వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడి విఫలం, అరెస్ట్.!

నర్సంపేటలో ప్రజా ప్రస్తానం పాదయాత్ర జరుగుతుండగా, వైఎస్ షర్మిలపై దాడికి యత్రించారు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైఎస్ షర్మిల కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. ఆమెకి చెందిన వాహనాలు కొన్ని ధ్వంసమయ్యాయి. అలా ధ్వంసమైన తన కారులోనే వైఎస్ షర్మిల ఈరోజు పోలీసుల కళ్ళు గప్పి, ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరారు. అయితే, సోమాజీగూడ ప్రాంతంలో వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. కారులోంచి దిగాల్సిందిగా పోలీసులు చెప్పినా ఆమె వినలేదు.

అయితే, పోలీసులు ఆమెతోపాటు ఆమె ప్రయాణిస్తున్న కారుని కూడా టోవింగ్ వాహనంలో అక్కడి నుంచి తరలించడంతో కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కారులోంచే ఆ మొత్తం తతంగాన్ని వీడియో షూట్ చేసి మీడియాకి పంపించారు వైఎస్ షర్మిల. ప్రగతి భవన్ ముట్టడికి షర్మిల వెళ్ళబోతున్నారన్న సమాచారంతో ముందస్తుగానే షర్మిల నివాసం అయిన లోటస్ పాండ్ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినా, పోలీసుల కళ్ళు గప్పి వైఎస్ షర్మిల స్వయంగా తన కారుని డ్రైవ్ చేసుకుంటూ ప్రగతి భవన్ వైపు వెళ్ళారు.

తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందనీ, విపక్షాలు స్వేచ్ఛగా జనంలో తిరిగే పరిస్థితి లేకుండా కేసీయార్ ప్రభుత్వం చేస్తోందనీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి అధికార పార్టీ తట్టుకోలేకపోతోందనీ వైఎస్ షర్మిల విమర్శించారు. కాగా, షర్మిల ప్రగతి భవన్ వైపుకు వచ్చారని తెలుసుకున్న వైఎస్సార్టీపీ మద్దతుదారులు పెద్దయెత్తున అక్కడికి చేరుకోవడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.