జైలు నుంచి వైఎస్ షర్మిల విడుదల.! కొట్టనే లేదట.!

వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది పోలీసు అధికారుల్ని వైఎస్ షర్మిల కొట్టడం. విజయమ్మ సైతం పోలీసులపై చేతి వాటం చూపించడం స్పష్టం కనిపించింది. ‘ఏదో అలా చిన్నగా వేటు వేస్తే, బాంబులు వేసినట్లు చెబుతారేంటి.?’ అంటూ తల్లి విజయమ్మ, పోలీసుని కొట్టడంపై వైఎస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు.

వైఎస్ షర్మిలకు బెయిల్ వచ్చింది. బెయిల్ మీద విడుదలైన అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. తన చుట్టూ పోలీసులు గుమికూడటం, తన మీద దాడి చేయడం, తన వెంటే నడుస్తుండడంతో వారు మళ్ళీ దాడి చేస్తారేమోన్న కోణంలో ఆత్మ రక్షణ కోసమే వారిని తోసేశారని వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు.

‘నేను కొట్టలేదు.. తోసేశాను.. దాన్ని మీడియా బూతద్దంలో చూపిస్తోంది..’ అంటూ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేసేయడం గమనార్హం. నిజానికి, ‘ఆ గలాటాలో సంయమనం కోల్పోయాను.. పోలీసులు క్షమించాలి..’ అని షర్మిల అనేసి వుంటే, అది ఆమెకే హుందాతనం.!

అయినా, రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. తెలంగాణ ఉద్యమంలో గులాబీ నేతలు, ఎంతమంది పోలీసు అధికారులపై బూతులకు తెగబడలేదు, దాడులకు దిగలేదు.? రాజకీయాలంటేనే అంత.

పోలీసులు కూడా అధికారంలో వున్న వారికి వత్తాసు పలుకుతూ, బాధ్యతల్ని విస్మరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఈ క్రమంలోనే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.