ఇంతకీ ఏం చెప్పారో! : దేవదాస్ (మూవీరివ్యూ)

(సికిందర్)

 

‘దేవదాస్’

రచన – దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య

తారాగణం : నాగార్జున, నాని, రశ్మికా మందన, ఆకాంక్షా సింగ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, అవసరాల శ్రీనివాస్, మురళీశర్మ, నరేష్, సత్యకృష్ణ, సత్య, కునాల్ కపూర్ తదితరులు

సంగీతం : శర్మ, ఛాయాగ్రహణం : షాందత్ సైనుద్దీన్

బ్యానర్ : వైజయంతీ మూవీస్

నిర్మాత : సి. అశ్వనీదత్

విడుదల : సెప్టెంబర్, 27, 2018

 

***

 

          ‘మహానటి’  ఫేమ్ ప్రసిద్ధ వైజయంతీ మూవీస్ నుంచి ఓ ఎంటర్ టైనర్ ముస్తాబైంది. ‘భలేమంచి రోజు’, ‘శమంతకమణి’ లాంటి రెండు చిన్న సినిమాల దర్శకుడు శ్రీరాం ఆదిత్య, మూడో ప్రయత్నంతో ప్రమోటయ్యాడు. ఇద్దరు పాపులర్ స్టార్స్ తో బిగ్ బడ్జెట్ మూవీ తీసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానిల తొలి కాంబినేషన్ లో ‘దేవదాసు’ అనే ప్రసిద్ధ టైటిల్ తో ఆకర్షిస్తూ గ్యాంగ్ స్టర్ కామెడీ తీశాడు. నిర్మాణం జరుపుకుంటున్నప్పట్నించీ దీనికి వచ్చిన గ్లామర్ ఇంతా అంతా కాదు. చాలా ఆకర్షణీ యమైన ప్యాకేజీగా అలరిస్తూ, ఇదేదో బంపర్ ఆఫర్ అన్నట్టు టాలీవుడ్ లోపలా బయటా చెప్పుకుంటూ వచ్చారు. జరిగిన బిజినెస్  అంకెలు కూడా ఓవర్సీస్ సహా బ్రహ్మాండంగా కన్పించాయి. నిర్మాత అశ్వనీదత్ గత ‘కంత్రీ’, ‘శక్తి’ లతో అయిన పరాభవాలనుంచి తలెత్తుకుని ప్రకాశిస్తారన్న నమ్మకాలు కూడా వ్యాప్తిలోకొచ్చాయి. మరి నిజంగా ఇవన్నీ నిజమయ్యాయా?  సినిమాలోనే నేచురల్ స్టార్ నాని పాడుకున్నట్టు, అంతా భ్రాంతియేనా…పాటలా కాలేదు కదా? ఓసారి చూద్దాం…

 

కథ

          దేవా (కింగ్ నాగార్జున) ఒక ఇంటర్నేషనల్ డాన్. తనకి తండ్రి లాంటి వాడైన ఇంకో డాన్ (శరత్ కుమార్) ని చంపేస్తే  ఆ హంతకుల్ని పట్టుకోవడానికి హైదరాబాద్ వస్తాడు.  దేవా ఎలా వుంటాడో పోలీసులకి కూడా తెలీదు. ఒకరోజు పోలీసు కాల్పుల్లో గాయపడి ఓ క్లినిక్ లోకి దూరిపోతాడు. అక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో తన ప్రవర్తన వల్ల ఉద్యోగం పోగొట్టుకుని, అన్న (నరేష్) ప్రోద్బలంతో అన్న మెడికల్ షాపు పక్కనే, క్లినిక్ పెట్టుకున్న డాక్టర్ దాస్ (నేచురల్ స్టార్ నాని) చికిత్స చేసి,  దేవాని కాపాడతాడు. దాంతో దేవా, దాస్ ని తన మాఫియా గ్రూప్ డాక్టర్ గా నియమించుకుంటాడు. దేవాకి జాహ్నవి (ఆకాంక్ష) అనే ఓ టీవీ యాంకర్ తో పురాతన విఫల ప్రేమ వుంటుంది. దాస్ కూడా  పూజా (రశ్మి) అనే ఇంకో అమ్మాయిని ప్రేమిస్తూంటాడు. ఇక దేవా విఫల ప్రేమ తెలుసుకున్న దాస్, వాళ్ళిద్దర్నీ కలపాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో ఏం జరిగింది, ఇద్దరి ప్రేమలు ఏమయ్యాయి, దేవాని మార్చాలన్న దాస్ ప్రయత్నాలు ఫలించాయా,  అన్నదే మిగతా కథ.

ఎలావుంది కథ

          ఇది గ్యాంగ్ స్టర్ కామెడీ జానర్ కి చెందిన కథ. కాన్సెప్ట్ హాలీవుడ్ దే. 1999 లో రాబర్ట్ డీ నీరో – బిల్లీ క్రిస్టల్ లతో వచ్చిన ‘ఎనలైజ్ దిస్’  అనే హిట్ మూవీకి తెలుగులో మార్పు చేర్పులతో చేసిన ఫ్రీమేక్ ఇది.  2002 లో అమితాబ్ బచ్చన్ – సంజయ్ దత్ లతో,  కామెడీ స్పెషలిస్టు  డేవిడ్ ధవన్ దర్శకత్వంలో ‘హమ్ కిసీసే కమ్ నహీ’  అంటూ కాపీ కొట్టుకుని హిట్ చేసుకున్నారు. ఒరిజినల్ హాలీవుడ్ లోనూ,  హిందీ కాపీలోనూ డాక్టర్ – డాన్ ల కథ పూర్తిగా వేరు. తనకి మేలుచేసిన డాక్టర్ కి మంచి చేద్దామన్న డాన్ తో డాక్టర్ కి చచ్చే చావొస్తుంది. మంచి మనసుతో డాన్ మేలు చేసే ప్రతీసారీ, డాక్టర్ సమస్యల్లో పడుతూంటాడు. డాక్టర్ తో డాన్ చెలగాటాలే స్టోరీ లైన్. తెలుగుకి వచ్చేసరికి దీన్ని పూర్తిగా మార్చేసి, ఇద్దరి మధ్య స్నేహం కుదిర్చి బ్రొమాన్స్ గా నడపడంతో కథ కుదరక, పోనుపోను అనవసర విషయాలు కలుపుకుని ఏటో వెళ్ళిపోయింది.

ఎవరెలా చేశారు

          కింగ్ నాగ్ గురించి చెప్పేదేముంది, ఆయన ఎంటర్ టైన్ మెంట్ కింగ్. అత్యంత మాంచి రోమాంటిక్ అందగాడు కూడా. అయితే  నేచురల్ స్టార్ నానితో బ్రొమాన్సే కథ కావడంతో, హీరోయిన్ తో రోమాన్స్  వుండీ లేనట్టు తయారైంది. దర్శకుడు వొరిజినల్ కాన్సెప్ట్ ని మార్చేసినా, ఇద్దరు స్టార్స్ మధ్య బ్రొమాన్స్ కామెడీని  ఫస్టాఫ్ వరకూ బాగానే వర్కౌట్ చేశాడు. ఐతే ఇదే వినోదాన్ని సెకండాఫ్ లో కొనసాగించలేక చేతులెత్తేశాడు. నాగ్ విడివిడి కామెడీ సీన్లు ఎన్నైనా పండించవచ్చు- వీటికి ఒక స్టోరీ లైన్ అంటూ వుండాలిగా? అది లేకే సెకెండాఫ్ ని నాగ్ కూడా నిలబెట్ట లేక యావరేజీ అన్పించుకుని వదిలేశాడు.

          నేచురల్ స్టార్ నాని డిటో. ఫస్టాఫ్ వరకే తను ఎంత నవ్వించినా. ఇంటర్వెల్ లో దేవా ప్రేమని సక్సెస్ చేయాలన్న సంకల్పం ప్రకటించడం ఇంత బిగ్ బడ్జెట్ మూవీకి చాలినంత  బలంగా లేకపోవడంతో, తనూ నాగ్ తో బాటు సెకండాఫ్ తో మూవీని యావరేజీగా మోసి మోసి ఇక వల్ల కాదని వదిలేశాడు.

          హీరోయిన్లు రశ్మిక, ఆకాంక్షలవి వుండీ లేనట్టుండే గాలివాటు గ్లామర్ పాత్రలు పోషించారు. అందులోనూ రశ్మిక పాత్రకి  రొటీన్ మూస ట్విస్టు ఒకటి ఇచ్చారు. ఇదేమీ వర్కౌట్ కాలేదు. తను మొదట్లో స్లిమ్ గా ఎంట్రీ ఇచ్చి, తర్వాత తర్వాత వొళ్ళు చేసి ఎలాగో వుంది. పోలీస్ అధికారిగా మురళీశర్మకి కూడా అంతగా పనిలేదు. వెన్నెల కిషోర్ అప్పుడప్పుడు గెస్ట్ అప్పీరియెన్స్ ఇచ్చి పోతూంటాడు. టైలర్ గా కమెడియన్ సత్యకి ఎక్కువ నిడివిగల పాత్ర దొరికింది. చీఫ్ డాక్టర్ గా రావు రమేష్ ది కూడా అతిధి పాత్రే. నేచురల్ స్టార్ నాని అన్నా వదినెల పాత్రలు నరేష్, సత్యకృష్ణలవి.

          చూస్తే ఎప్పుడూ తెరనిండా అభిమాన తారాతోరణమే జిగేలు మన్పిస్తూంటారు. వాళ్ళకి తగ్గ పాత్రలు గానీ, పాత్రలకి తగ్గ కొంచెమైనా స్టోరీ లైన్ గానీ లేకపోవడంతో పేలవంగా మారిపోతారు. అశ్వనీదత్ చాలా డబ్బు ధారబోసి దర్శకుడికి ప్రయత్నానికి రిచ్ ప్రొడక్షన్ విలువలు అందించచి సహకరించారు.  మణిశర్మ తో మంచి పాటలు చేయించుకున్నారు. నాగ్ – నానిలు క్రియేటివ్ గా షేర్ చేసుకునే కొత్తదనమున్న గణేష్ ఉత్సవాల పాట, తర్వాత వచ్చే హీరోయిన్లతో వచ్చే రోమాంటిక్ పాటా రెండూ అద్భుతమే. కెమెరా వర్క్ గానీ, ఎడిటింగ్ గానీ, ఇతర సాంకేతికాలు గానీ  ఉన్నతమైనవే. సాహిత్యపరంగా గీతాలు గానీ, సంభాషణలు గానీ మంచివే. కానీ ఇవన్నీ దర్శకుడి స్థాయికి ఎక్కువైపోయినట్టు అన్పిస్తాయి. సినిమా రాయడంలో గానీ, తీయడంలో గానీ సామర్ధ్య లోపమే కన్పిస్తుంది.

చివరికేమిటి

          పైన చెప్పిన హిందీ కాపీని కాపీ చేసినా బావుండేది. ఇద్దరు స్టార్ల కాంబినేషన్ లో కంటెంట్ ఎలా వుండాలో అంతుపట్టక ఇలా తయారయ్యేది కాదు. కథే లేకుండా స్టార్స్ తో ఎంత సేపని కామెడీలు చేయిస్తారు. ఫస్టాఫ్ బిగినింగే వేరే మాఫియాలతో భారంగా, నెమ్మదిగా సాగదీస్తూ సాగదీస్తూ పోయారు. అసలు స్టార్స్ లేని ఈ పావుగంట ప్రారంభ సీన్స్ ని ఎవరో మాఫియాల గొడవలతో ఎవరు చూస్తారు. తర్వాత డాక్టర్ గా నాని ఎంట్రీ బావున్నా, ఆ తర్వాత ఒకేసారి గణేష్ పాటతో డాన్ గా నాగ్ ఎంట్రీ తేలిపోయింది. ఇద్దరూ కలుసుకున్నాక కామెడీలు బాగానే వర్కౌట్ అయినా, అవి ఇంటర్వెల్ వరకే సరిపోయాయి. ఇంటర్వెల్ కైనా కథలోకి రావడానికి విషయం లేదు. ఆతర్వాత కూడా విషయం లేక తోచిన పిట్ట కథలు అల్లుకుంటూ పోయారు.  వాటిలో అవయువదానం పిట్టకథ వచ్చేసరికి మూవీ అంతా భారంగా మారిపోయింది.  కామెడీలో విషాదాలు అవసరమా?

          సమస్య ఒక్కటే – నాగ్, నాని పాత్రలు రెండిటికీ లక్ష్యాలు లేవు. పాత్రలకి లక్ష్యాలు లేకపోతే కథెలా తయారవుతుంది? కథ లేకపోతే ఇద్దరి పాత్రలు వుండీ ఏం చేస్తాయి? దర్శకుడు ఆదిత్యా శ్రీరాం స్టార్స్ వుంటే చాలు, ఏదో కథ ఆల్లేసి ఏరు దాటెయ్యొచ్చని అనుకుని వుంటే, అది ఖరీదైన పొరపాటు. నిజంగానే అంతా భ్రాంతియే అవుతుంది…దీనికి దర్శకుడుసహా, ఇద్దరు స్టార్స్, నిర్మాతా బాధ్యులవుతారు. ఇంకా కొత్తవాడు  దర్శకుడికి తెలియకపోతే, ఇన్ని సినిమాలు నటించిన, నిర్మించిన వాళ్ళకి తెలియదా సినిమా కథ కనీస లక్షణ మేమిటో?