Ambaji Peta Movie Review : ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ మూవీ రివ్యూ

(చిత్రం : అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు, విడుదల : 2, జనవరి-2024, రేటింగ్: 2.75 /5 , కథ, దర్శకత్వం: దుశ్యంత్ కటికనేని, నిర్మాత: ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి, సమర్పణ: బన్నీ వాసు, వెంకటేష్ మహా, నిర్మాణం : : జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, మహయానా మోషన్ పిక్చర్స్ , నటీనటులు: సుహస్, శరణ్య ప్రదీఫ్, శివానీ నాగారం, నితిన్ ప్రసన్న, జగదీష్ తదితరులు).

సుహస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు నేడు (2, జనవరి-2024) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? సహజ నటుడు సుహస్ కు ఎలాంటి పేరు తెచ్చింది.. తెలుసుకుందాం..

కథ: మల్లికార్జున్ అలియాస్ మల్లి (సుహస్) అంబాజీపేటలో మ్యారేజ్ బ్యాండ్‌లో పనిచేస్తుంటాడు. నాయి బ్రాహ్మణ కులానికి చెందిన మల్లికి కవల సోదరి లక్ష్మీ (శరణ్య ప్రదీప్), తల్లిదండ్రులతో కలిసి హాయిగా బతుకువెళ్లదీస్తూ ఉంటాడు. ఊరి పెద్ద వెంకట బాబు (నితిన్ ప్రసన్న) సోదరి లక్ష్మీ (శివానీ నాగారం)ను చిన్నతనం నుంచే ప్రేమిస్తుంటాడు. టీచర్‌గా పనిచేసే లక్ష్మీపై ఊరిపెద్ద వెంకట బాబు దౌర్జన్యం చేస్తాడు. డబ్బు, అగ్ర కులం చాటున వెంకట్ బాబు ఎలాంటి అరాచకాలు చేస్తుంటాడు. తన అక్క లక్ష్మీకి జరిగిన అవమానానికి మల్లీ ఎలాంటి ప్రతీకారం తీర్చుకొన్నాడు? లక్ష్మీపై ప్రేమను పెంచుకొన్న సంజీవీ (జగదీష్)కు ఎలాంటి పరిస్థితి ఎదురైంది? తన సోదరిపై దౌర్జన్యం చేసిన వెంకటబాబుకు ఎలాంటి శిక్షను మల్లి విధించాడు, మల్లీ తన కులవృత్తిని చేస్తూ గ్రామంలో ఎలాంటి అవమానాలకు గురి అవుతుంటాడు.. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండును మల్లీ ఎలా నడిపిస్తుంటాడు? అనే ప్రశ్నలకు సమాధానమే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు అసలైన సినిమా కథ.

విశ్లేషణ: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు రెగ్యులర్, రొటీన్ కథ. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా తొలి భాగంలో వినోదాత్మకంగా మొదలై ఫన్, కొన్ని ఎమోషన్స్‌తో సరదాగా సాగిపోతుంది. సిస్టర్ సెంటిమెంట్, క్యూట్ లవ్ స్టోరి, రూరల్ విలేజ్ డ్రామా, కుల వివక్ష, ధన వివక్ష లాంటి అంశాలతో తొలి చిత్ర దర్శకుడు రూపొందించిన చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు. కథలో కొత్తదనం లేకపోయినా.. స్క్రీన్ ప్లే, రాసుకొన్న సీన్లు, పాత్రలతో చెప్పించిన డైలాగ్స్ సినిమాను నిలబెట్టాయి. గ్రిప్ప్పింగ్‌గా, ఎమోషనల్‌గా రాసుకొన్న కథ, దర్శకుడు దుష్యంత్, హీరో సుహస్, శరణ్య, శివానీ తమ పెర్ఫార్మెన్స్‌తో సూపర్ సినిమా అనే ఫీలింగ్ కలిగేలా చేసింది. కుల వివక్ష, గ్రామ పెద్ద కూతురును తక్కువ కులం వ్యక్తి ప్రేమించడం లాంటి అంశాలతో ఇది వరకు చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఫస్ట్ టైమ్ డైరెక్టర్ దుష్కంత్ కటికనేని రాసుకొన్న స్క్రీన్ ప్లే, క్యారెక్టర్లను డిజైన్ చేసుకొన్న విధానం, కథను నడిపించిన తీరు అతడి ప్రతిభకు అద్దం పట్టింది. ఈ సినిమాలో గొప్పగా చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ అనిపించదు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా కథ అంతా సాదాసీదాగా సాగుతుంది. కంటెంట్ ప్రధానంగా నడిపించడానికి రాసుకొన్న డైలాగ్స కూడా భారీగానే పేలడమే కాకుండా భావోద్వేగానికి గురిచేస్తాయి. ఇంటర్వెల్‌కు ముందు 20 నిమిషాల ముందు చోటుచేసుకొన్న ఓ సంఘటన కథను చాలా సీరియస్‌గా ఎమోషనల్‌గా మారి అదిరిపోయే ఇంటర్వెల్‌ బ్యాంగ్‌కు సహాయపడింది. ఇక సెకండాఫ్‌లో కొన్ని రొటీన్ సీన్లతో ప్రీ క్లైమాక్స్ వరకు లాక్కొచ్చారనే అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే …. సుహస్ తన గత చిత్రాలతో విలక్షణమైన నటుడు అనే అభిప్రాయాన్ని కలిగించాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాలో కూడా ఎమోషనల్‌తోపాటు ఎంటర్‌టైనింగ్ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అయితే ఈ సినిమాకు ప్రాణం లక్ష్మీ పాత్రలో కనిపించిన శరణ్య ప్రదీప్. ఇప్పటి వరకు చిన్న చిన్న పాత్రలతో గుర్తింపు పొందిన ఆమె.. లక్ష్మీ పాత్రలో పవర్‌ఫుల్‌గా కనిపించారు. రకరకాల ఎమోషన్స్‌తో ఈ సినిమాను తన భుజాల మీద మోశారనే చెప్పాలి. హీరోయిన్‌గా పరిచయం అయిన శివానీ ఫెర్ఫార్మెన్స్‌తో మనసులను దోచేసింది. . గ్లామర్‌గానే కాకుండా నటనతో కూడా ఆకట్టుకుంది.

టెక్నీకల్ అంశాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అని ముందుగా చెప్పుకోవాలంటే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, డైలాగ్స్ గురించి చెప్పుకోవాలి. వాజిద్ బేగ్ తన కెమెరాతో కోనసీమ అందాలను మరోసారి రుచి చూపించాడు. పవన్ కల్యాణ్ ఎడిటింగ్ ఓకే అనిపించింది. శేఖర్ చంద్ర తన బీజీఎంతో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. ధీరజ్ మొగిలినేని అనుసరించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉండి ప్రేక్షకులను అలరించాయి. చివరగా చెప్పొచ్చేదేమిటంటే.. సినిమాలో ఊహించని మలుపులు.. ఆసక్తికరమైన సన్నివేశాలు ప్రేక్షకుడిని ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేశాయి. వాచ్ ఇట్ మూవీ…