వినటానికి విచిత్రంగానే ఉన్నా నిజ్జంగా నిజం. తెలంగాణాలో ఎన్నికలకు ఎక్కడో ఏపిలో ఉన్న గుంటూరు జిల్లాకు ఏమిటి సంబంధమని ఆలోచిస్తున్నారా ? అయితే మీరు ఈ కథనం చదవాల్సిందే. తెలంగాణాలో ఎన్నికల వేడి బాగా రాజుకున్న విషయం అందరికీ తెలిసిందే. అభ్యర్ధుల నామినేషన్ల ఘట్టమైపోయింది. గురువారంతో ఉపసంహరణల ఘట్టం కూడా అయిపోతుంది. అప్పటికి గానీ ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీలో ఉండేది నికరంగా తెలీదు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అన్నీ పార్టీల తరపున అభ్యర్ధులు ఫైనల్ అయిపోయారు. కాబట్టి వారికి నామినేషన్ల ఉపసంహరణలతో పనిలేదు. కాబట్టి ప్రచారం మొదలుపెట్టేశారు.
ఇక్కడే అందరికీ గుంటూరు అవసరం వచ్చింది. ఎందుకంటే, అభ్యర్ధులన్నాక ప్రచారం తప్పదు కదా ? ప్రచారం చేయాలంటే ఇఫుడందరూ ప్రచార రథాలనే ఎక్కువగా వాడుతున్నారు. జీపులు, ఆటోలు ఇతరత్రా మార్గాలున్నా ప్రత్యేకంగా ప్రచార రథాన్ని తయారు చేయించుకుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ప్రచార రథాలకు గుంటూరు జిల్లా పెట్టిది పేరు. అందుకే అన్నీ పార్టీల అభ్యర్ధులూ గుంటూరు జిల్లా మీదే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
జిల్లాలోని తెనాలి, గుంటూరు నగరం, చిలకలూరిపూట, పొన్నూరు, వేమూరు తదితర ప్రాంతాల్లో ప్రచార రథాలు తయారు చేసే వారు ఎక్కువగా ఉన్నారట. అభ్యర్ధుల అవసరానికి తగ్గట్టుగా వారి అభిరుచులకు తగ్గట్లుగా ప్రచార రథాలు తయారు చేయటంలో పై ప్రాంతాల్లో నిపుణులున్నారట.
వారి పనితనం గమినించిన వారు కాబట్టి టిఆర్ఎస్, మహాకూటమి, బిజెపి అభ్యర్ధులు గుంటూరు జిల్లాకు పరుగులు పెడుతున్నారు. తెలంగాణాలోని 119 నియోజకవర్గాలకు గాను 100 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్ధులు గుంటూరు జిల్లాలోనే తమ ప్రచార రథాలను తయారు చేయించుకుంటున్నారంటేనే తెలంగాణా ఎన్నికల్లో గుంటూరు ఎంత కీలకంగా మారిందో అర్ధమైపోతోంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్, జూబ్లిహిల్స్, శేరిలింగంపల్లి, కుకట్ పల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, మేడ్చల్, సనత్ నగర్, కంటోన్మెంట్ నియోజకవర్గల్లోనే కాకుండా ఖమ్మం జిల్లా, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోనే ఎక్కువ ప్రచార రథాలు చేయించుకున్నట్లు సమాచారం.