతలు ఎలా ఉంటాయి అనే కాంప్లెక్స్ పాయింట్ ను దర్శకుడు సందీప్ మొదటి సినిమాకే ఎంచుకోవడం సాహసమే. దాన్ని రియాలిస్టిక్ గా మలిచిన తీరు, మెచ్యుర్డ్ సంభాషణలు సినిమాలోని కాంప్లెక్సిటీ ని సింపుల్ గా కనెక్ట్ అయ్యేలా చేసింది. ఈ విషయంలో దర్శకుడి పనితీరు మెచ్చుకోవాలి. అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ కి తగ్గట్టు నేచురల్ గా ఉంది. జెన్ మార్టిన్ సంగీతంలోని పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం మృదువుగా ఉంటూ అవసరమైన చోట సంభాషణలకు ప్రాధాన్యత ఇస్తూ లైట్ గా సాగడం బాగుంది. ఆస్కార్ అవార్డ్ విన్నెర్ రసూల్ పూకుట్టీ, అరునవ్ దత్త అందించిన సౌండ్ డిజైన్ ఇంప్రెస్స్ చేస్తుంది. ప్రీతం ఎడిటింగ్ బాగుంది. భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మించడంలో నిర్మాతలు సందీప్, మురళీకృష్ణ తమ అభిరుచి చాటుకున్నారు.
నటీనటుల పనితీరు : బోర్ డం తో సాగిపోయే జీవితంతో స్తబ్దుగా కనిపించే భాను ప్రకాష్ పాత్రలో వినోద్ వర్మ బాగా సరిపోయాడు. అమాయకంగా కనిపిస్తూ, ఇంట్రవర్ట్ లుక్ లో సెట్ అవడమే కాకుండా ఆ పాత్రతో రిలేట్ చేసుకునేలా చక్కని పెర్ఫార్మెన్స్ కనబరిచాడు. మైమ్ ఆర్టిస్ట్ గా కబరిచిన నటన హైలైట్. ఇక ఇండిపెండెంట్ వర్కింగ్ అమ్మాయిగా రిలేషన్ షిప్స్ మీద కచ్చితమైన మోడర్న్ అభిప్రాయాలు గల అమ్మాయిగా స్వేచ్చ పాత్రలో జ్ఞానేశ్వరి కండ్రేగుల ఆకట్టుకుంది. చక్కని ఎక్స్ప్రెషన్స్ తో క్యారక్టర్ ను బాగా క్యారీ చేసింది. ఇతర పాత్రల్లో కేశవ్ దీపక్, ఆనంద చక్రపాణి, పవన్ రమేష్, మేఖ రామకృష్ణ, సి కె అమర్నాథ్ తమ పరిధి మేర నటించారు.
(చిత్రం : ఏమి సేతుర లింగ, రేటింగ్ : 3 / 5 బ్యానర్ : వీక్షణ టాకీస్, స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం : ఆహా, నటీనటులు : జ్ఞానేశ్వర్ కండ్రేగుల, వినోద్ వర్మ, సురభి శర్మ, యాషి మౌనిక, హనుమంత్ మల్చుమ్ కేశవ్ దీపక్, ఆనంద చక్రపాణి, పవన్ రమేష్, మేఖ రామకృష్ణ, సి కె అమర్నాథ్, సంగీతం : జెన్ మార్టిన్, ఎడిటర్ : ప్రీతం, సినిమాటోగ్రఫీ : అభిరాజ్ నాయర్, సౌండ్ డిజైన్ : రసూల్ పూకుట్టీ, అరునవ్ దత్త, నిర్మాతలు : సందీప్, మురళీకృష్ణ, రచన దర్శకత్వం : కె సందీప్)