ఒక వేళ కాంగ్రెస్, తెలుగుదేశం మధ్య ఎన్నికల పొత్తు కుదిరితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ నాయుడు ఎన్నికల ప్రచారం చేస్తారా? ఇపుడు ఈ ప్రశ్న రాజకీయవర్గాల్లో మొదలయింది. ఎందుకంటే, ఎన్నికల ప్రచారమంటే, ఆయన తెలంగాణలోని అన్ని జిల్లాలో పర్యటించాలి. లేదా కనీసం తమ అభ్యర్థులు నిలబడుతున్న నియోజకవర్గాలలలో పర్యటించాలి. అక్కడ కెసిఆర్ ప్రభుత్వం విఫలమయిందని, నాలుగేళ్ల పాలన చెత్త అని, కెసిఆర్ ను ఓడించి కాంగ్రెస్ కూటమికి ఓటేయండని ప్రజలను కోరాలి. ఇది సాధ్యమా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్లారు. అక్కడేం సంచలనం రాలేదు. ఆయన వెళ్లే ముందు, హైదరాబాద్ లో కాలుమోపాక, ఇక తెలంగాణ రాజకీయాలలో ఆయన భూకంపం సృష్టిస్తారని మీడియా చెప్పింది. ఆయన కాంగ్రెస్ నేతలతోసమావేశం అవుతున్నారని, కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని, దానిని ఆయన ఖరారు చేస్తారని అన్నారు. అలాంటిదేమీ జరగలేదు.
రోటీన్ గా తెలుగుదేశం నేతలతో విస్తృత సమావేశం నిర్వహించారు. దాంట్లో తూటాలేం పేలలేదు. ఆవేశంగా ఆయన ప్రసంగించలేదు. టిఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమయిందని అనలేదు. చివరకు ఆంధ్ర పార్టీ అని తమని తరిమేయాలనుకుంటున్న కెసిఆర్ ను తరిమేయండని ఆయనేం ఆవేశపడలేదు.
సాదాసీదా సమావేశం. ఆయన హైదరాబాద్ వచ్చినపుడల్లా జరగుతున్నదే. ఇపుడూ అలాగే జరిగింది.
తెలంగాణ టిడిపి నేతల సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు చూస్తే, ఆయన తెలంగాణలో చాలా జాగ్రత్తగా మసలు కోవాలని అనుకుంటున్నారని, ఆంధ్రలో ఉన్నంత అగ్రెసివ్ గా తెలంగాణలో టిడిపిని నడపలేరని అర్థమవుతుంది. తెలంగాణ టిడిపి నేతలతో ఆయన మాట్లాడిన తీరు నుంచి దీనిని అర్థం చేసుకోవచ్చు.
తెలుగుదేశం పార్టీని తెలంగాణ నుంచి తరిమేయడం కెసిఆర్ లక్ష్యం. అసలు తెలంగాణ ఉద్యమం టిడిపికి వ్యతిరేకంగా , అందునా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కమ్మ వారి పెత్తనానికి వ్యతిరేంగా వచ్చిందే. నిర్మొహమాటంగా చెబితే కృష్ణా , గుంటూరు జిల్లాల కమ్మవారికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమమే. 1969 లో ఉద్యమం నినాదం గో బ్యాక్ ఇండ్లీ సాంబార్. అది అప్పటి ఆ రెండు జిల్లాల బిజినెస్ కల్చర్. ఇటవలి తెలంగాణ ఉద్యమం ‘కరీపాయంట్స్’ని కమ్మ డామినేషన్ లేదా ఆంధ్ర డామినేషన్ సింబల్ గా తీసుకున్నారు కెసియార్. అందుకే ఆయన టిడిపి ని అంధ్రా (కమ్మ) పార్టీగా ఛీకొడతారు. ఇపుడు కాంగ్రెస్ తో టిడిపి కలవకుండా ఉండేందుకు, ‘త్తూ, ఆంధ్ర పార్టీతో కాంగ్రెస్ తో కలుస్తుందా?రోత, అసహ్యం, ’ అని అనగలిగారు. (కెసిఆర్ టిడిపితో కలసినపుడు ఆ పార్టీ గంగలో మునిగి వచ్చి పవిత్రంగా ఉండిందేమో, కెసిఆర్ చెప్పాలి.)
ఇపుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కలిసే పరిస్థితి రావడం కెసిఆర్ కు ఇబ్బందికరమయిన మలుపే. ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ ని తెలంగాణ నుంచి ఆయన తరిమేయలేకపోయారు. ఆ పార్టీకి ఇంకా బలం ఉందని, కాంగ్రెస్ తో కలిస్తే పెరుగుతుందనే భయం టిఆర్ ఎస్ నేతలో ఉంది. అలాగే టిడిపికి ఇంకా వోట్ బ్యాంక్ ఉందని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతూ ఉంది. అందుకే ఈ రెండు పార్టీల కలవకుండా ఏమేమి చేయాలో అవన్నీ చేసేందుకు కెసిఆర్ సిద్దం. ఇందులో భాగంగానే ఆయన వోట్ ఫర్ నోటో (వోటుకు నోటు) కేసుదర్యాప్తును పైకి తీసుకువచ్చి, టిఆర్ ఎస్ లోని చోటా లీడర్ల చేత చంద్రబాబు మీద స్టేట్ మెంట్స్ ఇప్పించి బెదరగొట్టే అవకాశం ఉంది. ఈ భయం చంద్రబాబులో కూడా ఉన్నట్లే ఉంది.
తెలంగాణ ఎన్నికల్లో నిజంగా టిడిపి గెలిచి ఒక శక్తిగా ఎదగాలనుకుంటే పార్టీ శ్రేణుల్లో కసి, ఉత్సాహం నింపేలా చంద్రబాబు మాట్లాడి వుండాల్సింది. అయితే కెసిఆర్‌తో గొడవలే వొద్దు…పొత్తుల విషయం మీకే వదిలేస్తున్నా, మీరు నిర్ణయించుకోండి…నేను మీకు అండగా ఉంటాను, ఇలా పెద్ద మనిషి లాగా ఉప్పుకారం లేని చప్పడి మాటలు చెప్పి సమావేశం ముగించారు.
నిజానికి చంద్రబాబే కాదు, ఏపార్టీ నాయకుడయినా పొత్తుల వంటి కీలకవిషయాన్ని ఇలా స్థానిక నాయకులకు వదిలేస్తారా. మరి చంద్రబాబు ఎందుకు చప్పిడి మాటలు మాట్లాడాల్సి వచ్చిందనేది ప్రశ్న.
చంద్రబాబు నాయుడు ఒక వేళ ఉధృతంగా టిఆర్ ఎస్ కు , కెసిఆర్ కు వ్యతిరేక క్యాంపెయిన్ చేస్తే ఏమవుతుంది?
ముందస్తు ఎన్నికల తర్వాత , ఒక వేళ టిఆర్ ఎస్ అధికారంలోకి వస్తే, కెసిఆర్ ఊరు కుంటాడా. నోట్ ఫర్ వోట్ (వోటుకు నోటు) కేసు ను బయటకు తీసి, దాడులు అరెస్టులని అల్లకల్లోలం చేయిస్తే, ఆంధ్ర ఎన్నికల మీద దాని ప్రభావం పడుతుంది. వైసిపి దానిని వాడుకుని నానా యాగి చేస్తుంది. ధైర్యంగా అక్కడ క్యాంపెయిన్ చేయలేని పరిస్థితి వస్తుంది. అందుకే ఆయన సురక్షితమయిన మార్గం ఎంచుకుని తెరవెనక నిర్ణయం తీసుకుని తెరముందు అన్ని విషయాలు తెలంగాణ టిడిపికి వదిలేశానని చెబుతున్నాడు. క్యాంపెయిన్ చేయకుండా దూరంగా ఉండాలనుకుంటున్నారు.
ఇది తెలుగుదేశం వర్గాల్లో కొంత అసంతృప్తికి కారణమయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే, అన్ని పార్టీ అధినేతలు క్యాంపయిన్ కోసం వస్తున్నారు. కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, బిజెపి తరఫున అమిత్ షా పబ్లిక్ న కనబడుతున్నారు. అయితే, టిడిపి తరఫున స్టార్ క్యాంపెయినర్ ఎవరు? చంద్రబాబు క్యాంపెయిన్ చేయకపోతే, కాంగ్రెస్- టిడిపి ల మధ్య వోట్ ట్రాన్స్ ఫర్ జరగుతుందా?
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలి, అయితే, కెసిఆర్‌తో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్న ఆలోచనలో టిడిపి బాస్ ఉంటే ఎలా?
రాష్ట్రంలో ఎట్లాగూ గెలిచి పవర్ లోకి వచ్చేది లేదు, అంత మాత్రానికి కెఆర్‌తో విరోధం ఎందుకనే ధోరణితో చంద్రబాబు ఉన్నట్లు ఉన్నారు. పార్టీ బతికితే చాలు. ఎక్కువ సీట్లకోసం వత్తిడి చేయకుండా ఇచ్చినకాడికి తీసుకుని సంతృప్తి పొందండని తెలంగాణ తమ్ముళ్లకు సలహా ఇచ్చినట్లు సమాచారం.
2014 ఎన్నికల్లో పూర్తిగా అంతరించిపోలేదు, 2019లో కూడా తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం వాణి వినిపించాలి. అది చాలు అని టిడిపి నేత భావిస్తున్నారు. దీనికి సహకరించేందుకు కాంగ్రెస్ రెడి గా ఉంది. మరలాంటపుడు కెసిఆర్ ను విమర్శించి రచ్చ చేసుకోవడం ఎందుకు? మరీ ముఖ్యంగా కెసిఆర్ తిట్లకు తిట్లతోసమాధానం చెప్పే శక్తి చంద్రబాబుకు ఎక్కడిది?
ఈ దోరణి వల్ల చంద్రబాబు క్యాంపెయిన్ చేయకపోతే, ప్రయోజనం ఉంటుందా అనే శంక తెలంగాణ టిడిపి వర్గాల్లో మొదలయింది.