సింగం కాదు సామీ! : సామి (మూవీ రివ్యూ)

(సికిందర్)


చిత్రం :  ‘సామి’
రచన – దర్శకత్వం : హరి 
తారాగణం : విక్రమ్
కీర్తి సురేష్ఐశ్వర్యా రాజేష్బాబీ సింహాసూరి తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం : వెంకటేష్ అంగురాజ్ 
విడుదల : సెప్టెంబర్ 
21, 2018

 

మా రేటింగ్  2.25 / 5


          త సంవత్సరం ‘ఇంకొక్కడు’ (ఇరుమగన్) తో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన చియాన్ విక్రమ్, పోలీస్ యాక్షన్ తో ఈవారం అలరించడానికి ‘సామి’ గా డబ్బింగై వచ్చాడు.  తెలుగులో విక్రమ్ కి ఇంకా మార్కెట్ వుంది. కావాల్సిందల్లా ఆ మార్కెట్ ని నిలబెట్టుకునే వ్యూహమే…వ్యూహమే అవసరం లేదన్నట్టు ఎలాపడితే అలా, ఏది పడితే అది నటించేసి తన ఇమేజియే కాపాడుతుందనుకుంటే అంతకన్నా పొరపాటు వుండదు. విక్రమ్ ఈసారి తను రిటైర్ మెంటుకి దగ్గర్లో వున్నట్టు, ఇంతకంటే వల్లకానట్టు, చేతులెత్తేసినట్టున్న ఈ పోలీస్ రొటీన్ ని ప్రేక్షకులు భరించే ఓపిక వుందా?  

కథ 


          రావణ భిక్షు (బాబీ సింహా) అనేవాడు రౌడీయిజంతో విజయవాడలో చెలరేగుతూంటాడు. ఇతడికి దేవేంద్ర భిక్షు, మహేంద్ర భిక్షు అనే ఇద్దరు సోదరులుంటారు. ఈ దుష్టత్రయం చాలా పవర్ఫుల్ కావడంతో ఎవరూ అడ్డుకోలేకపోతారు. ఇలాటి సమయంలో ఐపీఎస్ పూర్తి చేసుకున్న రామస్వామి (విక్రమ్) విజయవాడలో బాధ్యతలు చేపట్టి దుష్టులు ముగ్గురి భరతం పడుతూంటాడు. మరోవైపు ఓ అమ్మాయి (కీర్తీ సురేష్) ని ప్రేమిస్తూంటాడు. ఇలా వుండగా,  చిన్నప్పుడు తన తల్లిదండ్రుల్ని చంపింది ఈ దుష్ట త్రయమేనని తెలుస్తుంది. దీంతో ఒక్కొక్కర్నీ చంపి పగదీర్చుకోవడం మొదలెడతాడు. ఇదీ కథ.

ఎలావుంది కథ

          ప్రఖ్యాత దర్శకుడు స్వర్గీయ కె. బాలచందర్ శిష్యుడైన హరి 2003 లో ఇదే విక్రమ్ తో  త్రిష హీరోయిన్ గా ‘సామి’ అనే పోలీస్ యాక్షన్ తీశాడు. అది మంచి విజయం సాధించింది. 2004 లో ఇది నందమూరి బాలకృష్ణతో ‘లక్ష్మీ నరసింహా’ గా రీమేకయింది. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్ గా  ‘సామి – 2’ తీశాడు హరి. ఈ పోలీసు స్టోరీని ఇప్పటి కాలానికి తగ్గ అంశాలతో కూడిన పోలీస్ యాక్షన్ గా కాకండా, అరిగిపోయిన పగా ప్రతీకారాల పసలేని కథగా తీశాడు. చిన్నప్పుడు తల్లిదండ్రుల్ని చంపిన శత్రువుల మీద పగదీర్చుకునే కథలు ఎప్పుడో 1970 -1980 ల నాటివి. ఈ కథలు ఎందుకు ఆసక్తి కల్గిస్తాయి? మాస్ ప్రేక్షకులైనా  ఇప్పుడు చూస్తారా? పోలీసు శాఖ కొత్త కొత్త నేరాలతో సతమతమవుతూంటే, ఈ పోలీసు సినిమా ఎక్కడో దర్శకుడు చిన్నపుడు చూసిన సినిమాల దగ్గరే ఆగిపోయింది. ఈ కథ దర్శకుడి చిన్ననాటి జ్ఞాపకాలు అన్నట్టుగా వుంది. 


ఎవరెలా చేశారు 


          పవర్ఫుల్ పోలీసు అధికారి అంటే సిక్స్ ప్యాక్ కండలు పొంగించి గట్టిగా గాండ్రించే వాడన్నట్టుగా విక్రమ్ పాత్ర పోషణ చేశాడు. చాలా పాత స్టయిల్ నటన. ఆ కళ్ళు తిప్పడం, మెడ నరాలు పొంగించడం తమిళ ఓవరాక్షన్ కీ ఎక్కువే. దీన్ని ఇప్పుడు మాస్ ప్రేక్షకులయినా భరిస్తారో లేదో అనుమానమే. విక్రమ్ మాత్రం ఇదేమీ పట్టకుండా క్లాస్ నటనని తీసి పక్కన పెట్టేసి, దర్శకుడి పాత మోడల్ స్కూల్లో వీలయినన్ని విచిత్ర విన్యాసాలు చేశాడు. ఇందుకు కావాల్సినంత యాక్షన్ హంగామా అంతా తోడ్పడింది. 2003 లో తనే నటించిన ‘సామి’ లో ఇంత మోటు తనం లేదు. ఈ పాత్ర నటించడానికి తన స్థాయి నటుడే అవసరం లేదు. వూరికే అరుపులతో అలసి పోవడం తప్ప వచ్చే పేరేమీ లేదు, వున్న పేరు పోవడం తప్ప.


          హీరోయిన్ కీర్తి సురేష్ కి ఈ పాత మసాలా సినిమా ఎలా దొరికిందో అర్ధంగాదు. ప్రేమించడానికి తప్ప పనిలేని పాత్రలో తనకి ప్రతిష్టాత్మకంగా ఏం కన్పించిందో తెలీదు. ప్రేమించని తనని విక్రమ్ లాగి లెంపకాయ కొడితే ప్రేమలో పడిపోతుంది. అలా లెంపకాయ కొట్టడం ప్రేమకు సంకేతమని విక్రమ్ చెప్తాడు. ఎంత బలంగా కొడితే అంత బలమైన ప్రేమట. కీర్తి సురేష్ ఇలాటి తెలివిలేని గ్లామర్ బొమ్మ పాత్రతో సరిపెట్టుకుంది. 


          ఇక కమెడియన్ సూరి చేసే కామెడీ నవ్వు రాకపోగా టార్చర్ పెడుతుంది. అతడి మీద ఈ కామెడీ సీన్లు సుదీర్ఘంగా వుంటాయి. 2003 ‘సామి’ లో కామెడీ బాగా కలిసి వచ్చిందని మళ్ళీ ప్రయోగించి నట్టుంది. ఈసారి బెడిసి కొట్టింది. విలన్ల గురించి చెప్పుకోవడాని కేమీ లేదు. ఈ నాటు విలనీ కూడా భరించడం కష్టం. 


          ఓ రెండు దేవీశ్రీ ప్రసాద్ సంగీతంలో పాటలు మాత్రం హుషారెక్కిస్తాయి. కెమెరా వర్క్ లో క్రియేటివిటీ కన్పించదు. ప్రొడక్షన్ ఖర్చు మాత్రం అతి భారీగా పెట్టారు.


          2003 ‘సామి’ ముగింపుకి కొనసాగింపుగా ఈ సీక్వెల్ తీశారు. అప్పటి ‘సామి’ ముగింపు సీన్లు రీక్యాప్ గా వేశారు. పదిహేనేళ్ళ క్రితం ఆ సినిమా చూసిన వాళ్ళు ఇప్పుడు ఎందరుంటారు. చూడని వాళ్లకి ఆ రీక్యాప్ ఏమర్ధమవుతుంది. ఓ ఐదేళ్ళ క్రితం సినిమాకి సీక్వెల్ అంటే అర్ధం పర్ధం వుంటుంది. దశాబ్దంన్నర కిందటి సినిమాని పట్టుకుని సీక్వెల్ తీయడమేమిటి?


          దర్శకుడు హరీ ‘సింగం’ సిరీస్ లో మూడు హిట్ పోలీసు సినిమాలు తీశాడు బాగానే వుంది. ఇవి హిందీలో కూడా రీమేక్ అయ్యాయి. కనీసం ఆ ‘సింగం’ సినిమాల్లాగైనా లేదు ఈ ‘సామి’. సూర్యతో ఇంకో ‘సింగం’ తీసినా ఆల్రెడీ వైరల్ అయిన ‘సింగం’ ఫ్రాంచైజ్ ఇంకో సారి హిట్టయ్యేదేమో!