తెలంగాణలో పొలిటికల్ హీట్ ఎక్కువైంది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలను ప్రారంభించాయి. తెలంగాణలో అధికారం కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. కొత్త కొత్త వ్యూహాలతో ప్రజల ముందుకు వస్తోంది. తాజాగా తెలంగాణ నుంచి ప్రధాని మోడీ ఎన్నికల బరిలో దిగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ కూడా అందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు నుంచి సమాచారం వినిపిస్తోంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో దక్షిణాది నుంచి ప్రధాని మోడీ పోటీ చేస్తానని ఇది వరకే తెలిపారు.
దక్షిణాదికి గేట్ వేగా ఉన్నటువంటి తెలంగాణను ప్రధాని మోడీ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ వర్గాలలో ఇప్పటికే చర్చలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే మోడీకి సేఫ్ నియోజకవర్గాలుగా తెలంగాణలోని రెండు లోక్ సభ స్థానాలను బీజేపీ ఎంపిక చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ తెలంగాణ నుంచి ఎంపీగా బరిలోకి దిగటంతో దేశ రాజకీయ పరిస్థితులను మొత్తం తమ వైపు తిప్పుకున్నట్లు అవుతుందని అందరూ చర్చించుకుంటున్నారు.
ప్రధాని పోటీచేసే నియోజకవర్గంపైన బీజేపీ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోబోతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించడమే కాకుండా, కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధించాలనేది బీజేపీ గట్టిగా సంక్పలించి ముందుకు సాగుతోంది. ఈ ఏడాది దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎలాగైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
తెలంగాణ లో ముందుగా అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత 2024లో దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందే ప్రధాని మోడీ తెలంగాణలో పోటీ చేసే అంశం పైన అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది. ప్రధాని మోడీ తమిళనాడు నుంచి పోటీ చేస్తారని ఇప్పటి అందరూ అనుకున్నా ఇప్పుడు కొత్తగా తెలంగాణ నుంచి రెండు లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తారని సమాాచారం. అందులో రాష్ట్రంలోనే అతి పెద్ద లోక్ సభ నియోజకవర్గం అయిన మినీ ఇండియాగా చెప్పుకొనే మల్కాజిగిరి ఒకటి కాగా రెండోది మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం అని మరికొందరు అనుకుంటున్నారు.
