‘అఖండ’ రివ్యూ! – బాలయ్య మాస్ పవర్!

రేటింగ్: 2.75/5

రచన – దర్శకత్వం : బోయపాటి శ్రీను

తారాగణం : నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్, సుబ్బరాజు షామ్నా కాసిం తదితరులు

మాటలు : ఎం. రత్నం, సంగీతం : ఎస్ తమన్,

ఛాయాగ్రహణం : సి రామ్ ప్రసాద్

బ్యానర్ : ద్వారకా క్రియేషన్స్

నిర్మాత : మిర్యాల రవీంద్ర రెడ్డి

విడుదల : డిసెంబర్ 2, 2021

నట సింహా నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను ఇద్దరిదీ బ్లాక్ బస్టర్స్ కాంబినేషన్. 2010 లో ‘సింహా’, 2014 లో ‘లెజెండ్’ అనే రెండు బ్లాక్ బస్టర్ అందించిన తర్వాత 2021 ముగింపులో ‘అఖండ’ తో హ్యాట్రిక్ చేద్దామని విచ్చేశారు. 2019 లో కె ఎస్ రవికుమార్ దర్శకత్వం లో ‘రూలర్’ బాలకృష్ణకి చేదు అనుభవాన్నిచ్చింది. బోయపాటికి 2016 లో అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ అనే హిట్ తర్వాత, 2017 లో బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘జయ జానకి నాయక’, 2019 లో రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ రెండూ ఫ్లాపయ్యాయి. ఇప్పుడు బాలకృష్ణ, బోయపాటి ఇద్దరూ తమ ఫ్లాపుల నేపథ్యాల నుంచి చేతులు కలిపి, ‘అఖండ’ తో అఖండ విజయాన్ని సాధించేందుకు విచ్చేశారు. ఇందులో బాలకృష్ణ అఘోరా గెటప్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఈ గెటప్ తో అఖండగా టైటిల్ రోల్లో నటసింహాని చూసేందుకు బాక్సాఫీసుల్ని కిటకిటలాడించారు ఫ్యాన్స్, ప్రేక్షకులు. మరి ఈ ప్రతిష్టాత్మక సినిమా అంతా బావుందా? చూద్దాం…

కథ

అనంతపురంలో మురళీ కృష్ణ (బాలకృష్ణ) ప్రకృతిని, సమాజాన్నీ కాపాడాలన్న తపనతో ఫ్యాక్షన్ని రూపుమాపి, పాఠశాలలూ ఆస్పత్రులూ నెలకొల్పి ప్రజాసేవ చేసే రైతుగా వుంటాడు. ఒక పీఠాధిపతిని చంపి ఆ స్థానంలోకి శక్తి స్వరూపానంద అనే దుష్ట స్వామి వస్తాడు. ఇతడితో మైనింగ్ మాఫియా వరదరాజులు (శ్రీకాంత్) సంబంధాలుంటాయి. ఇలావుండగా కొత్త కలెక్టర్ గా శరణ్యా బాచుపల్లి (ప్రగ్యా జైస్వాల్) వస్తుంది. మురళీ కృష్ణ చేస్తున్నసామాజిక కార్యక్రమాలు చూసి ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. అటు వరదరాజులు అక్రమ కాపర్ మైన్స్ లో యురేనియం గనులు బయటపడ్డంతో, దాంతో అతడి కుట్ర వల్ల అనేక మంది పిల్లలు రోగాల పాలై మురళీ కృష్ణ ఆస్పత్రిలో చేరతారు. మురళీ కృష్ణ కూతురు కూడా ప్రమాదంలో పడుతుంది. వరదరాజులు కుట్రతో ఆస్పత్రి పేలిపోయి, మురళీ కృష్ణ అరెస్టవుతాడు. శరణ్య సస్పెండ్ అవుతుంది. ప్రాణాపాయంలో వున్న కూతుర్ని శరణ్యా బెంగుళూరు తీసుకుపోతూంటే వరదరాజులు దాడి చేయిస్తాడు. ఇలా మురళీకృష్ణ కుటుంబమూ, ప్రజలూ అల్లకల్లోలమైపోతూంటే ఆపద్భాంధవుడుగా దిగుతాడు అఖండ. పుట్టగానే చనిపోయిన ఇతను శివుడి అంశ పోసుకుని బతికాడు. ఉత్తర దేశంలో అఘోరాగా మారాడు. .

ఇప్పుడు ఎవరీ అఖండ? ఇతడికీ, మురళీ కృష్ణకీ సంబంధమేమిటి? శివోపాసకుడైన అఖండ శక్తి ముందు దుష్టస్వామి, వరదరాజులు ఏమయ్యారు? యురేనియంతో కకావికలమైన ప్రకృతినీ ప్రజల్నీ కాపాడి సమస్థితిని నెలకొల్పాడా? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ప్రకృతిని పాడు చేయవద్దన్న నీతితో కథ ప్రారంభించారు. ప్రకృతి మీదా పసివాళ్ళ మీదా చెయ్యేస్తే శివుడూరుకో డన్నారు. ఇందుకు లయకారుడైన శివుడి అంశని అఖండ అనే అఘోరా పాత్రలో ప్రతిష్టించి పోరాటానికి దింపారు. సింపుల్ గా చెప్పాలంటే పర్యావరణ పరిరక్షణ హై కాన్సెప్ట్ కథ. ప్రకృతి వినాశక శక్తులు వర్సెస్ అఖండ అనే శైవ సాధువు స్పిరిచ్యువల్ యాక్షన్ జానర్ కథగా ఐడియా బావుంది. ఈ ఐడియాని బోయపాటి తన రెగ్యులర్ ఫ్యాక్షన్ తరహా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ గా మార్చేసి ప్రకృతి- దైవం- మనం అన్న సున్నిత బంధాన్ని ఫీల్ కాకుండా చేశారు. భారీ యాక్షన్ హంగామా కింద నలిగి కథ కనిపించకుండా పోయేట్టు చేశారు. పర్యావరణ పరిరక్షణ కథని కాలుష్య భరిత జాతరగా మార్చేశారు.

కథ పోగా మిగిలింది బాలకృష్ణ అఖండ క్యారక్టర్. ఉత్తర దేశంలో వుండే అఘోరాలని అఖండ పాత్రకి రిఫరెన్సుగా తీసుకున్నారు. నగ్నంగా శ్మశానాల్లో క్షుద్ర తపస్సులు చేసే, అనాగరిక ఆచారాలతో వుండే, భీతి గొలిపే అఘోరా మోడల్ కి, అఖండ అనే పేరిచ్చి, పుణ్యస్నానాలు- జప తపాలు చేసే నీటైన డిజైనర్ అఘోరాగా మార్చి బాలకృష్ణతో చూపించారు. దీన్ని అభ్యంతర పెట్టాల్సిన పని లేకపోయినా, ఈ క్యారక్టర్ తో అనుకున్న కథే చూపించకుండా మాయం చేయడం అభ్యంతర కరమైనది. స్టార్ సినిమాల్లో వినూత్నంగా ఎత్తుకున్న పాయింటే మర్చిపోయి సినిమా తీసేయడం మామూలే. ‘బద్రినాథ్’ లో కూడా దేవాలయాల మీద టెర్రరిస్టుల దాడినుంచి పరిరక్షణ పాయింటుతో కథ ఎత్తుకుని, పారిపోయిన లవర్స్ వర్సెస్ ఫ్యాక్షన్ యాక్షన్ కథ చూపించారు.

నటనలు –సాంకేతికాలు

నట సింహమే, సందేహం లేదు. బాలకృష్ణ తప్ప ఇంత రౌద్ర ప్రతాప పాత్ర ఎవరూ చేయలేరు. సినిమాని కూర్చుని చూడగలమంటే బాలకృష్ణ గురించే చూడాలి. రెండు పాత్రల్లో స్టార్ పవర్ తో సాంతం కమ్మేశారు. అయితే సమస్యేమిటంటే, సరైన విలన్ లేడు. ఈ పాత్రతో బాలకృష్ణ ముందు అమ్రిష్ పురిని వూహించుకుంటే బ్యాలెన్సింగా వుంటుంది. ఇద్దరి రౌద్రం, అరుపులు మ్యాచ్ అవుతాయి. ఇంకో సమస్యేమిటంటే, పోరాట దృశ్యాలు నిడివి పెరిగి పోయి, దాంతో సినిమా నిడీవీ కూడా భారీగా పెరిగిపోయీ భారంగా మారడం. ఫ్యాన్స్ వరకూ ఓకే. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్షవుతారు.

రెండు పాత్రల్లోనూ బాలకృష్ణ చెప్పిన డైలాగులు బలంగా వున్నాయి. ఆస్తి కాదు, ఆలోచనలున్న వాడు గొప్ప వాడు లాంటి డైలాగులు. ప్రగ్యా జైస్వాల్ తో వెకిలి రోమాన్స్ లేకుండా, అసలు రోమాన్సే లేకుండా- ఆమె పెళ్ళిని ప్రపోజ్ చేయగానే చేసుకోవడంతో నీటుగా కనిపిస్తుంది. రోమాన్స్ ప్రగ్యా జైస్వాల్ ఒక్కతే ఫీలై, కొన్ని చిలిపి చేష్టలు చేసుకుంటుంది.

అఖండ పాత్రకి సెంటిమెంటల్ కోణాన్ని కల్పించే విషయంలో అశ్రద్ధ చేశారు. బోయపాటి ట్రేడ్ మార్కు యాక్షన్ హంగామాలో చితికి పోయిన సెన్సిటివిటీస్ లో ఇదొకటి. తల్లితో మదర్ సెంటి మెంటు సీను తల్లి ఒక్కతే ఫీలై సీను పొడిపొడిగా వెళ్ళి పోతుంది. బాలకృష్ణ మురళీ కృష్ణ పాత్ర కూతురితో కూడా అఖండగా తన సీన్లు పొడిపొడిగానే వుంటాయి. ప్రకృతి జోలికీ, పసి వాళ్ళ జోలికీ రావద్దన్న మాట ప్రకారమే ఈ పసిపిల్లతో సెంటిమెంటల్ సీన్లు – సెంటిమెంటల్ ట్రావెల్ కథలో వుండాల్సింది – ‘భజరంగీ భాయిజాన్’ లోలాగా. స్టార్ సినిమా హార్డ్ కోర్ యాక్షన్ గా మాత్రమే వుండొచ్చా? అయితే కుటుంబ ప్రేక్షకుల్ని ఎలా ఆశిస్తారు? బాల కృష్ణ మీద చిత్రీకరించిన పాటలు – ఒకటి ప్రగ్యాతో గ్రూప్ డాన్సు పాట- అతి లేకుండా నీటుగా వున్నాయి.

ప్రగ్యా జైస్వాల్ స్లీవ్ లెస్ జాకెట్లు వేసుకునే కలెక్టర్ పాత్రలో వుంటుంది. కల్లు సీను కోసం ఆమెని తెలంగాణా వ్యక్తిగా మార్చేశారు. తర్వాత మామూలుగానే మాట్లాడుతుంది. సస్పెండ్ అయ్యాక తల్లి పాత్రలో వుంది పోతుంది. ప్రగ్యా జైస్వాల్ చీరలు తప్ప మరో కాస్ట్యూమ్ లేకుండా హోమ్లీ లుక్ తో ఆడియెన్స్ కి కన్నులపండువ.

ఇక జగపతి బాబు, శ్రీకాంత్. జగపతి బాబు మంచి సాధువు, శ్రీకాత చెడ్డ మాఫియా. ఇద్దరూ పాత్రలు మార్చుకుని వుంటే బావుండేది. శ్రీకాంత్ కరుడు గట్టిన విలన్ గా పవర్ఫుల్లే. బాలకృష్ణకి సరిపోయేంత కాదు.

సి. రాంప్రసాద్ మరోసారి విజువల్ క్వాలిటీ చూపించాడు కెమెరా వర్క్ తో. డార్క్ సీన్లు కూడా వ్యూహాత్మక లైటింగుతో డిటెయిల్డ్ గా విజువలైజ్ చేశాడు, బాలకృష్ణ ఆభరణ, ఆయుధ సంపత్తిని హైలైట్ చేయడంతో బాటు. ఈ మూవీలో కళా దర్శకత్వానికి చాలా పనుంది. ఏఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం విజువల్స్ కి రిచ్ నెస్ ని తీసుకొచ్చింది. అలాగే స్టంట్ విభాగానికీ చాలా పనుంది. రామ్ లక్ష్మణ్ లు, స్టన్ శివ సమకూర్చిన యాక్షన్ కొరియోగ్రఫీ టాప్ క్లాస్. అయితే తెలుగు టీవీ సీరియల్లాగా ఎంతకీ ముగియకపోవడమే పదే పదే వచ్చే యాక్షన్ దృశ్యాల ప్రత్యేకత. దీని విషయంలో ఎడిటర్లు కోటగిరి వెంకటేశ్వర రావు, తమ్మిరాజులు కూడా చేతులెత్తేశారు.

బోయపాటి దర్శకత్వ బలానికే లోటూ లేదు. కథా బలం లేదు. రత్నం డైలాగుల బలం చెప్పుకోదగ్గది. ఉన్న కథకి బలమైన, క్వాలిటీ డైలాగులు రాశాడు. బాలకృష్ణ నోటి వెంట ఈ డైలాగులు వినసొంపుగా వుంటాయి. బాలకృష్ణ – బోయపాటిల హిట్ కాంబినేషన్ ‘అఖండ’ పాత్రకి గుర్తుంటుంది. ఫస్టాఫ్ ఫర్వాలేదన్నట్టు నడిపించి, ఇంటర్వెల్ ముందు అఖండకి భారీ యాక్షన్ తో ఎంట్రీ ఇప్పించాక- సెకండాఫ్ లో కథని కూడా పట్టించుకోవాల్సింది. లాక్ డౌన్ ఎత్తేశాక విడుదలవుతూన్న సినిమాల్లో వరుసగా సెకండాఫ్ కే ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ని బాలకృష్ణ మాస్ పవర్ ఎంత వరకు అధిగమిస్తుందో చూడాలి.

—సికిందర్